Top Stories

గుండ్రాంపల్లిలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు.. చిట్యాలలో 4వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి!

పరిరక్షించుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో క్రీ.పూ. 4000 సంవత్సరాల నాటి రాతి గొడ్డలి లభించిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ, డాక్టర్ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. పురాతన వారసత్వ సంపదను గుర్తించి, కాపాడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించే "ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం గుండ్రాంపల్లి, ఏపూరు గ్రామాల మధ్యలో నాగులకట్ట వద్ద చేపట్టిన అన్వేషణలో 15 సెం. మీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంగల నల్ల సానపు రాతిగొడ్డలి కనిపించిందని చెప్పారు. నాగులకట్ట పైన కాకతీయుల కాలానికి చెందిన క్రీ.శ. 13వ శతాబ్దం నాటి నాగదేవతల శిల్పాలు ఉన్నాయని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిర్లక్ష్యంగా పడిఉన్న ఈ చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యకర్త యడ్లపల్లి అమర్నాథ్ పాల్గొన్నారు అని ఆయన అన్నారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని చెప్పారు.
Publish Date: Jan 25, 2025 4:11PM

250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ.. అమరావతి ఒక అద్భుతం!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మూడేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శుక్రవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన ఆయన పనులకు ఈ నెలాఖరులోగా టెండల్లు పిలుస్తామనీ, ఫిబ్రవరి రెండో వారానికల్లా పనులు ప్రారంభమౌతాయనీ చెప్పరు.  అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని పునరు ద్ఘాటించిన మంత్రి నారాయణ.. న్యాయపరమైన అంశాల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. మీడియాతో మాట్లాడడానికి ముందు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలో  అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఇప్పటికే 40 పనులకు టెండర్లు పిలవడం జరిగిందని వెల్లడించారు.  జగన్ ప్రభుత్వం  అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక అమరావతి పనులు చకచకా జరుగుతాయనీ, అందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనీ చెప్పిన ఆయన అమరావతి ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.   2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 4053 అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిందన్న నారాయణ.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటి పనులనూ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని విమర్శించారు. 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ నిర్మాణం చేపడతామనీ, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో  ఆ ప్రదేశాన్ని పర్యటక ప్రాంతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.  రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే ప్రాంతంలో నివాసం ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు. 
Publish Date: Jan 25, 2025 3:33PM

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రెడీ!

12 ఏళ్లకు ఒక సారి వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ సారి 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకూ గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు షురూ చేసింది. ప్రాథమిక అంచనా మేరకు ఈ సారి గోదావరి పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారు. ఘాట్ల నిర్వహణ, తొక్కిసలాటలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఫలానా ఘాట్ లోనే స్నానం చేయాలన్న నియమం ఏదీ లేదనీ, ఏ ఘాట్ లోనైనా స్థానం చేయవచ్చునన్న ప్రచారానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఘాట్ల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే ఘట్ల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేసింది.  గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ విస్తరణ, ఆధునీకరణ కోసం 271.43 కోట్ల రూపాయలు కేటాయించింది.   దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. వాటి వివరాలను ముందుగానే వెల్లడించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది .యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్లకు అదనంగా మరో నాలుగు కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.   కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు,  బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేశారు.  ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయడానికి అధికారులు సమాయత్తమౌతున్నారు. 
Publish Date: Jan 25, 2025 3:01PM

 కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత...ముగిసిన అంత్యక్రియలు 

మాజీ సిఎం కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూశారు. ఆమె తీవ్ర అనారోగ్య కారణాలతో యశోదా హస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతు శుక్రవారం  అర్దరాత్రి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సకలమ్మ కేసీఆర్ కు ఐదో సోదరి.  ఆమె స్వగ్రామం సిరిసిల్లాజిల్లాలోని ఎల్లారెడ్డిపేటమండలం పెదిరగ్రామం. భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు.  సకలమ్మ మృతి చెందిన వార్త తెలుసుకున్న కేసీఆర్ కంటతడి పెట్టారు. కేసీఆర్, కెటీఆర్ , కవిత, హరీష్ రావ్ ఆమె పార్దీవ దేహాన్ని సందర్శించారు. శనివారం సకలమ్మ అంత్య క్రియలు జరిగాయి.
Publish Date: Jan 25, 2025 2:55PM

ఏపీకి క్యూ కట్టనున్న దిగ్గజ సంస్థలు.. గెట్ రెడీ.. అధికారులతో చంద్రబాబు

దావోస్ పర్యటనకు ఆర్భాటంగా వెళ్లి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దావోస్ వేదికగా జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ఏకైక అజెండాగా వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సదస్సు జరిగినన్ని రోజులూ క్షణం తీరక లేకుండా దిగ్గజ సంస్థల అధిపతులతో చర్చోపచర్చలు జరిపింది. సదస్సు ముగిసిన తరువాత విజయ హాసంతో చంద్రబాబు, ఆయన బృందం తిరిగి వచ్చింది.  అయితే వైసీపీ నేతలు మాత్రం దావోస్ పర్యటనలో చంద్రబాబు విఫలం, ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తేలేకపోయారంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఏడు నెలలో దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కన్వీనియెంట్ గా మరిచిపోయారు. దావోస్ సదస్సులో ఒక్కటంటే ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారంటూ చంద్రబాబు, లోకేష్ మీద ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం (జనవరి 24) సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు.  అదే రోజు తన అధికారిక నివాసంలో   ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ సందర్బంగా చంద్రబాబు   ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాననీ చెప్పారు.   ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావధానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 
Publish Date: Jan 25, 2025 2:17PM