విడదల రజినీ అవినీతి లీలలు ఇన్నిన్ని కావయా?!

సైబరాబాద్ మెక్క, మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోందా? అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడిన విడదల రజని ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదా అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

పల్నాడు స్టోన్ క్రషన్ యాజమాన్యం ఏకంగా విడదల రజినీపై తమ నుంచి రెండున్నర కోట్లు వసూలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉండగా విడదల రజిని అక్రమాలపై పలువురు బాధితులు హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలన్నిటిపై విచారణ జరుగుతోంది. రజినీ బాధితుల్లో సామాన్యుల నుంచి బడా బడా వ్యాపారుల వరకూ ఉన్నారు. ఇక కబ్జాల ఆరోపణలైతే లెక్కే లేదు. ఇక  జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటీ 16 లక్షల రూపాయల కమిషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.  కేసు నమోదు అయ్యేలోగానే జగ్రత్తపడిన విడదలరజినీ రైతులకు ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారని చెబుతారు.  

అదే విధంగా  2024 ఎన్నికల ముందు చిలక‌లూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని తన వద్ద విడద‌ల ర‌జ‌నీ ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి రాజేశ్‌ నాయుడు ఆరోపించారు. ఆ సొమ్ము వెనక్కు ఇచ్చేయాలని పట్టుబట్టారు. దీంతో కొంత మొత్తం రజినీ తిరిగి ఇచ్చేశారు. అయితే మిగతా సొమ్ము కోసం ఆయన గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఇబ్బందులు, కేసులతో అసలే ఉక్కిరి బిక్కిరి అవుతున్న రజినీ  నాడు నేడు పనుల్లో పాల్పడిన మరో అవినీతి బాగోతం బయటకు వచ్చింది.

చిలకలూరి పేటలోని శారద హైస్కూల్ లో నాడు నేడు పనుల పేరు చెప్పి 40 లక్షల రూపాయలను రజనీ నొక్కేశారంటూ ఆ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. నాడు నేడు పనులలో అవినీతి, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడింది.  ఇప్పుడు విడదల రజినిపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో కూడా రజినీకి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు.