Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ ఆధార్ గోల మొదలు?
posted on: Sep 12, 2014 8:08PM
.jpg)
ఇది వరకు యూపీయే ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ మరియు వివిధ సంక్షేమ పధకాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినపుడు, సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకొనేందుకు వివిధ సంక్షేమ పధకాలను ప్రకటిస్తుంటాయి. కానీ వాటిని యధాతధంగా ఆచరణలో పెట్టేందుకు మాత్రం వెనకాడుతుంటాయి. అందుకు కారణం అసలు కంటే నకిలీ లబ్దిదారులే ఎక్కువ ఉండటమే. అందువలన ప్రభుత్వాలు తము ప్రకటించిన పధకాలను ప్రకటనలకే పరిమితం చేస్తాయి, లేకుంటే ఈ నకిలీ భారం వదుల్చుకొనేందుకు ఇటువంటి ఆలోచనలు చేయవలసి వస్తుంటుంది.
ఒక సంపూర్ణ వ్యవస్థను, పద్దతులను, విధి విధానాలను ముందుగా ఏర్పాటు చేసుకోకుండా అత్యుత్సాహంతోనో లేకపోతే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో తీసుకొనే ఇటువంటి నిర్ణయాలతో ప్రజలకు కొత్త ఇబ్బందులు కలుగుతుంటాయి కనుక సహజంగానే వారిలో వ్యతిరేఖత ఉంటుంది. ప్రజల సహకారం లేనిదే ఏ ప్రభుత్వ పధకమూ ఇంతవరకు విజయవంతం అయిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వాలు ఈ విషయం విస్మరించి తమ ఆలోచనలను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటాయి. నగదు బదిలీ పధకం, సబ్సిడీ గ్యాస్ లను బ్యాంకు-ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి యూపీయే ప్రభుత్వం ఏవిధంగా అభాసు పాలయిందో అందరికీ తెలుసు.
ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పధకాలను మళ్ళీ ఆధార్ కార్డులతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ అంతకంటే ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ ఆధార్ కార్డులు అందాయా లేదా? కార్డులున్న వారందరికీ బ్యాంకు ఖాతాలున్నాయా లేదా? మారుమూల గ్రామాల ప్రజలకు ఆధార్ కార్డులున్నప్పటికీ వారికి అందుబాటులో బ్యాంకులున్నాయా లేదా? లేకుంటే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? వంటి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొన్న తరువాతనే ఆధార్ కార్డుతో అనుసంధానం గురించి ఆలోచిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా పధకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడం కోసం హడావుడిగా అనుసంధానం చేసేసి ఆ తరువాత కోర్టుల ముందు తలొంచుకొని నిలబడి సంజాయిషీలు చెప్పుకోవడం అంటే వ్రతం చెడినా ఫలితం లేకుండా పోయినట్లవుతుందని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.


.jpg)
.jpg)


