మహానాడు వేదికగా వైసీపీకి షాక్.. లోకేష్ తో ఆనం కుమార్తె భేటీ

అందరూ ఊహిస్తున్నట్లుగానే ఆనం ఫ్యామిలీ మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె  కైవల్యా రెడ్డి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నిన్న మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కైవల్యారెడ్డి ఒక్కసారిగా టీడీపీ మహానాడు సందర్భంగా భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వెళ్లి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ సంఘటన వైసీపీ నేతల్లో కలవరం రేపింది.

కొంత కాలంగా ఆనం ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.  గత కొద్ది కాలంగా ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, వైసీపీ నేతల తీరుపై విమర్షలు గుప్పిస్తుండటమే ఈ ప్రచారానికి కారణం. సందు దొరికినప్పుడల్లా పరోక్షంగా వైసీపీ అధిష్టానాన్ని ఎండగడుతున్నారు ఆనం. మహానాడు సందర్భంగా లోకేష్ పర్యటించే ప్రాంతానికి వెళ్లి ఆనం కుమార్తె కైవల్యారెడ్డి, అల్లుడు రితేశ్ రెడ్డి కలిశారు. దాదాపు అరగంట పైగా చర్చలు జరిపారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.

ఆత్మకూరు నియోజకవర్గం నుండి రామనారాయణరెడ్డి కుమార్తె తెలుగుదేశం తరఫున బరిలో దిగుతారని ఇప్పటికే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.  అందుకే  చంద్రబాబు ఆత్మకూరుకు పార్టీ ఇన్ ఛార్జ్ ని కూడా  నియమించలేదని చెబుతున్నారు. ఈ రోజు ఆత్మకూరు తనకు కేటాయించాలని లోకేష్ ను కైవల్యారెడ్డి కోరినట్టు సమాచారం . త్వరలో ఆమె ఆత్మకూరు బాధ్యతలు చేపట్టనున్నారన్న టాక్ నెల్లూరు జిల్లాలో జోరుగా నడుస్తోంది.

కైవల్యారెడ్డి ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బద్వేలు విజయమ్మ కోడలు. ఆ కుటుంబం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోంది. కానీ పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ టీడీపీ కార్యక్రమాల్లో కైవల్యారెడ్డి పాల్గొనలేదు. కైవల్యారెడ్డి తన వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనేది వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కోరిక. అందులో భాగంగా ఈమధ్య  కాలంలో ఆమె ఆనం రామనారాయణరెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.   ఇప్పుడు కైవల్యారెడ్డి లోకేష్ తో భేటీ కావడంతో ఆమె తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న చర్చ మొదలైంది.  

కైవల్యారెడ్డికి ఎనభై ఏళ్ల రాజకీయ చరిత్ర గల కుటుంబం  ఆడపడుచు. ఆమె దేశం తీర్ధం పుచ్చుకుంటే.. ఆనం కుటుంబం నుంచి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన మహిళ అవుతారు.  ఆమె మెట్టినింటిది కూడా రాజకీయ నేపథ్యమే కావడంతో  కైవల్యారెడ్డి లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.