బీజేపీలో సుష్మ లొల్లి!

 

 

 

బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం పార్టీలో కొరకరాని కొయ్యలా తయారయ్యారు. బీజేపీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తేవాలని అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు లాంటి నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటే సుష్మ మాత్రం వారికి ఎంతమాత్రం సహకరించకపోగా, లేనిపోని ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ప్రస్తుతం పార్టమెంటరీ పార్టీ నాయకురాలైన సుష్మ స్వరాజ్ సహజంగానే ప్రధాని పదవి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత తానే దేశ ప్రధాని అని కలలు కన్నారు. అయితే నరేంద్రమోడీ తెరమీదకి రాగానే సుష్మ నిరాశకు గురయ్యారు. ప్రధాని పదవి విషయంలో అద్వానిని అడ్డుపెట్టి నరేంద్రమోడీ అభ్యర్థిత్వానికి అడ్డుపడే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దాంతో అలకవహించిన సుష్మ, పైకి సహకరిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బోలెడంత కోపం పెట్టుకున్నారు. బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ జనం దృష్టిలో బీజేపీ పలుచన అయ్యేలా చేస్తున్నారు.


పార్టీ నాయకత్వం అనే సమీకరణాలను పరిశీలించిన అనంతరం బద్మేక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్‌కి టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అలిగిన జస్వంత్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. అయితే ఈ విషయం మీద సుష్మ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. జస్వంత్ సింగ్‌కి టిక్కెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని ఎన్నికల కమిటీలో చర్చించలేదని సుష్మ తెగ బాధపడిపోతూ మీడియాకి ఎక్కారు. ఇది బీజేపీలో వున్న క్రమశిక్షణకు భంగం కలిగించేలా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు తప్ప సుష్మ అంత యాక్టివ్‌గా లేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో సుష్మా స్వరాజ్ పార్టీ పరువు పోయే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.