ఎల్లికల్లులో నాలుగు శతాబ్దాల నాటి సూక్ష్మ ఆంజనేయ విగ్రహం

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి కల్వకుర్తికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం(నవంబర్ 6) గ్రామ శివారులోని శిథిల శివాలయాన్ని, అందులో ఉన్న భిన్నమైన మూడు నంది విగ్రహాలను, కప్పు రాలి పగిలిపోయిన మండపం, నిధుల వేటగాళ్ల గడ్డపారులకు బలైన గర్భాలయాన్ని పరిశీలించారు. చుట్టూ ప్రాకారంతో ఉన్న శిధిల శివాలయాలను పదిలపరిచి, నంది శిల్పాలను గ్రామంలో పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.  అనంతరం గ్రామంలోని శివాలయం ధ్వజస్తంభం పీఠం పైన 6 అంగుళాల ఎత్తు నాలుగు అంగుళాల వెడల్పు రెండు అంగుళాల మందంగల సున్నపురాతితో చెక్కిన సూక్ష్మ ఆంజనేయ విగ్రహం, అదే కొలతలతో గణేష్ విగ్రహం ఉన్నాయని, విజయనగర కాలానికి చెందిన 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకొని, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల ముత్యాల రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.
Publish Date: Nov 6, 2024 7:46PM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా 

ఎమ్మెల్యేల అనర్హతపై  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.  పార్టీ ఫిరాయించిన పార్టీ  ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదాపడింది.  ఈ కేసు విచారణ రేపటికి వాయిదా వేస్తూ డివిజన్ బెంచ్    నిర్ణయం తీసుకుంది.  సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను అసెంబ్లీ కార్యదర్శి ఆశ్రయించారు. రేపు కూడా వాదనలు జరుగనున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున  లాయర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు  ఉంటుందని లాయర్ కోర్టులో వాదించారు. ఎమ్మెల్యేల తరపున లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోరారు
Publish Date: Nov 6, 2024 6:19PM

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంపై ఐటీ సోదాలు

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు ఒకరి తరువాత ఒకరు చిక్కుల్లో పడుతున్నారు. వైసీపీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత ఈ ఐదు నెలల కాలంలో పలువురు నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకం, దోపిడీ, దాడులు, దౌర్జన్యాల కారణంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు. గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆయన జేనసేనాని పవన్ కల్యాణ్ పై  8300 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే 2024 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుపై 13,726 ఓట్ల తేడాతో  పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ తరుణంగా గ్రంథా నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్రాంధి నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీ, కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఆయన కార్యాలయలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.   
Publish Date: Nov 6, 2024 4:31PM

తెలంగాణలో ఇంటింటి కుటుంబసర్వే షురూ

తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం( నవంబర్ 6) ప్రారంభమైంది.  సర్వే ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.  ప్రతీ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి  ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహిస్తారు. ఎక్కువగా టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటం విశేషం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకయ, కుల సమగ్ర సర్వే  చేయాలని తెలంగాణ ప్రభుత్వం  వీరిని నియమించింది.  కుటుంబసర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి.  ఫామ్ 1లో మొత్తం 58 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుతారు. ఫామ్ 2లో 17 ప్రశ్నలుంటాయి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను కోరింది. 
Publish Date: Nov 6, 2024 4:00PM

ట్రంప్ జయభేరి.. సంబరాలలో మద్దతుదారులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. హోరాహోరీ తప్పదన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన సునాయాసంగా విజయం సాధించారు. అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి అవసరమై 274 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దాటేశారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తేలిపోయారు.  ఫ్లోరిడా, మిసిసిపి, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, యూటా, వయోమింగ్, నెబ్రాస్కా, మోంటానా, టెన్నిసీ, అలబామా, ఐడహో రాష్ట్రాలలో  ట్రంప్ విజయదుందుభి మోగించారు. అలాగే స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలలో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించి పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్, నెవడా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో  కూడా ట్రంప్ సంపూర్ణ ఆధిక్యత కనబరిచారు. దీంతో  అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీవాన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆయ‌న‌ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వారు.   గత ఏడాది వరకూ ఆంధ్ర యూనివర్సిటీలో  ప్రొఫెసర్‌గా ప‌నిచేసిన‌ శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. దీంతో ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్య‌క్షుడు కానున్నారు. ఉష చిలుకూరి  పేరెంట్స్‌ ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉష  అక్కడే పుట్టి పెరిగారు.    
Publish Date: Nov 6, 2024 3:24PM

పరారీలో వర్రా రవీందర్ రెడ్డి... కడప పోలీసులపై చంద్రబాబు సీరియస్!

పోలీసులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలే అనిపిస్తున్నది. సామాజిక మాధ్యమంలో  ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఇష్టారీతిగా, అడ్డగోలుగా అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు చేసి విడిచి పెట్టేశారు. 41ఎ నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు రావలని చెప్పి గౌరవంగా సాగనంపారు. అలా సాగనంపడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్రభుత్వ ఆగ్రహంతో వర్రాను అదుపులోనికి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అతడి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు ఇలా వదిలిపెట్టగానే  వర్రా రవీంద్రారెడ్డి అలా పరారైపోయారు.  వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాతా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నాయకురాళ్లపై అసభ్య పోస్టులు పెట్టారు. పలు ఫిర్యాదుల మేరకు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి కడపకు తరలించి విచారించారు. అయితే బుధవారం తెల్లవారు జామున ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం చూస్తుంటూ వారింకా వైసీపీ అనుకూల మోడ్ లోనే ఉన్నారని అనిపించక మానదు.  వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల సహా పలువురు అప్పటి విపక్ష నేతలపై వర్రా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.  అటువంటి  వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 41ఎ నోటీసులు ఇచ్చి వదిలేయడం  ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి అనుకూలంగా  పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. వర్రా రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  వర్రా రవీందర్ రెడ్డిని అలా ఎలా వదిలేశారంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం కడప పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  కడప పోలీసులు అలర్టై వర్రా రవీందర్ రెడ్డి కోసం గాలింపు ప్రారంభించారు. అయితే పోలీసుల విడిచి పెట్టిన మరుక్షణమే వర్రా రవీందర్ రెడ్డి పరారీ అయ్యారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  వర్రా రవీందర్ రెడ్డి పరారీ విషయం తెలుసుకున్న వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయాలని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.   ఇలా ఉండగా వర్రా రవీందర్ రెడ్డికి 41ఎ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రావాలని ఆదేశించారు. ఆ వెంటనే మరో కేసులో విచారణ కోసం అదుపులోనికి తీసుకో వాలని భావించినప్పటికీ అప్పటికే వర్రా పరారయ్యాడు.  వర్రా ఆచూకీ కోసం ఆతని భార్య, సోదరుడు, మరదలును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  వర్రా రవీందర్‌ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరా బాద్‌లలో పలు కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా అతడిని విడిచిపెట్టడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
Publish Date: Nov 6, 2024 2:45PM