Latest News

వైసీపీ సహకరించే ప్రతిపక్షం కాదు!

posted on: Jul 1, 2014 2:15PM

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పట్టుదలగా కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళకు అడ్డుపడే ప్రతిపక్షంలా కనిపిస్తోందే తప్ప, రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ప్రతిపక్షంలా కనిపించడం లేదు. అసెంబ్లీలో జగన్‌గానీ, జగన్ పార్టీ నాయకులు గానీ చంద్రబాబును ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టే ఉద్దేశంలో కనిపిస్తున్నారే తప్ప మరోలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలు పరిష్కారమవ్వాలంటే ప్రభుత్వానికి ప్రజలతోపాటు అన్ని వర్గాలూ సహకరించాల్సిన అవసరం వుంది. అయితే జగన్ పార్టీ మాత్రం చంద్రబాబు సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత కలగటం కోసం ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. రైతుల రుణమాఫీ విషయంలో తాను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తుంటే, అందుకు సహకరించడం మానేసి రైతు రుణ మాఫీ హామీ ఇవ్వడమే పెద్ద నేరమన్నట్టుగా జగన్ పార్టీ నాయకులు జనంలో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేయడంటూ దుష్ప్రచారంలో సదరు నాయకులు నిమగ్నమై వున్నారు. కేంద్రం నుంచి భారీ స్థాయిలో సాయం వస్తేనే ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయగలుగుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే, ఆ ప్రయత్నాలకు సహకరించి కేంద్రం నుంచి నిధులు దండిగా రావడానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద వుంటుంది. అయితే ఆ బాధ్యతని విస్మరించిన జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కష్టాల్లో వుందని కేంద్రానికి చెబుతారేంటి అంటూ చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. కేంద్రం కనుక ఆంధ్రప్రదేశ్‌ని పొరపాటున పట్టించుకోకపోతే ఆ పాపం పూర్తిగా జగన్ పార్టీదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రతిపక్షం వ్యవహారశైలి మొత్తం అభివృద్ధి నిరోధకంగానే వుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహకరించని ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తూ ముందుడుగు వేయాల్సిన అవసరం వుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...