‘ఛీ’బీఐ ‘చీప్’

 

 

 

కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మానున్... అనే మాటను ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసా? సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా లాంటివాళ్ళని ఉద్దేశించే అని వుంటారు. అసలు సీబీఐ అనేది చట్టబద్ధత లేని ఒక పనికిమాలిన సంస్థ అని ఈమధ్య గౌహతి హైకోర్టు డిసైడ్ చేసింది. అలాంటి సంస్థకి కాంగ్రెస్‌ని కాకాపట్టి, భజనచేసి చీఫ్ పదవి సంపాదించుకున్న వ్యక్తి రంజిత్ సిన్హా. తాను సీబీఐ చీఫ్ పదవి చేపట్టిన దగ్గర్నుంచీ ఏలినవారు వేలెత్తి చూపించిన వారితోపాటు, తన వ్యక్తితగ విరోధులను కూడా సీబీఐ అండతో వేధిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కడుపు నిండింది.. కాలక్షేపానికో పదవి దొరికింది.. అక్కడితో అయ్యగారు ప్రశాంతంగా వుండొచ్చు కదా!

 

 

అలా వుంటే జీవితంలో థ్రిల్లు, ట్విస్టు ఏముంటాయి? కడుపు నిండిన వాళ్ళకి నోరు ఎక్కువగా పనిచేస్తుందంటారు. రంజిత్ సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. ‘క్రీడల్లో నైతికత, నిజాయితీ, చట్టం అవసరం’ అనే అంశం మీద ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఈ పెద్దమనిషిని మాట్లాడమని పిలిచారు. అక్కడకి వెళ్ళిన రంజిత్ సిన్హా బెట్టింగ్ మంచిది కాదు అని ఒక్క మాట చెప్పి నోరు మూసుకుని వస్తే సరిపోయేది. తన క్రియేటివిటీని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో బెట్టింగ్‌ని, అత్యాచారాన్నీ పోలుస్తూ మాట్లాడాడు. దాంతో అయ్యగారి మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేలా వుందని నిరసనలు వ్యక్తమయ్యాయి. మొదట్లో లైట్‌గా తీసుకున్న సిన్హా పరిస్థితి చెయ్యి దాటిపోతోందని అర్థం చేసుకుని ఏదో నోరుజారి, మైండ్ అదుపులో లేక, అనాలోచితంగా అలా మాట్లాడేశానే తప్ప తనకు మహిళలంటే అత్యంత గౌరవమని చెప్పాడు.




అయినా వివాదం సర్దుమణగలేదు. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సావంత్ ప్రభవాల్కర్ అంటున్నారు. ఒక ఉన్నతమైన పదవిలో వుండి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రంజిత్ సిన్హా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలోకి భారతీయ జనతాపార్టీ, సీపీఎం కూడా ఎంటరయ్యారు. రంజిత్ సిన్హా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఈ రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చీప్ కామెంట్లు చేసి ఛీ కొట్టించుకుంటున్న సీబీఐ చీఫ్ ఇప్పుడేం చేస్తారో చూడాలి.