త‌మిళ‌నాటా ఓ షిండే : బిజెపి

తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ఏ క్ష‌ణానైనా ఏద‌న్నా జ‌ర‌గ‌వ‌చ్చున‌ని, ఇక్క‌డ కూడా ఒక షిండే త‌లెత్త‌వ‌చ్చ‌ని త‌మిళ‌నాడు బిజెపి అధ్య‌క్షుడు కే. అన్నామ‌లై అన‌డం ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌హా రాష్ట్ర లో మాదిరిగా ఇక్క‌డా రాజ‌కీయ ప‌రిస్థితులు మారే అవ‌కాశాలున్నాయ‌ని బిజెపి చూచాయిగా ఈ ప్ర‌స్థావ‌న చేసింది. అయితే డిఎంకే సీనియ‌ర్ నేత‌, పార్టీ నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్‌. భార‌తి మాత్రం అన్నామ‌లై మాట‌ల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్నారు. 

మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడుల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్థావిస్తూ, శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు దివంగత బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధ‌వ్ సినీరంగ ప్ర‌వేశం అచ్చం త‌మిళ‌నాడు మాజీ ముఖ్య మంత్రి ఎం.క‌రుణానిధి కుమారుడు ముత్తు సినీరంగ ప్ర‌వేశం ఒకేలా వుంద‌ని అంటూ, వారిద్దరి తొలి సిని మాలూ పెద్ద‌గా ఆడ‌లేద‌ని అన్నామ‌లై అన్నారు.  

బుధ‌వారం మ‌ద్రాసులో జ‌రిగిన బిజెపీ ర్యాలీలో అన్నామ‌లై మాట్లాడుతూ రెండు రాష్ట్రాల  మ‌ధ్య ప‌రిస్థితు ల‌ను స‌రిపోల్చారు.  థాక్రే రెండ‌వ కుమారుడు జ‌య‌దేవ్ కుటుంబానికి దూర‌మ‌య్యాడ‌ని, క‌రుణానిధి రెం డ‌వ కుమారుడు అల‌గిరీ కూడా అంతేన‌న్నారు. థాక్రే మూడ‌వ కుమారుడు ఉద్ధ‌వ్ మ‌హారాష్ట్ర ముఖ్య మంత్రి అవ‌కాశం అందిపుచ్చుకున్న‌ట్టే ఇక్క‌డ స్టాలిన్ కూడా అధికారంలోకి వచ్చార‌ని అన్నారు.  

ఇక్క‌డ ఒక్క సంగ‌తి గ‌మ‌నించాలి, రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను  ఈ విధంగా స‌రిపోల్చుకుం టున్న బిజెపి మ‌రి త‌మిళ‌నాడులో కూడా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన‌ట్టు అధికార పార్టీలో ఎవ‌రో ఒక‌రు తిరుగు   బావుటా ఎగరేసే అవ‌కాశాలున్నాయ‌న్న అనుమాన బీజం నాటిన‌ట్టే అనుకోవాలి. బిజెపి వ‌ర్గీయులు ఇలాంటి వాటిలో సిద్ధ‌హ‌స్తుల‌నుకోవాలా? ఏమో  ఎవ‌రో ఒక‌రికి అలాంటి స్వేచ్ఛా రెక్క‌ల్ని బిజేపీ అందించినా  పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు.

ద‌క్షిణాదిన బిజెపీ ప‌ట్టు సాధించాల‌ని ఎప్ప‌టి నుంచో తీవ్ర య‌త్నాలు చేస్తూనే వుంది. అది కేవ‌లం ప‌ట్టు విడుపుల్లానే సాగుతోంది. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో  సాధించిన విజయోత్సాహంతో  త‌మిళ‌నాట కూడా ఏదో ఒక పెద్ద ఎత్తుగ‌డ‌తోనే గంద‌ర‌గోళం సృష్టించి స్టాలిన్‌కు పెద్ద షాక్ ఇవ్వొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.