Top Stories

అమిత్ షా కు చంద్రబాబు విందు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. ఈ నెల 18న ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు అమిత్ షాకు హై  లెవల్ విందు ఇవ్వనున్నారు. అసలు విషయమేంటంటే అమిత్ షా ఈ నెల 18, 19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బాగంగా ఆయన ఈ నెల 19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ సభ తరువాత చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరతారు. అంతకు ముందు రోజు అంటే ఈ నెల 18నే అమిత్ షా ఏపీకి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి చంద్రబాబు తన నివాసంలో అమిత్ షా గౌరవార్ధం విందు ఇస్తారు. అనంతరం అమిత్ విజయవాడలోని హోటల్ లో బస చేస్తారు.  
Publish Date: Jan 16, 2025 4:17PM

బుమ్రా ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇండియన్ పేస్ బౌలర్

ఇండియన్ స్టార్ పేస్ బౌలర్ బుమ్రా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించాడు. చాంపియన్ ట్రోఫీకి ముందు తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని బుమ్రా కొట్టి పారేశారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌, యూఏఈల‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై సందేహాలు లేవనెత్తుతూ… అత‌డు ఇంటికే ప‌రిమితం కానున్నాడంటూ బుధవారం (జనవరి 15) మీడియాలో కథనాలు వచ్చాయి.   ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమాన‌మేన‌ని ఆ కథనాలు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన బుమ్రా త‌న ఆరోగ్యంపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోందని, అదంతా నిరాధార ప్ర‌చార‌మ‌ని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.  అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా అర్ధంతరంగా ఫీల్డింగ్ నుంచి వైదొలిగాడు.  ఆ తరువాత జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు అత‌నికి విశ్రాంతి ఇచ్చారు. ఈ క్ర‌మంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేద‌ని ఛాంపియ‌న్స్ ట్రోఫీకీదూర‌మ‌వుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.   ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 32 వికెట్లు తీశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.  అలాగే బుమ్రా డిసెంబర్ 2024కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నాడు. డిసెంబర్ లో మొత్తం మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. అటు ఐసీసీ అవార్డ్స్ 2024లో ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు.
Publish Date: Jan 16, 2025 3:06PM

హిండెన్‌బర్గ్ క‌థేంటి... అసలు ఏం జ‌రిగింది?

ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్  తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు. ఆ కారణంగానే తాను హిండెన్‌బర్గ్ ను మూసేయాలని నిర్ణయించానని చెబుతున్నారు. అయితే హిండెన్‌బర్గ్ మూత ప్రకటన మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నాథన్ అండర్సన్  మూసివేత ప్రకటనపై పరిశ్రమ వర్గాల స్పందన మిశ్రమంగా ఉంది. హిండెన్‌బర్గ్ మూతపడకపోతే మునిగిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీహిండెన్‌బర్గ్ పేరు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు అదానీ. హిండెన్‌బర్గ్ నివేదికల కారణంగా అదానీ సంస్థ భారీగా నష్టపోయింది.  అదానీ గ్రూప్  మనీలాండరింగ్, సెక్యూరిటీ ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడిందంటూ 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ దెబ్బకు అదానీ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఆ ఏడాది అదానీ సంపద దాదాపు లక్ష కోట్లు ఆవిరైంది. ఆ తరువాత మళ్లీ కోలుకుందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే హిండెన్‌బర్గ్ ఫేమస్ అయ్యింది మాత్రం అదానీ గ్రూపు అవకతవకలపై విడుదల చేసిన నివేదిక ద్వారానే.  అప్పట్లోనే హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు లక్ష్యంగా వెలువరించిన నివేదిక వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  ఇప్పుడు ఉరుములేని పిడుగులా హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ వ్యూహాలతో లాభాలను ఆర్జిస్తుంది. అందులో బాగంగానే ఇప్పటి వరకూ అదానీ సహా 36 కంపెనీలపై తన రీసెర్చ్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఆ గ్రూప్ ప్రతికూల నివేదికలే విడుదల చేసింది. ఆ నివేదికల కారణంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమయ్యాయి.  సందట్లో సమేమియా అన్నట్లుగా హిండెన్‌బర్గ్ సంపాదన పెంచుకుంది. అయితే షార్ట్ సెల్లర్లు  ఎన్నడూ స్థిరమైన లాభాలను ఆర్జించలేరు. దీర్ఘ కాలంలో వాటికి రాబడి ఉండదు. అన్నిటికీ మించి ఇలాంటి షార్ట్ సెల్లింగ్ సంస్థలు గ్రే జోన్ లో పని చేస్తుంటాయి. ఒక కంపెనీని టార్గెట్ చేసుకుని పని చేస్తుంటాయి. అన్నిటికీ మించి వాటిపై నిఘా నియంత్రణ సంస్థల గురి ఉంటుంది. విచారణలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు మార్గాల ద్వారా అసంబద్ధ నివేదికలు వెలువరించినట్లు రుజువైతే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే హిండెన్‌బర్గ్ మధ్యే మార్గంగా మూసివేత ఒప్పందానికి వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇక అన్నిటికంటే ప్రధానంగా  ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనుండటమే హిండెన్‌బర్గ్ మూతకు కారణం. ఎందుకంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని అధ్యక్ష పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే న్యాయశాఖ పని ప్రారంభించింది. దీంతో హిండెన్‌బర్గ్ తన నివేదికల హేతుబద్ధతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదా బోనులో నిలబడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నాథన్ అండర్సన్  సంస్థ మూసివేత ప్రకటన   పలు అనుమానాలకు తావిస్తోంది.  షార్ట్ సెల్లింగ్ వ్యాపారంలో లాభార్జన కోసమే ఉద్దేశపూర్వకంగా కంపెనీల అవకతవకలపై నివేదికలు వెలువరిస్తుంటుందన్న ఆరోపణలు హిండెన్‌బర్గ్ పై ఉన్నాయి. ఒక్క అదానీ గ్రూపే కాకుండా హిండెన్‌బర్గ్ ఇప్పటి వరకూ దాదాపు 36 కంపెనీల్లో జ‌రుగుతున్న మోసాల‌ను బ‌య‌ట పెట్టింది. ఆ నివేదికల కారణంగా అయా కంపెనీల మార్కెట్ విలువలు భారీగా పతనమయ్యాయి.   ఇక మరో కథనం ఏమిటంటే హిండెన్‌బర్గ్ ఒక పావు మాత్రమేనని  అదానీపై నివేదిక తరువాత భారత పార్లమెంటు వేదికగా  అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడమే ఇందుకు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని  ఆర్ఎస్ఎస్ అధికార పత్రికఆర్గనైజర్‌ కథనం  పేర్కొంది. ఇన్ని రకాలుగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలపై అనుమానాలు ముప్పిరిగొన్న వేళ ఆ సంస్థ మూసివేత ప్రకటన సంచలనం సృష్టించింది.  హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే   అదానీ పవర్ షేర్లు 9 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 7శాతం మేర పెరగడం కొసమెరుపు.
Publish Date: Jan 16, 2025 1:31PM

ఢిల్లీలో కాంగ్రెస్ తరపున రెండు గ్యారెంటీలను విడుదల చేసిన రేవంత్ రెడ్డి 

ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో రెండు గ్యారంటీలను విడుదల చేసింది.  ప్రతీ నెల 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి ఉచిత  కరెంట్  గ్యారెంటీని ప్రకటించింది. 500 వందలకే ఉచిత గ్యాస్ సిలిండర్  గ్యారెంటీను ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు దేవేంద్రయాదవ్ ఈ రెండు గ్యారెంటీలను ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. తెలంగాణలో  ఒకేసారి 21 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు చెప్పుకొచ్చారు.  దేశంలో స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రుణ మాఫీ జరగలేదన్నారు.కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమని రేవంత్ పిలుపునిచ్చారు. 
Publish Date: Jan 16, 2025 1:15PM

ఈడీ కార్యాలయంలో కెటీఆర్ విచారణ 

ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ మంత్రి  కెటీఆర్ గురువారం బషీర్ బాగ్ లోని ఈ డీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని  తన నివాసం నుంచి కెటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కెటీఆర్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సమయంలోనే  కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్,  చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలను  విచారించిన ఈడీ కెటీఆర్ ను విచారిస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో భారీ అవినీతి జరిగిందని రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విచారణకు హాజరయ్యే ముందు కెటీఆర్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. 
Publish Date: Jan 16, 2025 12:04PM