చంద్ర‌బాబు పీఆర్సీనే ముద్దు.. జ‌గ‌నన్న‌ పీఆర్సీ వ‌ద్దు.. ఉద్యోగుల డిమాండ్‌..

పీఆర్సీ కోసం ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. సుమారు ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే ఫిట్‌మెంట్ కోసం లెక్క‌లేస్తుంటారు. పీఆర్సీ రాగానే పెరిగిన జీతం చూసుకొని.. సంబ‌రాలు చేసుకుంటారు. కానీ, ఏపీలో ఈసారి అలా జ‌ర‌గ‌లేదు. సంబ‌రాలు ఉద్యోగ సంఘాల నేత‌లు మాత్ర‌మే చేసుకున్నారు. అదికూడా జీతాలు పెరిగినందుకు కాదు.. వాళ్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు మ‌రో రెండేళ్లు పెంచినందుకు. సంఘాల లీడ‌ర్లుగా ఉన్న ఆ నాయ‌కులు.. మ‌రో రెండేళ్లు ఉద్యోగులంద‌రినీ త‌మ గుప్పిట్లో ఉంచుకోవ‌చ్చ‌ని. కిందిస్థాయి ఉద్యోగుల వాయిస్‌ను నొక్కేస్తూ.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇచ్చే తాయిలాలు తీసుకోవ‌చ్చ‌ని. అది వేరే విష‌యం. అయితే.. లేటెస్ట్‌గా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించిన పీఆర్సీ ఉద్యోగుల జీతాల‌కు పెద్ద బొక్కే పెట్టింది. పీఆర్సీ అమ‌లు చేస్తే జీతం పెర‌గాల్సింది పోయి.. త‌గ్గింది. జీతాన్ని బ‌ట్టి.. ఒక్కో ఉద్యోగికి 2 వేల నుంచి 20 వేల వ‌ర‌కూ శాల‌రీ త‌గ్గుతోంది. ఇదే జ‌గ‌న‌న్న చేసిన పీఆర్సీ మాయ‌. 

పైపైన చూస్తే.. జీతం త‌గ్గ‌న విష‌యం తెలీకుండా డీఏల‌తో మేనేజ్ చేశారు. చాలా నెల‌లుగా ఇవ్వ‌కుండా ప‌క్క‌న‌పెట్టిన పాత పెండింగ్ డీఏల‌ను ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఆ డీఏల గార‌డీతో జీతం త‌గ్గిన విష‌యం తెలీకుండా చేసే కుట్ర చేశారని అంటున్నారు. 

ఇప్ప‌టికే ఏపీ ఉద్యోగుల‌కు 27శాతం ఐఆర్ ఇస్తున్నారు. విచిత్రంగా.. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేన‌ట్టు.. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ త‌గ్గించేసి 23శాతంతో స‌రిపెట్టారు. అంటే ఇన్నాళ్లూ బేసిక్ మీద 27శాతం వ‌చ్చిన శాల‌రీ.. ఇక‌పై 23 శాత‌మే వ‌స్తుంది. అంటే ఆ మేర‌కు 4శాతం జీతం త‌గ్గిన‌ట్టేగా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఉద్యోగ సంఘాల నేత‌లు. వాళ్ల‌కు తెలీకుండా ఉంటుందా..?  తెలిసే చ‌ప్ప‌ట్లు కొడుతున్నారా?

ఐఆర్‌తో పోలిస్తే 4శాతం త‌గ్గిన ఫిట్‌మెంట్ మాత్ర‌మే కాదు.. కొత్త పీఆర్సీలో 1000 రూపాయ‌ల సీసీఏ కూడా ఎత్తేశారు. ఆ మేర‌కు శాల‌రీకి ఇంకో చిల్లు పెట్టింది స‌ర్కారు. అక్క‌డితో అయిపోలేదు కోత‌. హెచ్ఆర్ఏ విష‌యంలో మ‌రింత కుట్ర దాగుందంటున్నారు. 2013లో చంద్ర‌బాబు ఇచ్చిన పీఆర్సీ ప్రకారం ప్ర‌స్తుతం 30శాతం హెచ్ఆర్ఏ వ‌స్తోంది. ఇక‌పై అది అమాంతం త‌గ్గిపోనుంది. సీఎస్ క‌మిటీ సిఫార్సుల ప్ర‌కారం 24-16-8 స్లాబులుగా హెచ్ఆర్ఏ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఆ కోత వాత ఇప్పుడే బ‌య‌ట‌ప‌డ‌కుండా.. కావాల‌నే పీఆర్సీలో హెచ్ఆర్ఏ అంశాన్ని పొందుప‌ర‌చ‌కుండా దాట‌వేశార‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. తాజాగా విడుద‌ల చేసిన జీవోల్లోనూ హెచ్ఆర్ఏ పెంపు లేక‌పోవ‌డంతో.. జీతం మ‌రింత భారీగా త‌గ్గుతోంద‌ని ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ఉద్యోగుల‌కు ఇప్పుడు వ‌స్తున్న జీతం కంటే.. జ‌గ‌న‌న్న పీఆర్సీ వ‌ల్ల భారీ కోత ప‌డింది. ఆ కోత బాధ తెలీకుండా.. క‌చ్చితంగా ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు ఇప్పుడు ఇస్తూ.. శాల‌రీ త‌గ్గిన‌ట్టు అనిపించ‌కుండా క‌వ‌ర్ చేయాల‌ని చూస్తోంది జ‌గ‌న్ స‌ర్కార‌ని.. సంఘ నేత‌లు మిన‌హా ఉద్యోగులంతా మండిప‌డుతున్నారు. 

కొత్త పీఆర్సీ ఏయే కేట‌గిరీ ఉద్యోగుల‌కు ఎంతెంత శాల‌రీ త‌గ్గ‌నుందో అర్థం అయ్యేలా.. ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో చార్ట్స్ స‌ర్క్యులేట్ అవుతున్నాయి. ఆ చార్ట్స్‌లో తెలంగాణ ఉద్యోగుల‌తో పోలిస్తే ఎంత శాల‌రీ త‌గ్గుతుందో.. ఏపీలో చంద్ర‌బాబు ఇచ్చిన పీఆర్సీతో పోలిస్తే ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన పీఆర్సీ వ‌ల్ల ఎంత జీతం కోత‌ప‌డుతుందో వివ‌రంగా రాసుంది. ఆ చార్జులు చూసిన త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులంతా కొత్త నినాదం అందుకున్నారు. 2013లో చంద్ర‌బాబు ఇచ్చిన పీఆర్సీనే ముద్దు.. జ‌గ‌న్ ఇచ్చిన‌ 2018 పీఆర్సీ వ‌ద్దు.. అంటూ ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 


 

Related Segment News