Latest News

మాటల తూటాల మారెప్ప!

posted on: Jan 31, 2014 10:00AM

 

 

 

ఎంతటివారి మీదైనా మాటల తూటాలు విసరడంలో మాజీ మంత్రి మారెప్ప శైలే వేరు. ఆయన మంత్రిగా వున్నప్పుడు కూడా ఎంతమాత్రం జంకూగొంకూ లేకుండా వాగ్బాణాలు విసిరేవారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే చాలా కామెడీగా వుంటుంది. అయితే ఆ మాటల్లో చాలా లోతు వుంటుంది. ఆ మాటలు ఎవరికి ఎంత లోతు గాయాలు చేయాలో అంత గాయాలు చేస్తూనే వుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఎదిగిన మారెప్ప వైఎస్సార్ ఆకస్మిక మరణంతో రాజకీయంగా కొంత వెనకబాటుకు గురయ్యారు.

 

అయితే వైఎస్సార్ మీద తనకున్న అభిమానాన్ని ఆయన కుమారుడు జగన్ మీద కూడా ప్రసరింపజేశారు. అయితే జగన్ మారెప్ప అభిమానం మీద జెల్లకొట్టాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మారెప్ప  జగన్‌ని తన పిల్లల్ని తానే తినే పాము అంటూ అభివర్ణిస్తూ జగన్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. తాజాగా ఆయన తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలోని విధానాలు, పరిస్థితుల మీద సూటిగా బాణాలు విసురుతున్నారు. ఈమధ్య రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిట్టింగ్ సభ్యులుగా వున్న కేవీపీ, టీఎస్సార్, ఖాన్‌లకు మరోసారి అవకాశం ఇచ్చింది. దీనిమీద మారెప్ప తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీకి సేవ చేసే వారిని రాజ్యసభకి పంపించకుండా శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధంగా వున్న ముసలివాళ్ళకి రాజ్యసభ సీట్లు ఎందుకిచ్చారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.


మళ్ళీ రాజ్యసభ సీట్లు పొందిన ముగ్గురు పెద్దమనుషుల్నీ ఆయన పేరు పేరున ఘాటుగా విమర్శించారు. వేరే ఎవరైనా ఇలాంటి విమర్శలు చేసి వుంటే సదరు పెద్దమనుషుల అనుయాయులు గయ్యిమని విరుచుకుపడేవారే. అయితే విమర్శలు చేసింది మారెప్ప కావడంతో ఎవరూ కిక్కురుమనడం లేదు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు కాబట్టి ఆయన్ని పార్టీ పరంగా శిక్షించడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ మారెప్ప చేసిన విమర్శలు ఘాటుగా వున్నప్పటికీ, వాటిలో వాస్తవాలు లేకపోలేదన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురి అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే భిన్నస్వరాలు గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు బాహాటంగానే వీళ్ళ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. టీ సబ్బరామిరెడ్డి పార్టీకి ఏ రకంగా ఉపయోగపడ్డారని మళ్ళీ సీటు ఇచ్చారని నిర్మొహమాటంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...