political-news-img

సారా దుకాణాలు మళ్లీ తెరవాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో గ్రామాల్లో సారా తాగిన వారు 100 నుంచి 115 సంవత్సరాలు వరకు జీవించేవారని, కానీ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న లిక్కర్ తాగడం వల్ల చాలా మంది 80 ఏళ్లకే మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అసలు సారా దుకాణాలను ఎందుకు మూసివేశారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సారా దుకాణాలు తిరిగి ప్రారంభించారని, శాస్త్రీయంగా కూడా సారా ఆరోగ్యానికి హానికరం కాదని కొందరు చెబుతున్నారని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విభిన్న అభిప్రాయాలకు దారి తీస్తున్నాయి.

Publish Date: Mar 9, 2026 11:21PM

political-news-img

ఇండ్లు కూల్చడం కాదు…ప్రజల భద్రతే లక్ష్యం : సీఎం రేవంత్

నల్ల చెరువు అభివృద్ధి చూసి చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకున్నప్పుడు ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా తాను మౌనంగా భరించానన్నారు. అయితే నల్ల చెరువు అభివృద్ధిని చూసి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ఆ విమర్శలను ఆశీర్వాదాలుగా మార్చిందన్నారు.పేదవారిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూల్చివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి ఒకటే సూచన ఉందన్నారు. వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోని మహానగరాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, అందుకే హైదరాబాద్‌లో ప్రకృతిని కాపాడుకుంటూ చెరువులను అభివృద్ధి చేయాలని అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించడం, నాలాల ఆక్రమణలు తొలగించడం, రోడ్ల విస్తరణ చేపట్టడం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.హైదరాబాద్‌ను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ అభివృద్ధి చేసుకునే అవకాశం రాదని హెచ్చరించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అవసరమైతే తల తాకట్టు పెట్టినా నిధులు సమకూర్చే బాధ్యత తనదేనని తెలిపారు.కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలు తనను నిలబెట్టారని గుర్తుచేసుకున్నారు. తనను ఆదరించిన ప్రజల కోసం అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ వెనుకాడనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Publish Date: Mar 9, 2026 11:08PM

political-news-img

ప్రపంచంలో టాప్ వేతనాలు…ఇండియన్ సీఈవోల హవా!

ఒక కంపెనీ విజయానికి వెనుక రెండు ప్రధాన శక్తులు ఉంటాయి—దాని నాయకుడు, దాని ఉద్యోగులు. ఉద్యోగులు ఎంత కష్టపడి పనిచేస్తే సంస్థ అంత బలంగా నిలబడుతుంది. అదే సమయంలో కంపెనీని సరైన దారిలో నడిపించే నాయకత్వం కూడా అంతే కీలకం. ఈ నాయకత్వ స్థానంలో ఉన్న వారినే సీఈవోలు అంటారు. వారు కేవలం ఒక సంస్థను మాత్రమే నడిపించరు ఒక పరిశ్రమ భవిష్యత్తునే మార్చగలుగుతారు. వారి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి, కొత్త సాంకేతికతలకు మార్గం సుగమం చేస్తాయి, లక్షలాది మంది ఉద్యోగుల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. ఒక సీఈవో స్థానంలో ఉండటం అంటే అత్యంత బాధ్యతతో కూడిన పని. లాభాలు, నష్టాలను సమతుల్యం చేస్తూ కంపెనీని అగ్రస్థానానికి తీసుకెళ్లడం అతని ప్రధాన కర్తవ్యం. ఈ స్థాయి పనిని నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యం, దూరదృష్టి, నాయకత్వ గుణాల కారణంగా సీఈవోలకు భారీ వేతన ప్యాకేజీలు అందుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా టాప్ సీఈవోలు ఎంత సంపాదిస్తున్నారనే అంశం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. గూగుల్ సీఈవోగా ఉన్న భారతీయ మూలాల వ్యక్తి సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీని భారీగా పెంచినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం ఆయన వార్షిక వేతన ప్యాకేజీని భారతీయ కరెన్సీలో లెక్కిస్తే సుమారు రూ.6,361 కోట్లు (దాదాపు 692 మిలియన్ డాలర్లు). అంటే 63 అంకె తర్వాత తొమ్మిది సున్నాలు పెడితే వచ్చే మొత్తం! దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందే టాప్ సీఈవోల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… ప్రపంచంలో అత్యధిక వేతనం పొందే టాప్ 10 సీఈవోల్లో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. వారిలో ఒకరు సుందర్ పిచాయ్ కాగా, మరొకరు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఇంకొకరు సైబర్ సెక్యూరిటీ దిగ్గజ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవో నికేష్ అరోరా. సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందినవారు కాగా, సత్య నాదెళ్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. నికేష్ అరోరా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందినవారు. సుందర్ పిచాయ్ తాజా వేతన ప్యాకేజీలో ఆయనకు 2 మిలియన్ డాలర్ల ప్రాథమిక జీతం ఉంటుంది. అదనంగా 126 మిలియన్ డాలర్ల పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు ఇవ్వనున్నారు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న విధానంపై ఈ స్టాక్ విలువ మారుతుంది. అంతేకాదు, 84 మిలియన్ డాలర్ల లిమిటెడ్ స్టాక్ వెస్టింగ్ కూడా ఉంటుంది. అంటే కంపెనీ ఉద్యోగికి మంజూరు చేసే షేర్లు—పని కాలం లేదా పనితీరు ఆధారంగా తర్వాత ఉద్యోగికి బదిలీ అవుతాయి. అదేవిధంగా గూగుల్ అనుబంధ సంస్థలైన వేమో (Waymo), వింగ్ ఏవియేషన్ (Wing Aviation) లలో కలిపి సుమారు 175 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కూడా సుందర్ పిచాయ్‌కు కేటాయించినట్లు సమాచారం. ఆయనపై కంపెనీకి ఉన్న విశ్వాసం కారణంగానే ఈ భారీ వేతన పెంపు ఇచ్చినట్లు చెబుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే—సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి, 2015లో సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో గత పదేళ్లలో గూగుల్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. పదేళ్ల క్రితం సుమారు 535 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ, ప్రస్తుతం 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందే టాప్ 10 సీఈవోలు ఎవరో ఒకసారి చూస్తే— 1. ఎలోన్ మస్క్ (టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్) 2. జెన్సెన్ హువాంగ్ (ఎన్విడియా) 3. మార్క్ బెనియోఫ్(సేల్స్‌ఫోర్స్) 4. రీడ్ హేస్టింగ్స్ (నెట్‌ఫ్లిక్స్) 5. లియోనార్డ్ ష్లీఫర్ (రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్) 6. టిమ్ కుక్ (ఆపిల్) 7. నికేష్ అరోరా (పాలో ఆల్టో నెట్‌వర్క్స్) 8. సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ , గూగుల్) 9. హాక్ ఇ. టాన్ (బ్రాడ్‌కామ్) 10. సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) ప్రపంచ వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి భారీ వేతనాలు అందుకుంటున్న ఈ సీఈవోలు, తమ నాయకత్వంతో సంస్థల భవిష్యత్తును మాత్రమే కాదు… గ్లోబల్ టెక్నాలజీ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు.

