Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంద్ర, తెలంగాణా దోస్తీ కుదిరింది
posted on: Sep 30, 2014 9:27AM
.jpg)
ఆంద్ర తెలంగాణా ప్రభుత్వాల మధ్య మొదటిలో కనబడిన ఘర్షణ వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పడుతోందని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చును. అటువంటిదే మరో ఉదాహరణ రెండు రాష్ట్రాలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని ఒడిష రాష్ట్రంలో నౌపార వద్దగల సర్పాల్ బొగ్గు గనులను అభివృద్ధి చేసుకొని, అందులో వచ్చే బొగ్గును సమానంగా వాటాలు పంచుకోవాలని అంగీకరించడం ఒకటని చెప్పుకోవచ్చును. ఇటీవల సుప్రీం కోర్టు 1993 నుండి వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసింది. కానీ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ బొగ్గు గనులను మాత్రం రద్దు చేయకపోవడంతో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు సిద్దపడినట్లయితే, ఆ గనిలో లభ్యమయ్యే 280 మిలియన్ టన్నుల బొగ్గును దక్కించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే సానుకూలంగా స్పందించారు.
తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రెండు రాష్ట్రాలకు ఇది ఊహించని వరమని చెప్పవచ్చును. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నప్పటికీ నిత్యం బొగ్గు కొరతతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక వరమని చెప్పవచ్చును. ఈ బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న ఓడిషా రాష్ట్రంలో ఉండటం వలన రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా తెలంగాణకు అక్షయపాత్ర వంటి సింగరేణి బొగ్గు గనులున్నప్పటికీ ఇప్పుడు అదనంగా లభిస్తున్న ఈ బొగ్గును అవసరమయితే వాడుకోవచ్చును, లేదా తెలంగాణాలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేసుకొనేవరకు తన వాటాను కూడా ఆంధ్రాకే అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చును.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఏపీ జెన్ కో మరియు ఏపీ మినరల్ డేవలప్మెంటు సంస్థలకు ఈ బాధ్యత అప్పగిస్తే, తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా జెన్ కో సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ఆ మూడు సంస్థలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని నౌపారాలో బొగ్గును త్రవ్వి వెలికి తీసి చెరిసగం సమానంగా పంచుకొనేందుకు సిద్దమవుతున్నాయి. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరువురూ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో, సంబంధిత అధికారులు సంయుక్త సంస్థ ఏర్పాటుకు అవసరమయిన విధివిధానాలు, దానికి అధికారుల నియామకాలు తదితర అంశాలపై కసరత్తు త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదే విధంగా మిగిలిన వ్యవహరాలలో కూడా రెండు ప్రభుత్వాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణి అవలంభిస్తే, రెండు రాష్ట్రాలు సమానంగా వేగంగా అభివృద్ధి సాధించగలవు.


.jpg)
.jpg)


