కామ్‌గా ఉండు సోమూ.. ప్లవర్ పార్టీలో సోము వారి ఫైర్

సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ప్లవర్ పార్టీని ఫైర్ పార్టీగా మార్చి.. ఆంధ్రప్రదేశ్‌‌లో అధికారంలోకి తీసుకు రావాలని భావిస్తూ... ఆ దిశగా ముందుకు వెళ్లే క్రమంలో.. నోటికి పని చెప్పి.. అటు అధికార పార్టీ వాళ్ల నోట్లోనే కాదు.. ఇటు సొంత పార్టీ కాషాయ దళంతో కూడా తిట్లు దండకం చదివించుకోగల సత్తా ఉన్న నేత ఈ సోము వీర్రాజు.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. సైకిల్ పార్టీ మద్దతుతోనే.. ఎమ్మెల్సీగా గెలిచి.. పెద్దల సభలో అడుగు పెట్టి.. సదరు సభలోనే కాదు.. వరుస ప్రెస్ మీట్ల్ పెట్టి మరీ పసుపు పార్టీపైనే రంకెలేసిన ఘనమైన చరిత్ర గలిగిన నేతగా ఈ సోము వీర్రాజు వాసికెక్కారు. ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కషాయ పార్టీ అధిష్టానం సోము వీర్రాజుకు పదవి కట్టబెట్టింది.


అయితే ఆయన ఏ ముహూర్తాన.. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చెప్పట్టారో కానీ.. ఎప్పుడు ఏదో కామెంట్ చేసి... సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారీ సోము వీర్రాజు. ఈ నోరున్న నేతతో వేగలేకపోతున్నామంటూ కమలం పార్టీ వారే నెత్తి నోరు బాదుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  గతంలో రాష్ట్రంలో మద్యం రేట్ల గురించి చాలానే మాట్లాడారు ఈ సోము వీర్రాజు. కానీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. క్వార్టర్ చీప్ లిక్కర్ 70 రూపాయిలకే ఇస్తామని.. ఓ వేళ ప్రభుత్వ ఖజానాలో కాసులు  గలగలమంటే మాత్రం క్వార్టర్ చీప్ లిక్కర్  50 రూపాయిలకే ఇస్తామని.. అంతేకాదు రాష్ట్రంలో కోటి మంది మందుబాబు ఉన్నారని.. తాము అధికారంలోకి వస్తే.. వారందరి భవిష్యత్తు గ్లాసులు గలగల మనేలా.. మూడు పెగ్గులు .. ఆరు క్వార్టర్లుగా మార్చేస్తామంటూ సారాంశాన్ని మొత్తం సోము వీర్రాజు.. సారాయి వీర్రాజు స్టైల్ల్‌లో చెప్పేశారు.  ఈ సారాయి వీర్రాజు గారి  వ్యాఖ్యలు.. నేషనల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో.. దేశంలోని విపక్షాలన్నీ.. కాషాయ దళాన్ని టార్గెట్‌గా చేసుకుని..  ఓ రేంజ్‌లో ఓ ఆటాడేసుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తిరుపతి వచ్చి.. అమరావతికి మద్దతు ఇవ్వండి అంటే అప్పటికప్పుడు మెల్కోని వారికి మద్దతు ప్రకటించిన ఈ సోము వీర్రాజు... అలాగే సంక్రాంతి పండగ వేళ గుడివాడ కేసీనోలో గోవా గువ్వుల చిందులు.. దాదాపు 500 కోట్ల రూపాయిల నగదు చేతులు మారాయంటూ తెలుగు దేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి రచ్చ రచ్చ చేస్తే.. టీడీపీకీ మొత్తం క్రెడిట్ వెళ్లిపోతుందంటూ ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన ఈ సారాయి వీర్రాజు బ్యాచ్‌ను పోలీసులు అడ్డుకుని..  అదుపులోకి తీసుకున్న విషయం విధితమే.


అయితే అలాంటి ఈ సోమ వీర్రాజుకు మైక్ దొరికితే చాలు.. మైకాసురుడు అవతారంలో ఏదేదో మాట్లాడేస్తారని కమలం పార్టీలోని నేతలే చెవులు కొరుకుంటారు. అయితే తాజాగా ఈ సోము వీర్రాజు.. కడపపై ఫోకస్ పెట్టి.. కడప ప్రజలు హత్యలు చేస్తారంటూ.. అలాంటి కడప ప్రాంతానికి ఎయిర్ పోర్టా? అని మీడియా సాక్షిగా ప్రశ్నించారు. దీంతో కడప జిల్లా వాసులకే కాదు.. అధికార పార్టీలోని కీలక నేతలతో సైతం కడుపు మండింది... దాంతో వారు.. సోము వీర్రాజుపై గట్టగానే  అక్షింతలు వేశారు.

దీంతో దిగి వచ్చిన సోము వీర్రాజు... తన మాటలను వక్రీకరించారంటూ తనదైన శైలిలో మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ఈ వ్యాఖ్యలతో కమలం పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంతా అప్పటికే జరిగిపోయిందని.. ఆ పార్టీలోని వారే అంటున్నారు. ఓ వైపు బూతుల మంత్రి కొడాలి నానిపై విరుచుకు పడే ఈ సోము వీర్రాజు... ఇలా మాట్లాడడం ఎంత వరకు సబబు అని అధికార పార్టీ నేతలే కాదు.. కమలం పార్టీ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. కామ్ ఉండు.. సోము..  ఏందుకు నేలన పోయేదానిని నెత్తిన రాసుకుంటావంటూ.. అధ్యక్షుల వారికి కమల దళం సూచిస్తోంది. మరీ సోము వీర్రాజు వారు.. కామ్‌గా ఉంటారో లేక.. మళ్లీ సార్రాయి వీర్రాజులా రెచ్చిపోతారో వేచి చూడాలి.