Top Stories

లెక్కలు లేకపోతే చిక్కులే.... జాతీయ గణిత దినోత్సవం2024..!

  గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా? మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయేదాక లెక్కలు మన జీవితంలో భాగంగా ఉన్నాయి.  చిన్న పిల్లల చాక్లెట్ల లెక్క నుంచి సైంటిస్టుల రాకెట్  లాంచింగ్ దాకా ఈ లెక్కలు అన్ని చోట్లా ఉపయోగపడుతున్నాయి. డబ్బు మీద నడిచే ఈ కాలంలో లెక్కలు, గణాంకాలు లేకుండా ఏదీ జరగదు. మరి అలాంటి గణితమంటే మనలో చాలామందికి  అదేదో పెద్ద అర్ధం కానీ మిస్టరీలా అనిపించి, వింటేనే వణుకు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇష్టపడితే దీనంత ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు అంటారు గణిత ప్రియులు. ప్రపంచ నడకకి అడుగడుగునా అవసరమయ్యే ఈ గణిత శాస్త్రం మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. గణిత శాస్త్ర చరిత్రలో భారత గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైనది. అందులో శ్రీనివాస రామానుజన్ గారిది ప్రత్యేక స్థానం. అందుకే  గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్ధం ఆయన పుట్టినరోజయిన  డిసెంబర్ 22వ తేదీని ప్రత్యేక దినంగా  గుర్తించారు. రామానుజన్ గారి  125వ జయంతి సందర్భంగా 2012, డిసెంబర్22వ తేదీన,  భారత ప్రభుత్వం  అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించింది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా నంబర్ థియరీ, పార్టిషన్ ఫంక్షన్ లు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.  ప్రత్యేకమైన ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటే.. గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ .. శ్రీనివాస రామానుజన్  1887 లో,  తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నాణ్యమైన విద్య అందకపోయినా  తన  12 వ ఏటనే త్రికోణమితిలో తన ప్రావీణ్యాన్ని చూపారు. రామానుజన్  14 వ ఏట మద్రాసులోని పచాయప్ప కాలేజీలో చేరి ఇతర సబ్జెక్టులలో ఫెయిలైనా కూడా, గణితంపై మాత్రం  స్వతంత్ర పరిశోధన చేశారు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగం పొందేందుకు రామస్వామి అయ్యర్ సాయం చేశారు. అలా అక్కడ పని చేసుకుంటూనే ఆయన రకరకాల గణిత సిద్ధాంతాలు నోట్సుల్లో  రాసుకునేవారు. 1913 లో ఆయన సిద్ధాంతాలని చూసి ఆశ్చర్యపోయిన కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త  GH హార్డీ, రామానుజన్‌ను లండన్‌కు ఆహ్వానించారు. అలా అక్కడ  రామానుజన్ గణితం మీద మరింత కృషి చేశారు.  1918 లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన అతితక్కువ వయస్కుల్లో రామానుజన్ ఒకరు. ఆయన రాసిన చాలా గణిత సిద్ధాంతాల  మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రంలో  చేసిన కృషి దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప  ప్రభావం చూపింది.  నేటి తరానికి గణిత దినోత్సవం.. జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ కృషిని స్మరించుకోవటానికి మాత్రమే కాకుండా, గణితంపై నేటి తరం వారికి ఆసక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామానుజన్ రూపొందించిన త్రికోణమితి సిద్ధాంతాలు, మన డైలీ లైఫ్ లో వాటి ఉపయోగాలు గురించి తెలుసుకున్నప్పుడు త్రికోణమితి మీద ఆసక్తి పెరగడం ఖాయం. రామానుజన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాలు  "ది మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ"  లాంటివి చూడడం వల్ల పిల్లలకి   గణితం పట్ల ప్రేమ పెరుగుతుంది.  ప్రతి విద్యార్థిలో కొన్ని బలాలు,  బలహీనతలు ఉంటాయి. వారిలో బలహీనతలని ఎత్తి చూపించకుండా వారికి నచ్చిన దానిలో ప్రోత్సహిస్తే ఎంత మంచి జరుగుతుందో  రామానుజన్ జీవితం సమాజానికి ఒక ఉదాహరణగా, పిల్లలకి ప్రేరణగా నిలుస్తుంది. 2024 థీమ్.. జాతీయ గణిత దినోత్సవం 2024 కు  "గణితం: ఆవిష్కరణ, పురోగతికి వంతెన" అనే థీమ్ ఎంచుకోబడింది. నానాటికీ పెరుగుతున్న సాంకేతికత,  సైన్స్ ద్వారా చేస్తున్న ఆవిష్కరణల డెవలప్మెంటుకి   గణిత సూత్రాలు ఎలా ఆధారం అవుతున్నాయనే విషయాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.  గణితంపై ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ  రామానుజన్ జీవితాన్ని కృషిని స్మరించుకుంటూ.. రామానుజన్ లాంటి గణిత శాస్త్రవేత్తలుగా మారేవైపు నేటి తరం అడుగులు వెయ్యాలి.                         *రూపశ్రీ. 
Publish Date: Dec 22, 2024 9:30AM

రామ్ గోపాల్ వర్మకు బిగ్‌ షాక్‌.. ఆ డ‌బ్బు చెల్లించ‌కుంటే జైలుకే!

