ప్ర‌జ‌ల‌పై 5 లక్షల‌ కోట్ల అప్పు.. ఎలా తీరుస్తారు జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎలా బ‌తుకుతోంది? అని ఏపీలో ఏ స్కూల్ పిల్లాడిని అడిగినా ఇట్టే స‌మాధానం చెప్పేస్తారు.. అప్పు చేసి బ‌తుకుతోంద‌ని. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల గురించి ప్ర‌జ‌లంద‌రికీ అంత‌లా అవ‌గాహ‌న పెరిగింది. అప్పు లేనిదే.. ప్ర‌భుత్వ‌  బండి న‌డ‌వ‌ని దుస్థితి. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప‌ప్పు-బెల్లాలు పంచాల‌న్నా.. ఉద్యోగుల‌కు వేళ‌కు జీతాలు ఇవ్వాల‌న్నా.. అప్పు చేయాల్సిందే. ఎంత అప్పు చేయ‌గ‌ల‌మో అంతా అప్పు చేసేసిన వైసీపీ స‌ర్కారుకు ఇప్పుడిక కొత్త అప్పులు ముట్ట‌ట్లేదు. అటు కేంద్రం కొర్రీలు పెట్ట‌డం.. ఇటు తాక‌ట్టుకు మ‌రేమీ మిగ‌ల‌క‌పోవ‌డంతో.. అప్పు కోసం తిప్ప‌లు ప‌డుతోంది. మ‌ద్యం ఆదాయం సైతం త‌న‌ఖా పెట్టేయ‌గా.. ఇప్పుడిక ఆన్‌లైన్ టికెట్ల ఆదాయాన్ని ష్యూరిటీగా చూపించి కొత్త అప్పుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని అంటున్నారు. ఇంత‌కీ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌తో ప్ర‌జ‌లపై ఎంత భారం ప‌డిందో తెలుసా..?

ఏపీ ప్రజల నెత్తిన ఇప్పుడు సుమారు రూ.5 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు మాజీ సీఎస్‌, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు. ఇంకా ఎంతకాలం అప్పు పుడుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. అప్పులను ఎలా తీరుస్తారో.. దీనికి కార్యాచరణ ప్రణాళిక ఏముందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వానికి సరైన ఆలోచనా విధానం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైందని మండిప‌డ్డారు. అప్పు తెచ్చి పంచడమే ప్రభుత్వం పనిగా ఉందని విమ‌ర్శించారు. 

ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. విశాఖలోని భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితిని చూస్తున్నామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమన్నారు ఐవైఆర్ కృష్ణారావు.