ప్ర‌జ‌ల‌పై పోలీసుల కాల్పులు.. ముగ్గురి మృతి.. 15మందికి గాయాలు..

అది మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతం. అందుకే అక్క‌డ క్యాంపు ఏర్పాటుకు పోలీసులు స‌న్నాహాలు చేస్తున్నారు. దీనికి స్థానికులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఓవైపు మావోలు, మ‌రోవైపు పోలీసులు మోహ‌రిస్తే.. త‌మ బ‌తుకులు మ‌రింత అధ్వాహ్నంగా మారుతాయ‌ని వారు భ‌యాందోళ‌న చెందారు. పోలీస్ క్యాంపు ఏర్పాటుకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున గిరిజ‌నులు నిర‌స‌న‌కు దిగారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో.. పోలీసులు ఆదివాసీల‌పై కాల్పులు జ‌రిపారు.   

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మృతి చెంద‌డంతో పాటు 15 మందికి పైగా గాయాల‌య్యాయి. సిలిగ‌ర్ వ‌ద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటుకు స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్యాంపు ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ గిరిజ‌నులు ఆందోళ‌న‌కు దిగిన స‌మ‌యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.  

కాగా, త‌మ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మావోల త‌మ‌పై దాడి చేసిన త‌ర్వాతే తాము ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్లు వివ‌రించారు. బ‌స్త‌ర్ పోలీస్ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లిలోనే ఉన్నారు. పోలీసులు త‌మ‌పై అన్యాయంగా కాల్పులు జ‌రిపార‌ని.. 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని స్థానికులు చెబుతున్నారు.  బీజాపూర్ జిల్లా సిలిగ‌ర్ ద‌గ్గ‌ర తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది.