మధుమేహం ఉన్నవారు మామిడిపండు తినేటప్పుడు ఈ తప్పు చేస్తే అంతే!
posted on Apr 29, 2024 @ 9:53AM
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే..
మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం, విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి. వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి. మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి. వైద్యుడిని సంప్రదించాలి.
భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.
*రూపశ్రీ.