Publish Date: Mar 9, 2026 10:35PM

political-news-img

భారత్ వరల్డ్ కప్ విజయాల్లో ఆసక్తికర సెంటిమెంట్!

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్2026ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను అందుకుంది. రెండు వన్డే, మూడు టీ20లు కలిపి మొత్తంగా ఐదు ప్రపంచ కప్‌లను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ కప్ విజయాల వెనక ఉన్న ఓ ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. 1983లో భారత్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడింది. తాజాగా టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకుంది. 1983 నుంచి తాజాగా టీ20 వరల్డ్ కప్2026 వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో తప్పనిసరిగా ఒక సర్ధార్, ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. వారు లేకుండా ఇప్పటి వరకు భారత్ ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవకపోవడం విశేషం.1983లో సర్దార్ బల్విందర్ సంధూ , కేరళ ఆటగాడు సునీల్ వాల్సన్‌లతో ఈ సెంటిమెంట్ మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో హర్భజన్ సింగ్, కేరళ ప్లేయర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషించారు. అలానే 2024, 2026 టీ20 ప్రపంచ కప్ లలో సంజు శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) సంప్రదాయాన్ని కొనసాగించారు. టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీని గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు చేశాడు. అది గాలివాటం కాదు... అని నిరూపిస్తూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి జట్టు టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే 2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి అర్ష్‌దీప్‌ సింగ్‌.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్‌ సర్దార్‌ అనిపించుకున్నాడు.

Publish Date: Mar 9, 2026 9:31PM

political-news-img

బుగ్గనపై ఆరోపణలు రుజువైతే పీడీ యాక్ట్...చంద్రబాబు వార్నింగ్

వైసీపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు వెలుగు చూస్తాయన్న భయంతోనే బుగ్గన సైలెంట్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుగ్గన పాల్పడిన భూ కబ్జాలపై ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతు ఆ ఆరోపణలు నిజమని తేలితే బుగ్గనపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో చంద్రబాబు పర్యటించి, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబుకు ఓ రైతు ఫిర్యాదు చేశారు. విచారించి సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను సీఎం ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే ఆక్రమణ దారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఓ రైతు భూమిని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తన అనుచరుల పేరుతో మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద లక్షల ఎకరాల భూములను అధికారుల ప్రమేయం లేకుండానే ఇష్టారాజ్యంగా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముందు పాన్యంలో పాస్ బుక్‌ను చించేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశానని తెలిపారు. గతంలో తాను రెవెన్యూ మంత్రిగా పని చేశానని.. రెవెన్యూ సమస్యలు, చట్టాలపై పూర్తిగా అవగాహన ఉందని స్పష్టం చేశారు. భూములు ట్యాంపరింగ్ జరగకుండా డిజిటల్ పాస్ బుక్‌లు ఇస్తున్నామని వెల్లడించారు. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం డిసెంబర్ నాటికి భూ సమస్యలు పరిష్కారిస్తామని మాటిచ్చారు. అనుభవంలో ఉన్న రైతులకు నెలలోపు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా అరగంటలో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Publish Date: Mar 9, 2026 9:13PM

political-news-img

నెయ్యి ట్యాంకర్ బోల్తా...బకెట్‌లతో ఎత్తుకెళ్లిన స్థానికులు

కడప జిల్లా కొండాపురం మండలంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని చిత్రావతి వంతెన సమీపంలో నెయ్యితో వెళ్తున్న ఒక ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. వంతెన వద్ద ట్యాంకర్ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో, అందులోని నెయ్యి భారీగా రోడ్డుపైకి, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రవహించింది. ట్యాంకర్ బోల్తా పడి నెయ్యి నేలపాలవుతోందన్న వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది . విషయం తెలిసిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చేతికి దొరికిన బిందెలు, బకెట్లు, చెంబులు, బాటిళ్లతో నెయ్యిని పట్టుకోవడానికి పోటీ పడ్డారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని తోడుకోవడానికి అబాలగోపాలం ఎగబడటంతో అక్కడ సందడి నెలకొంది. ​ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ, జనం మాత్రం నెయ్యిని సేకరించడంలోనే నిమగ్నమయ్యారు. ప్రమాదంలో డ్రైవర్‌కు జరిగిన గాయాల వివరాలు తెలియాల్సి ఉంది.

Publish Date: Mar 9, 2026 8:01PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img