120 మంది వైద్య సిబ్బందికి కొవిడ్.. గాంధీ హాస్పిట‌ల్‌లో కలకలం..

డాక్ట‌ర్ల‌కు, పోలీసుల‌కు కొవిడ్ వ్యాపిస్తుంటే.. ఇక క‌రోనా అదుపు త‌ప్పిన‌ట్టేన‌ని అంటారు. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయ‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ప‌దుల సంఖ్య‌లో పోలీసుల‌కు క‌రోనా సోకింది. ఇటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం భారీగా కొవిడ్ భారిన ప‌డుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. థ‌ర్డ్‌వేవ్ విజృంభిస్తోంద‌ని.. వైర‌స్ వ‌ర్రీ పెరిగిపోయింద‌ని అంటున్నారు.

తాజాగా, గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వైర‌స్ బారిన ప‌డిన వారిలో.. డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, వైద్య‌ విద్యార్థులు ఉన్నారు. వారంద‌రినీ ఐసోలేష‌న్‌లో ఉంచారు. కొంద‌రికి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు.. చాలామందిలో ఎలాంటి సింప్ట‌మ్స్ లేవ‌ని అంటున్నారు.

ఇక‌, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. 

తాజా ప‌రిణామాలు చూస్తుంటే తెలంగాణ‌లో కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌గా.. ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.