తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. 90శాతం ఉత్తీర్ణత

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పొరుగు రాష్ట్రం ఏపీలో టెన్త్ ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గడంతో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ నెలకొంది.

అయితే 90 శాతం ఉత్తీర్ణత సాధించడంతో కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో విద్యా బోధన సజావుగా సాగిందని అంటున్నారు. కాగా టెన్త్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు.

ఫలితాల్లో బాలురు కంటే బాలికలే పై చేయి సాధించారు. టెన్త్ పరీక్షలకు హాజరైన బాలురులో ఉత్తీర్ణతా సాధం 87.61శాతం ఉండగా, బాలికలలో ఇది 92.45 శాతం ఉంది. ఇక సిద్దిపేట జిల్లా ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఆ జిల్లాలో ఉత్తీర్ణతా శాతం 97 కాగా, చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో 79శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.  ఇలా ఉండగా  ఆగస్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.