రోశయ్యకు ప్రముఖుల నివాళి.. ఒకేసారి సీఎంలుగా పనిచేశామన్న మోడీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.  

రోశయ తమకు  చిరకాల మిత్రుడన్నారు వెంకయ్య నాయుడు.  విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని చెప్పారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య  అందరి అభిమానాన్ని చూరగొన్నారని వెంకయ్య తెలిపారు. రోశయ్య, తాను  ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉందన్నారు.  రోశయ్య సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.    

రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వయంగా పోన్ చేసి రోశయ్య కుటుంబ సభ్యులతో సోనియా, రాహుల్‌ మాట్లాడారు. రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. అమీర్‌పేటలోని ఆయన నివాసానికి వచ్చిన కేసీఆర్.. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య  అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.