అమ్మ మరణం..వారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ జయలలిత మరణం చుట్టూనే తిరుగుతున్నాయి. అమ్మ మరణంపై ప్రభుత్వం విచారణ కమిషన్ నియమించడం ఆ తర్వాత అధికార అన్నాడీఎంకేకు చెందిన కొందరు మంత్రులు జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు..ఆ తర్వాత జరిగిన సంఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకేలో తలెత్తుతున్న సంక్షోభాలను తనకు అనుకూలంగా మార్చుకొని..రాజకీయ లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్న ప్రతిపక్షనేత, డీఎంకే కార్యానిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మరోసారి రంగంలోకి దిగారు.

 

అన్నాడీఎంకే నేతల పొంతన లేని మాటలు రాష్ట్రంలో గందరోగోళానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. జయ మరణంపై ఇప్పటికీ ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని..రిటైర్డ్, సిట్టింగ్ న్యాయమూర్తులతో దీనిపై విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యంగా మంత్రులు శ్రీనివాసన్, సెల్లూరు రాజుకు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే చాలన్నారు..వీరేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు, ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లు, గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎయిమ్స్, లండన్‌కు చెందిన వైద్యులు అందరినీ విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇచ్చి పార్టీ పరువు తీస్తోన్న మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులందరినీ తన నివాసానికి పిలిపించుకున్న సీఎం..అందరికీ ఫుల్‌గా క్లాస్ పీకారట..అంతేకాదు ఇక మీదట అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పటి విషయాలపై మాట్లాడకూడదని హెచ్చరించారట.