మందు బాటలో ముందడుగు.. అన్ని రాష్ట్రాలదీ అదే తీరు

రాష్ట్రం వేరు కావచ్చును. రాష్ట్రన్ని పాలించే పార్టీ వేరు కావచ్చును. అది జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలోని ఆంధ్ర ప్రదేశ్ అయినా, కేసీఆర్, కేటీఆర్ పాలిస్తున్న తెలంగాణ అయినా, ఉద్దవ థాకరే ఎలుబడిలోని మహారాష్త్రే అయినా ... శివరాజ్ చౌహాన్ పాలిస్తున్న ఎంపీనే అయినా  ఇతరత్రా విషయాల్లో ఎలా ఉన్నా, మద్యం విషయంలో మాత్రం అందరిదీ ఒకటే మాట, ఒకటే బాట. ఒకటే ఆలోచన. అన్ని ప్రభుత్వాలు మందు బాటలోనే ముందుకు సాగుతున్నాయి.     
ఒకప్పుడు ఏమో కానీ, ఇప్పుడు మాత్రం పార్టీ లేబుల్స్’తో పని లేకుండా, గుజరాత్, బీహార్ లాంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహ మిగిలి రాష్ట్ర  ప్రభుత్వాలు అన్నీ మందును ప్రధాన ఆదాయ వనరుగానే చూస్తున్నాయి.అందుకే, మధ్య నిషేధం మాటలకే పరిమితం అవుతోంది. గుజరాత్, బీహార్’లో కుడా మధ్య నిషేధం అమలులో ఉన్నా,ఆ రాష్ట్రాల్లోనూ పర్మిట్ల పేరున మరో దారిలో ‘మధ్య’ మార్గంలో  ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంది. అయినా, ఇతర రాష్ట్రాల కంటే కొంత బెటర్  అంటారు. 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంచెల వారీగా  సంపూర్ణ మధ్య నిషేధం తెచ్చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ, గడచిన రెండున్నర మూడేళ్ళ కాలంలో ఏమి జరిగిందో వేరే ప్రత్యేకించి చెప్ప నవసరం లేదు ... మద్యం మీద వచ్చే ఆదాయం ఏటికేడాది పెరుగుతూనే ఉంది.అంచల వారీ మధ్య నిషేధం అంటూనే, మద్యం మీద వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు జగన్ రెడ్డి పభుత్వం, దేశంలో ఇంకెక్కడా లేని విధంగా మద్యం దుకాణాలు  నడుపుతోంది. అంతేకాదు, మరో పాతికేళ్ళ పాటు, ప్రజల చేత పుష్టుగా మందు తాగించి ఆదాయం తగ్గకుండాచూసే పవిత్ర కర్తవ్యాన్ని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. పాతికేళ్ళ మద్యం ఆదాయాన్ని కుదువ పెట్టి,వేల కోట్ల మేర అప్పులు తెచ్చుకుంది. అంటే, రాష్ట్రంలో  పాతికేళ్ళ పాటు సంపూర్ణ  కాదు కదా పాక్షిక మధ్య నిషేధం కూడా అమలు కాదు. ఇంకా అవసరం అయితే, ఇంటింటికీ ఉచిత డెలివరీ, ప్రత్యేక బ్రాండ్లు, బార్లు వంటి వినూత్న ఆలోచనలు చేసినా చేస్తుంది కానీ, నిషేధం జోలికి మాత్రం పోదు. ఆ విషయం  ‘అప్పు పత్రం’ సాక్షిగా  ప్రభుత్వమే  చెప్పింది. 
తెలంగాణ కూడా తక్కువ తినలేదు ..సారీ, తక్కువ తాగలేదు.. 2021 చివరి ఐదు రోజుల్లోనే ఇంచుమించుగా ఒక  కోటి అటూ ఇటుగా ఒక వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి,డిసెంబర్ నెలలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.3,435 కోట్ల  మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ స్వయంగా, సగౌరవంగా ప్రకటించింది.అంటే సంవత్సరంలో  ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగాయో, వేరే చెప్పనక్కర లేదు.
