ఏపీ బడ్జెట్ సమావేశాలు  ఎన్నిరోజులో తెలుసా ?

వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ ఆమోదించుకుని చరిత్ర సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మరో  బ్యాడ్ ‘రికార్డ్’ సృష్టించేందుకు సిద్దమవుతోంది. నిజానికి మార్చిలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగవలసింది . అయితే, దేనికీ అడ్డురాని కరోనా సెకండ్ వేవ్’ను సాకుగా చూపించి ప్రభుత్వం, అసెంబ్లీకు సమావేశాలకు పంగనామాలు పెట్టింది. మూడు నెలల కాలానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం రూపొందించిన ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ ను ఆర్డినెన్సు కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.గవర్నర్ అనివార్యంగా ఆమోద ముద్రవేసారు. 

అప్పట్లోనే ప్రభుత్వ నిర్ణయాన్నిప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ తప్పు పట్టింది. అంతకు ముందు సంవత్సరం కూడా  ఆర్డినెన్సు రూపంలోనే బడ్జెట్ ఆమోదం పొందిన నేపధ్యంలో వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్’లో బడ్జెట్ ఆమోదించడం, సరికాదని ఆర్థిక రంగ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్త పరిచారు.ఆర్థిక క్రమశిక్షణ గది తప్పుతుందని హెచ్చరించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించింప్పుడు, ఏపీకి వచ్చిన ప్రత్యేక ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా, మొరటుగా ప్రతిపక్షాలను పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలకు ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ను ఆర్డినెన్సు రూపంలో కానిచ్చేసింది. 

అయితే ఇప్పుడు ఆ మూడు నెలల కలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపధ్యంలో, ఈనెల మూడవ వారంలో, 21 లేదా 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, బడ్జెట్ సమావేశాలు ఎన్ని రొజూలు నిర్వహిస్తారు, అనే విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేక పోయినప్పటికీ, ఒకే ఒక్క రోజులో ‘బడ్జెట్ క్రతువును’ కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, ఆమోదం అన్నీ ఒకే రోజులో కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావించవలసి ఉంటుంది. అదే, జరిగితే, ఇప్పటికే వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు రూట్ లో బడ్జెట్ క్రతువు కానిచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక రోజు బడ్జెట్ సమావేశాలు నిర్వహించి కొత్త అపప్రదను మూట కట్టుకున్నట్లు అవుతుంది.