‘‘అసలు ఈ సీఎం హిందువేనా?’’.. ఇందకీలాద్రిపై భక్తుల ఆగ్రహం.. 

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు, టీటీడీలో నెలకొన్న వివాదాలు, బెడవాడ దుర్గమ్మ గుడిలో జరిగిన పరిణామాలతో ఇవి మరింత బలపడ్డాయి. అయినా ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వైభవంగా జరగాల్సిన బెజవాడ దుర్గమ్మ నవరాత్రోత్సవాల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఇందకీలాద్రిపై దసరా రోజున దర్శన విధానం తీవ్ర విమర్శలపాలైంది. వీవీఐపీ, వీఐపీల క్యూల్లో వెళ్లినవారికి దర్శనం చకచకా జరిగిపోగా.. ఉచిత దర్శనం, టికెట్లు కొనుగోలు చేసిన క్యూలలో దర్శనానికి ఐదారు గంటలు పట్టడంతో భక్తులు అసహనంతో రగిలిపోయారు. అమ్మవారిని త్వరగా దర్శనం చేసుకుని వెళ్లిపోదామని వచ్చిన భక్తులకు, దూరప్రాంతాల నుంచి వచ్చినవారికి దర్శనం ఆలస్యమవడంతో సహనం కోల్పోయారు. దసరా రోజున భక్తులకు దర్శనానికి ఐదారు గంటల సమయం పట్టడంతో  కోపోద్రిక్తులయ్యారు. సీఎం డౌన్‌డౌన్‌.. సీఎం డౌన్‌డౌన్‌  అంటూ భక్తులు ఇంద్రకీలాద్రిపై నినాదాలు చేశారు. 

పోలీసులు వారించినా భక్తులు వినిపించుకోలేదు. ‘‘అసలు ఈ సీఎం హిందువేనా?’’ అంటూ ఓ భక్తుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. అలా కొద్దిసేపు నినాదాలు చేయడంతో క్యూలు వేగంగా ముందుకు కదిలాయి. ఇందకీలాద్రిపై దసరా రోజున చేసిన ఏర్పాట్లపైనా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై వివక్ష చూపుతుందని కొందరు ఆరోపించారు. మొత్తానికి దసరా పండుగ రోజున ఇందకీలాద్రిపై సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపించడం సర్వత్రా చర్చగా మారింది.