Read more!

ఆర్ఎస్ఎస్ ఆదేశాలు మోడీషా లెక్క చేయరు..!

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం లేకపోవడాన్ని పరిశీలకులు సైతం అనూహ్య పరిణామంగానే పరిగణిస్తున్నారు. మోడీ కేబినెట్ లో అమిత్ షా తరువాత గట్టిగా వినిపించే పేరు నితిన్ గడ్కరీ మాత్రమే. అంతే కాదు ఆయన నాగపూర్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. నాగపూర్ పెద్దలు అనగానే ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అన్న విషయం తెలిసిందే.

మోడీ 2.0కు ముందు ప్రధాని పదవి కోసం ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీ పేరును ఒకింత సీరియస్ గానే పరిగణించింది. ఆర్ఎస్ఎస్ మార్గదర్శనం, ఆదేశం, సూచనలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నడుస్తుంటుందన్నది పెద్దగా రాజకీయ పరిజ్ణానం అవసరం లేని వారికి సైతం అవగాహన ఉన్న అంశం. అయితే అదంతా గతం.. ఇప్పుడు బీజేపీ సర్కరా్ మొత్తం డబుల్ ఇంజిన్ (మోడీ, అమిత్ షా) కనుసన్నలోనే సాగుతోందన్నది జగద్వితితం. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ తో ఉన్న ఆ యస్ బాస్ బంధాన్ని మోడీ షా ద్వయం విచ్ఛిన్నం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా? ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ నాగపూర్ ఆదేశాలను ఖాతరు చేయడం లేదనడానికి గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం లేకుండా పోవడమే తార్కానమని చెప్పడానికే. ఇంతకీ గడ్కరీ పట్ల మోడీకి లేదా మోడీ షా ద్వయానికీ ఎందుకంత ఆగ్రహం అంటే ఎవరైనా వెంటనే గడ్కరీ ఒక్కరే మోడీ కేబినెట్ లో ఎంతో కొంత స్వతంత్రంగా పని చేసే మంత్రి కావడమే అని చెబుతారు.

అయితే అది కొంత వరకూ మాత్రమే వాస్తవం, పూర్తి వాస్తవమేమింటంటే.. ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం తో బాటు.. నాగపూర్ కు సన్నిహితంగా ఉంటారు. ఆయనకు మోడీ, షాల ఆదేశాల కంటే నాగపూర్ (ఆర్ఎస్ఎస్) ఆదేశాలే శిరోధార్యం. ఆయనకునచ్చని వ్యవహారం ఉంటే మోడీ, షాలను విమర్శించేందుకు కూడా ఇసుమంతైనా వెనుకాడరు. అటువంటి గడ్కరీకి పార్టీ అత్యున్నత నిర్ణాయక బోర్డులో స్థానం లేకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ వర్గాల కథనం ప్రకారం గడ్కరీకి చాలా కాలం కిందటే.. ఆర్ఎస్ఎస్ ఆదేశాలను, సూచనలనూ స్వీకరించి, ఔదాల్చే పరిస్థితిలో మోడీ సర్కార్ లేదని అర్ధమైంది.

అందుకే ఇటీవల రాజకీయాలపై తన వైరాగ్యాన్ని బాహాటంగా వెల్లడి చేశారు. అలా వెల్లడించడం ద్వారా పార్టీలో తన ప్రధాన్యతను తనంత తానుగానే తగ్గించేసుకున్నారు. రాజకీయాల్లో విలువలు పతనమయ్యాయి, అధికారం కోసం ఎంతకైనా తెగబడి పరిస్థితి దాపురించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. నేరుగా మోడీ, షా ద్వయాన్ని ఉద్దేశించినవేనని విపక్షాలు నిర్ధారించేశాయి. అయినా కూడా గడ్కరీ విపక్షాల సూత్రీకరణను ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు.  ఈ పరిస్థితులను, పరిణామాలను గమనించిన వారెవరికైనా పార్లమెంటరీ బోర్డులో గడ్కరీ స్థానం గల్లంతవ్వడం ఆశ్చర్యం కలిగించదు.. సరికదా ఆయన ఇంకా మోడీ కేబినెట్ లో కొనసాగుతుండటమే ఆశ్చర్యం కలిగించక మానదు. ముఖ్యంగా మహారాష్ట్ర పరిణామాల తరువాత గడ్కరీకి పార్టీలో, ప్రభుత్వంలో తన స్థానం ఏమిటన్నది ప్రస్ఫుటమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనమైన రోజుల వ్యవధిలోనే గడ్కరీ రాజకీయ నిర్వేదం ప్రకటించారు.

కేబినెట్ లో తన స్వతంత్ర వైఖరి తన పదవికీ, ప్రాధాన్యతకూ ఎసరు పెట్టక తప్పదని ఆయనకు నాడే అర్ధమై ఉంటుందని పరిశీలకులుఅంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు చేస్తున్నది అశ్వమేథ యాగం.. పూర్వం రాజులు తమ రాజ్య విస్తరణ కోసం ఈ యాగం చేసే వారట. ఒక గుర్రాన్ని వదిలి అధి తిరిగిన ప్రాంతమంతా తమ అధీనంలోకి తీసుకునే వారట. తమ ఆధిపత్యాన్ని అంగీకరించని వారు ఆ గుర్రాన్ని బంధిస్తే అక్కడ యుద్ధం చేసి గెలిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే వారన్నమాట. ఇప్పుుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలోనేఅత్యంత పెద్ద డెమొక్రటిక్ కంట్రీలో బీజేపీ ఒకదాని తరువాత మరొకటి అన్నట్లుగా రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల ఏర్పాటు కోసం సరికొద్ద అశ్వమేధ యాగం చేస్తోంది. ఇందు కోసం ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలన్ని కూలుస్తోంది. అధికార పార్టీలో చీలికలను ప్రోత్సహిస్తోంది. తిమ్మిని బమ్మిని చేస్తోంది.

ఏం చేసైనా సరే రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంటే చాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ విషయాన్నే గడ్కరీ ఎత్తి చూపారు. అధికారం కోసం ఎంతకైనా తెగించేయడమేనా అని ప్రశ్నించారు. ఫలితం అనుభవించారు అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటమే కాకుండా మూడో సారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉండటం ఇదే తొలిసారి అని అంటున్నారు. అటువంటి ఘనత సాధించిన మోడీ అధికార పరిధిని, విస్తృతిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎలా అన్నది బీజేపీ శ్రేణుల ప్రశ్న. మొత్తం మీద ఇప్పుడు నాగపూర్ తెరవెనుక మద్దతు మోడీ సర్కార్ కు అవసరం లేదు. ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చాటేందుకే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం ఇవ్వకుండా అవమానించడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే గియితే త్వరలోనే మోడీ కేబినెట్ లో కూడా గడ్కరీ స్థానం గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ అని కూడా అంటున్నారు. ప్రశ్నించే వారూ, పోటీకి వచ్చేవారూ కనుచూపు మేరలోనైనా ఉండడానికి మోడీ షా ద్వయం అంగీకరించదని అంటున్నారు.