Read more!

చలికాలంలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది? చల్ల నీరా? వేడి నీరా?

అన్ని ప్రాంతాలలో ప్రజలు చలి కారణంగా బోలెడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెచ్చని వాతావరణంలో ఉండాలని అనిపించడం, వేడి ఆహారాలు, పానీయాలు తీసుకోవడం, స్నానానికి వేడి నీరు ఉపయోగించడం చేస్తుంటారు. అధికశాతం మందికి ఉదయాన్నే స్నానం చేసి ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లడం అలవాటు. ఇంట్లో మహిళలు కూడా ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పూజ గట్రా చేసుకుంటారు. చలి కారణంగా అందరూ వేడి నీటి స్నానం చెయ్యడానికే మొగ్గు చూపుతారు. అయితే  చలికాలంలో చల్లనీరు, వేడి నీరు వీటిలో స్నానాకి ఏది బెస్ట్ అనే  విషయం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిందేంటంటే..

వేడి నీరు

నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. ఇది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా కాసింత వెచ్చదనంతో ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉండదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి చలి అనుభూతిని తగ్గిస్తుంది. అయితే మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

చల్లటి నీరు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉన్నవారు చల్లటి నీళ్లలో స్నానం చేయడం మానుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు బారిన పడే ప్రమాదం ఉంది.

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రమాదాలు..

సోమరితనం

 వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు పడితే ఆ తరువాత  చల్లటి నీటితో స్నానం చేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల వేడినీరు దొరక్కపోతే స్నానం చేయడంలో సోమరిపోతులు అవుతారు. కేవలం ఇదొక్క కారణంగా వ్యక్తులలో ఒకానొక బద్దకం చోటు చేసుకుంటుంది. స్నానంతో మొదలయ్యే ఈ విషయం ఇతర జీవన కార్యకలాపాలకు కూడా సులువుగా విస్తరిస్తుంది. కాబట్టి అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి.

జుట్టుకు నష్టం

ఎక్కువ వేడి నీళ్లతో తలస్నానం చేయడం  వల్ల జుట్టు పాడవుతుంది. జుట్టు పొడిగా,  నిర్జీవంగా మారుతుంది. అందుకే ఎక్కువ  వేడి నీటితో తల స్నానం చేయడం మానుకోవాలి.

 చర్మం పొడిబారుతుంది

ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో తేమ తగ్గుతుంది. ఇది పొడి చర్మం సమస్యను పెంచుతుంది. ఏదైనా చర్మ సమస్య ఉన్నవారు ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు.