Top Stories

ఆ కాలమంతా ఆన్ డ్యూటీయే.. ఏబీవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్   ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో  ఏబీ వెంకటేశ్వరరావు రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. మొదటి సారి 2020 ఫిబ్రవరి నుంచి రెండేళ్ల పాటు అంటే 2022 ఫిబ్రవరి వరకూ, ఆ తరువాత మళ్లీ జూన్ 22 నుంచి 2024 మే వరకూ ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఆయన తన సర్వీసు చివరి రోజున మళ్లీ డ్యూటీలో చేరారు.  సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత ఏబీవీకి న్యాయం జరిగింది. జగన్ హయాంలో అన్యాయంగా సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయన సస్పెండైన కాలాన్ని ఆన్ డ్యూటీగా అంటే విధులు నిర్వర్తించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. అలాగే ఆ సస్పెన్షన్ కాలానికి వేతనం అలవెన్సుల చెల్పింపునకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం మొత్తాన్ని విధులు నిర్వర్తించినట్లుగానే పరిగణించి ఆయనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. 
Publish Date: Jan 28, 2025 3:48PM

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీ గండం ?  

గ్రేటర్ హైద్రాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీగండం పొంచి ఉంది. సీనియర్ రాజకీయనాయకుడు కెకె కూతురు అయిన విజయలక్ష్మి పదవీకాలం  ఇంకా ఉంది. అయితే జీహెచ్ ఎంసి చట్టాల ప్రకారం నాలుగేళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలి. వచ్చే నెల (ఫిబ్రవరి 10)  నాలుగేళ్లు పూర్తి కానుంది.  కాబట్టి బిఆర్ ఎస్  అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాస తీర్మానం  నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బిఆర్ఎస్ కు బిజెపి సపోర్ట్ చేయనుందని చెబుతోంది. బిఆర్ఎస్ కేవలం బిజెపి బలం మీదే ఆధారపడింది. ఒకరకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కు  బిజెపి మిత్ర పక్షమైనప్పటికీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జిహెచ్ ఎంసిలో 150 కార్పోరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలు కావడం, మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా  ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్ సీలు  ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పోరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే.  ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతా శోభన్ రెడ్డిలు మేయర్ డిప్యూటి మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి  మాజీ బిఆర్ఎస్ పొలిట్ బ్యురో సభ్యులైన కె. కేశవరావు ముఖ్యభూమిక వహించారు. తనకు పదవీగండం ఉందని వస్తున్న వార్తలను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఖండించారు.  ఆమెకు కాంగ్రెస్ కార్పోరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడటంతో గద్వాల విజయ లక్మి పదవికి ఎటువంటి ఢోకా లేదని సమాచారం. అవిశ్వాసతీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బిఆర్ఎస్ కు 42 కార్పోరేటర్లు, 29 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.  అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిఆర్ఎస్ కుమరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో  బిఆర్ ఎస్ బిజెపి బలం మీద ఆధారపడింది. బిజెపి అధిష్టానం  ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
Publish Date: Jan 28, 2025 1:49PM

చంద్రబాబుపై సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ కోరుతూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీం

చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి మరొక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని, అసలీ పిటిషన్ పై వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషన్ తరఫున్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.   ఇంతకీ విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ   హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో  జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది   మణీందర్ సింగ్  అటెండ్ అయ్యారు. ఆయన తన వాదనలు ప్రారంభించకముందే సుప్రీం కోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇటువంటి పిటిషన్లను వాదించడానికి ఎలా వచ్చారు అంటూ జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని పేర్కొన్న జస్టిస్ ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తాం అంటే హెచ్చరించారు.   జగన్  హయాంలో చంద్రబాబుపై సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్‌, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్‌ భూములు, ఉచిత ఇసుక విధానం, మద్యం విధానం వంటి అంశాలపై సీఐడీ   కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో.. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో సీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరగదని అందుకే చంద్రబాబుపై సీఐడీ కేసులన్నిటినీ సీబీఐకి బదలీ చేయాలని కోరుతూ బాలయ్య సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది.  
Publish Date: Jan 28, 2025 1:48PM

విజయసాయి కొత్త అవతారం!

విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే నంటూ విశ్లేషణలు.. ఇందంతా జగన్ ప్లానే అన్న అనుమానాలూ ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ లోగానే విజయసాయి రెడ్డి తన కొత్త ఉద్యోగం మొదలెట్టేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పినట్లు వ్యవసాయం చేయడం ఆరంభించేశారు. అలా మొదలెట్టేసి ఊరుకోలేదు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశారు.  రాజకీయాలను దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాననీ, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా, సంతోషంగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్వీకర్ క్షణం జాగు చేయకుండా ఆమోదించేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇక దానికి మించి విజయసాయిరెడ్డి చిప్పినట్లుగానే  వ్యవసాయ వ్యాపకంలోకి దిగిపోవడం ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది.  విజయసాయి రెడ్డి తాజాగా రైతుగా తన పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన హార్టికల్చర్ సాగు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి విజయసాయి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని తేటతెల్లమైపోతోంది. రాజకీయాలు వదిలేశాను ఇదిగో రుజువు.. ఇక నన్ను వదిలేయండి మహప్రభో అని కూటమి నేతలను అభ్యర్థిస్తున్నట్లుగా విజయసాయి ట్వీట్ ఉందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
Publish Date: Jan 28, 2025 1:21PM

ఆ నాలుగు పథకాలూ గట్టెక్కిస్తాయా?

తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ విజయాలూ, ఫెయిల్యూర్స్ సమానంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఆనవాలు కూడా కనిపించకుండా చేసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయితే.. వాగ్దానాల అమలు విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పథకాల అమలుపై దృష్టి సారించారని చెబుతున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు రాజనున్నాయి. ఆ ఎన్నికలలో గట్టెక్కాలంటే ఏదో విధంగా పథకాలు సక్రమంగా అమలు చేయగలుగుతున్నారన్న భావన ప్రజలలో కలగాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు. పంచాయతీ ఎన్నికలలో విఫలమైతే.. రేవంత్ కు కష్టాలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ గట్టిగా మద్దతు ఇస్తూ వచ్చిన హైకమాండ్  పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొంచం అటూ ఇటూ అయితే.. అసమ్మతి, అసంతృత్తి ఉధృతిని అణిచివేసి రేవంత్ కు సపోర్ట్ గా నిలబడటంపై పెద్ద ఆసక్తి చూపే అవకాశలు పెద్దగా ఉండవు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా అంటే రిపబ్లిక్ డే  రోజుల ప్రారంభించిన పథకాల అమలుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నాలుగు  పథకాలను పక్కాగా అమలు చేస్తేనే ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది.   రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు చాలా వరకూ రసాబాసగా మారిన సంగతి తెలిసిందే. దానిని బట్టే పథకాల అములు విషయంలో లబ్ధిదారుల్లో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.  దీనిని గ్రహించే రేవంత్ రెడ్డి విడతల వారీగా వీటి అమలుకు నిర్ణయించారు. తొలి దశలో  563 మండలాల్లోని 563 గ్రామాల్లో ఈ పథకాల అమలుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.    4,41,911 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద సోమవారం (జనవరి 27) రైతుభరోసా రూ 6 వేలు  రైతుల ఖాతాలో జమ చేసింది.  అలాగే ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో  భాగంగా 18,180 మంది రైతుకూలీలకు రు.6 వేలుచొప్పున రు. 10.91 కోట్లు జమచేసింది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసా యకూలీలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న సంగతి విదితమే. ఇక మూడోపథకంగా కొత్తగా 15,414 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొత్తకార్డుల వల్ల 51,912 కుటుంబాలు లబ్దిజరిగింది. అలాగే కుటుంబాల్లో కొత్తసభ్యులను చేర్చాలని వచ్చిన దరఖాస్తుల్లో 1.03 లక్షల కార్డుల్లో కొత్తసభ్యుల పేర్లను మార్చింది. చివరగా గూడులేని అర్హులైన నిరుపేదలు 72 వేలమందికి ఇందిరమ్మ ఇళ్ళపథకంలో యాజమాన్య పత్రాలను అందించింది.   స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయం లక్ష్యంగానే  రేవంత్ ప్రభుత్వం ఈ  నాలుగు పథకాల అమలుకు గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో పరిమితంగానే అమలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికలలోపు ఈ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడందాని తర్వాతే స్ధానికసంస్ధల ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన 563 గ్రామాల్లో పథకాల అమలుకు శ్రీకారంచుట్టింది. పైలెట్ ప్రాజెక్టు అమలుసరే పైనాలుగుపథకాలు యావత్ రాష్ట్రంలో వివాదాలకు తావులేకుండా ఎప్పుడు అమలవుతుందో చూడాలి.
Publish Date: Jan 28, 2025 12:51PM