Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ.. నెలకు రూ. 25 లక్షలు ప్రజాధనం వృధా
posted on: Jun 18, 2026 4:22PM

గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. సుమారు 452 కోట్ల రూపాయల భారీ ప్రజాధనంతో విశాఖలోని ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తెల్ల ఏనుగులా మారింది. ఈ భవనం వల్ల పైసా ఆదాయం రాకపోగా.. కేవలం దాని మెయింటెనెన్స్, కరెంట్ బిల్లుల కోసమే నెలకు పాతిక లక్షల రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఈ ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చలేక ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
ఈ ప్యాలెస్ కథ, దాని వెనుక ఉన్న అక్రమాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ.. ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణాన్ని పర్యాటకుల కోసమని, రాష్ట్రపతి లేదా కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు విడిది చేయడానికి నిర్మిస్తున్నామని కోర్టులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆయన.. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత నివాసం కోసం, విశాఖ నుండి పరిపాలన సాగించడం కోసమే దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారనేది బహిరంగ రహస్యమన్నారు. ఇందులో ఏర్పాటు చేసిన లగ్జరీ బాత్‌టబ్‌లు, సముద్ర అందాలు చూసేలా డిజైన్ చేసిన స్నానాల గదులు, ప్రత్యేక మసాజ్ రూమ్‌లు, కోట్ల విలువైన షాండ్లియర్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఈ ప్యాలెస్‌ను ప్రైవేట్ వ్యక్తులకు, లగ్జరీ హోటల్స్ నిర్వాహకులకు లీజుకు ఇద్దామన్నా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి నివాసానికి సరిపోయేలా భారీ మీటింగ్ హాళ్లు, కేవలం 20 గదులతో నిర్మితమవడంతో వాణిజ్యపరంగా రన్ చేయడం కష్టంగా మారిందనీ, ప్రముఖ హోటల్ సంస్థలు దీనిపై ఆసక్తి చూపించినప్పటికీ, వారు హోటల్‌గా మార్చడానికి అదనపు నిర్మాణాలు మరియు పక్కనే ఉన్న సిఆర్జెడ్ పరిధిలోని 7 ఎకరాల భూమిని అడుగుతున్నారు. వీటికి కేంద్ర పర్యావరణ అనుమతులు రావడం అంత సులువు కాదు.
ప్రభుత్వం దీనిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికి పలుమార్లు సమావేశమైనా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కాలయాపన చేయకుండా, ప్రభుత్వమే నేరుగా టూరిజం రిసార్ట్స్‌గా మార్చాలి. విశాఖకు వచ్చే అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, గూగుల్ వంటి సంస్థల సమావేశాల కోసం ఈ 20 గదులను, మీటింగ్ హాళ్లను రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తే నెలకు కనీసం 30 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని, తద్వారా నిర్వహణ భారం తప్పుతుందన్నారు.
ఈ భవన నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చిన వారిపై, కోర్టులను తప్పుదోవ పట్టించిన అధికారులపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా త్వరితగతిన దీనిపై ఒక స్పష్టమైన పాలసీని తీసుకురావాలని అంకంరావు అన్నారు.






