అధికారంలోకి వ‌స్తే సీపీఎస్ రద్దు.. జగన్ బాటలో అఖిలేష్ హామీ..

ఎన్నికలు అన్నతర్వాత హామీలు ఇవ్వవలసిందే. అమలు చేయడం చేయక పోవడం తర్వాతి విషయం. అయితే ఓ వంక ఏపీలో అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన సీపీఎస్ రద్దు, హామీని ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో వినిపించడం కొంచెం ఆసక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తమ ప్రతి అధికారంలోకి వస్తే, సీపీఎస్ రద్దు చేస్తామని హమీనిచ్చారు. ఆ హామీకి స్పందించిన  ఉద్యోగులు గంప గుత్తగా వైసీపీకి ఓటేశారు. వైసీపీ గెలిచింది. హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాలు అయింది. అయినా, సీపీఎస్ రద్దు హామీ మాత్రం నెరవేరలేదు. అంతేకాదు, అది అయ్యేది కాదని, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. ఇప్పడు ఏపీలో రోడ్డెక్కిన ఉద్యోగులు  సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి అది అమలు చేయక పోగా పీఆర్సీ, హెచ్ఆర్ఎకు ఎసరు తెచ్చారని ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. 

అదలా ఉంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అందులో భాగంగా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ఉద్యగులకు హామీ ఇచ్చిన విధంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తానని మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హామీ ఇస్తున్నారు.

2004లో అప్పటి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని తీసుకురాగా.. 2005లో ఉత్తర్‌ ప్రదేశ్ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకొస్తే 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అఖిలేశ్ అన్నారు. అలాగే, ప్రయివేట్ పాఠశాలలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులకు ఆర్ధిక సాయం కూడా అందజేస్తామని, మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చేలా మార్పులు చేస్తామని అఖిలేశ్ ప్రకటించారు.పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తమ పార్టీ మేనిఫేస్టోలో మరో ముఖ్యమైన హామీ అని అఖిలేశ్ వివరించారు. అయితే, యూపీ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులతో పోటీ పడి బకరాలు అవుతారో లేక, స్మార్ట్’గా ఓటు చేస్తారో ..చూడవలసి వుంది.

Related Segment News