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు అన్నీఇన్నీకావు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  వైసీపీ నేత‌ల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్రజ‌లు ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించిన సొమ్మును జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ప‌నంగా తన అనుచ‌ర గ‌ణానికి, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు. ఏపీ విజిలెన్స్ విభాగం ఫైబ‌ర్ నెట్‌, డిజిట‌ల్ కార్పొరేష‌న్, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ల‌లో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణలో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ డ‌బ్బు తీసుకొని వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌కు ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రో నిర్మాత‌లు ఇచ్చింది కాదు,  ప్ర‌భుత్వం సొమ్మేన‌ని తేటతెల్లమైంది. అంతే కాదు.. డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా, ఫైబ‌ర్ నెట్ ద్వారా, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ ద్వారా వైసీపీ కుటుంబ స‌భ్యుల‌కు, వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు భారీ మొత్తంలో జీతాలు చెల్లించేశారు. వీరంతా సోష‌ల్ మీడియా ద్వారా అప్పటి ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని, జ‌గ‌న్‌తో రాజ‌కీయంగా విభేదించిన ఆయ‌న‌ చెల్లిని, త‌ల్లిని విమ‌ర్శించ‌డంతోపాటు, అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూసించేవారు.   వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం, శ‌పథం అనే రెండు సినిమాల‌ను తీశారు. రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాలు తీసే స‌మ‌యంలోనే.. ఈ సినిమాలు తీసేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డానికి.. వైఎస్ఆర్‌, వైఎస్‌ జ‌గ‌న్ రెడ్డిని పొగ‌డ‌టానికి అని బొమ్మ‌ల ద్వారా త‌న‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ మేలు చేసేలా తీసిన వ్యూహం సినిమాను ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో విడుద‌ల చేశారు. ఇందుకుగాను పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ ద్వారా రూ.2.10కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంగోపాల్ వ‌ర్మ‌కు సంబంధించిన ఒక సంస్థ‌కు సుమారు 1.10 కోట్లు చెల్లించిన‌ట్లు ఏపీ విజిలెన్స్ విభాగం విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో రూ.90ల‌క్ష‌లు పెండింగ్‌లో ఉండ‌గా..  పెండింగ్ సొమ్ము చెల్లించ‌వ‌ద్ద‌ని ఫైబ‌ర్ నెట్ కొత్త కార్య‌వ‌ర్గానికి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది. అదేవిధంగా మ‌మ్ముట్టి  క‌థానాయ‌కుడిగా తీసిన యాత్ర‌-2 సినిమాకు కూడా రూ.2.10 కోట్లు ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా కేటాయించారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు ఎండీగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. వీరి ఆధ్వ‌ర్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ప్ర‌భుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించార‌ని తెలుస్తోంది. వీరంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి క‌టుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో, మార్పింగ్ పొటోల‌తో పోస్టులు చేసేవారు. వీరిలో కొంద‌రు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.  తాజాగా  సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది ఏపీ స‌ర్కార్‌. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు.  ఈ విష‌యంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్  ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.
Publish Date: Dec 22, 2024 5:38AM

ష‌ర్మిల‌కు చెక్‌పెట్టే ప‌నిలో జ‌గ‌న్‌.. జగన్ కు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి రాహుల్!

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోకి క్యూ క‌డుతున్నారు. మ‌రోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, త‌న చెల్లి ష‌ర్మిల‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఆరంభించారు‌. ముఖ్యంగా ఆమెను ఏపీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ఢిల్లీలో  ఆయ‌నకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ లో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి వైస్ ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. అయితే, సీఎంగా జ‌గ‌న్‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఆస్తుల విష‌యంలోనూ వారిమ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ష‌ర్మిల‌..  ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ఆమె విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో వైఎస్ ష‌ర్మిల‌కూడా ఒక‌రు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల త‌రువాతా కూడా జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ష‌ర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు ష‌ర్మిల విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి‌. దీంతో ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా   పావుల‌ను క‌దిపేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తోంది.  ఏపీ కాంగ్రెస్ లో ష‌ర్మిల నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది‌. షర్మిల నాయకత్వంపై కొంత‌కాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి   ఫిర్యాదులు రూడా చేశారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దల‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కేంద్ర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న‌వారి ద్వారా ష‌ర్మిలను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముఖ్య‌ అనుచ‌రులుగా కొన‌సాగిన నేత‌లు కొంద‌రు ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. వారంద‌రితో ఇటీవ‌ల‌ జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జ‌గ‌న్‌, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ   చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్, జ‌గ‌న్ ఒక‌రికొక‌రు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై  వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌జరిగిందని తెలుస్తోంది. అయితే, అంత‌కుముందే వైసీపీలో చేరే విష‌యంపై జ‌గ‌న్‌, శైలజానాథ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం ఉంది. వ‌చ్చే రెండు నెల‌ల్లో శైల‌జానాధ్ తోపాటు మ‌రో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  మ‌రోవైపు  ఇప్ప‌టికే ఏపీ కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా ప‌రిణామాల‌పై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్య‌నేత‌ల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి‌. ఏపీలోని ఓ సీనియ‌ర్‌ నేత‌, తెలంగాణ‌కు చెందిన ఓ కీల‌క నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  అధికారం కోల్పోయిన త‌రువాత వైసీపీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌గ‌న్‌కు ముఖ్య అనుచ‌రులుగా పేరున్న నేత‌లు సైతం వైసీపీని వీడి కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీలోని ముఖ్య‌నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా రాహుల్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారు ప‌లువురు వైసీపీ నేత‌లతో మంత‌నాలు జరిపినట్లు స‌మాచారం. ష‌ర్మిల నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు రాహుల్ టీంకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వారంతా వ‌చ్చే రెండు నెల‌ల్లో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ రంగంలోకి దిగ‌గా.. వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌ట్టి షాకిచ్చేందుకు రాహుల్ టీం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో  చూడాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.
Publish Date: Dec 22, 2024 5:16AM

అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది: రేవంత్ రెడ్డి 

సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి  హాల్ లో కూర్చున్నాడని అన్నారు.   రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి  వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు  డిసిపి అల్లు అర్జున్ కు  అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో  కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. 
Publish Date: Dec 21, 2024 2:57PM