Read more!

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది. ఇంత కాలం‘నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు’ అన్నట్లు వ్యవహరించిన  తెలంగాణ కాంగ్రెస్ నేతలు..  తీరా పార్టీ ఉత్సాహంగా ముందుకు సాగుతున్న సమయంలో.. గ్రూపులు కట్టి మరీ పరువును నడిబజారులోకి ఈడ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షపాత్ర పోషించకపోవడమే కాకుండా.. బీజేపీ బలపడేందుకు కాంగ్రెస్ నేతలే ఒకరకంగా కారణమనే విశ్లేషణలు వస్తున్నాయి. అయినా.. కాంగ్రెస్ నేతల్లో అస్సలు రిపెంటెన్స్ కనిపించడం లేదని అంటున్నారు.  టీ. కాంగ్రెస్ లో ఇప్పుడొకరు తాను ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటుంటే.. మరొకాయన నేనే  పెద్ద తోపు.. తురుం అని చెప్పుకుంటున్నారు. అలా వారు చెప్పుకోడానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం ఇష్టం లేకపోవడమే కారణమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా ఇన్నేళ్లుగా నోరెత్తి ప్రశ్నించని కాంగ్రెస్ బడా నేతలు.. రేవంత్ రెడ్డి చేసే పోరాటంలో తప్పులు వెతికే పనిలో పడ్డారని సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయిస్తే అన్న వెంకట్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడ లేదని, కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు అయిన బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరడం వెనుక సొంతపార్టీని బలహీనపరిచే కుట్ర ఉందని పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి.

ఇదంతా గమనించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయారు. పార్టీకి నష్టం కలిగిస్తే కబడ్దార్ అంటూ  వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఊరుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడులో సభ పెట్టి, లాగి బండకేసి కొడతా అన్నారు. మరో నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏకంగా పార్టీ నుండి వెళ్లిపొమ్మని పరుష పద జాలంతో విమర్శలు గుప్పించారు. దీంతో రగిలిపోయిన వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం ఓ మెట్టు దిగిన రేవంత్ రెడ్డి సారీ కూడా చెప్పారు. అయితే.. రేవంత్ రెడ్డి సారీ తనకు చాలదని.. దయాకర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలనే కొత్త షరతును వెంకటరెడ్డి తెరమీదకి తీసుకువచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న  పరిణామాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ నేతల చిల్లర పంచాయితీతో జనం విసుగెత్తిపోతున్నారు. వారి తీరు పక్క పార్టీలకు మేలు చేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ పాత కాపులు చంపి, పాతరేసిన సమయంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. అధికార పార్టీ నేతలను ఓ రేంజ్ లో ఎండగడుతున్న రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంతే టార్గెట్ గా పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ముందు బయటికి వెళితే.. అన్న వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉండి చేయగలిగినంత నష్టం చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  కోమటిరెడ్డికి అసలు రేవంత్ రెడ్డి సారీ ఎందుకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి యాభై కోట్లు పెట్టి కొన్నారని ఆ మధ్యన రేవంత్ రెడ్డి, మాణిక్ ఠాగూర్ పై విమర్శలు చేసిన వెంకటరెడ్డిని అనాడే సస్పెండ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. ఎంతమంది ఎన్నిసార్లు అవమానించినా రేవంత్ రెడ్డి పార్టీ కోసం సర్దుకుపోయారే తప్ప చేతకాక కాదని ఆయన వర్గీయులు అంటున్నారు. పీసీసీ పీఠం దక్కలేదన్న ఉక్రోషంతోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.