అయితే, అదలా ఉంటే మందు దార్లో మరో వినూత్న విధనాన్ని ప్రవేశ పెట్టిన  ఘనత మత్రం మహా రాష్ట్ర  మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికే దక్కింది. మూడు పర్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మద్యానికే కిక్కిచే వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి మహా రాష్ట్రలో మందు కావాలంటే, వైన్ షాప్’కో, బార్’కో పోనవసరం లేదు..దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్’కో లేదా వాక్ – ఇన్ – స్టోర్’కో వెళితే చాలు, ఇంచక్కా ఎవరికీ తెలియకుండా పప్పులు, ఉప్పులతో పాటుగా, రెండు మందు బాటిల్స్ కూడా బ్యాగ్’ లో వేసుకుని వచ్చేయ వచ్చును. ఎంత సౌలభ్యం... వైన్  షాపులకు  వెళ్ళలేని మహిళలు, వృద్ధులు కూడ ఇప్పుడు ఇంచక్కా ఇంటి పక్క షాపుకు వెళ్లి మందు బాటిల్ తెచ్చుకుని ‘ఎంజాయ్’ చేసే సౌలభ్యం మహా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇలా సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ షాపుల్లో వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను మహారాష్ట్ర మంత్రివర్గం రెండు రోజుల క్రితం ఆమోదించింది. జస్ట్ ఓ రూ. 5000ల రూపాయల లైసెన్స్ ఫీజు కట్టి సూపర్ మార్కెట్లు లేదా వాక్ – ఇన్ – స్టోర్లు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చును. అయితే ఇదేదో ప్రభుత్వం ఆదాయం కోసం చేస్తోందని అనుకోకూడదు..ట. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించాల‌ని ఉద్దేశం కూడా ఉంద‌ని ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. 
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్ర‌తిప‌క్ష బీజేపీ త‌ప్పుబ‌ట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం వినియోగాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించింది.“మహారాష్ట్రను మద్య రాష్ట్రంగా మార్చడానికి మేము అనుమతింబోము’’ అని మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ప‌డ్న‌వీస్ హెచ్చరించారు. 
అయితే ఇక్కడ మహా రాష్ట్రలో కిరాణ కొట్లలో మందు అమ్మడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ, తాము అధికారంలో ఉన్న మధ్య  ప్రదేశ్’ అదే చేస్తోంది. మహారాష్ట ప్రభుత్వం రాష్రం మొత్తంలో ప్రవేశ పెట్టిన కొత్త విధానాన్ని నాలుగు ప్రధాన నగరాలకు పరిమితం చేస్తూ,అదే నిర్ణయం తీసుకుంది. ఆ నాలుగు నగరాల్లో ఎంపిక చేసిన సూపర్ మార్కెట్లలో, విమానాశ్రయాలలో  మద్యం విక్రయాలకు  అనుమతి ఇచ్చింది. అంతే కాదు చౌహాన్ సర్కార్ మరో వినూత్న ‘మందడుగు’ కుడా వేసింది. ఇంట్లోనే బార్ పెట్టుకునే మహాదవకాశాన్ని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కల్పించారు. సంవత్సర ఆదాయం కోటి రూపాయలు అంతకు ఎక్కువ ఉన్న కుటుంబాలకు  హోమ్ బార్ లైసెన్స్  జారీ చేయడానికి, చౌహాన్ సర్కార్ అనుమతించింది.
మొత్తానికి ... ముందే అనుకున్నట్లుగా ... పాలకపార్టీల లేబుల్స్’తో పని లేకుండా రాష్ట్రాలు, తాగుడు వలన జరుగతున్న అనర్ధాలను పట్టించుకోకుండా మందును ఆదాయ  వనరుగా చూస్తున్నాయి. మందు బాటలో ముందడుగు వేస్తున్నాయి.