మామిడి కాయల గురించి మీకు తెలియని నిజాలివే!
posted on Apr 7, 2024 @ 9:30AM
పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వస్తోందంటే పిల్లా పెద్దలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు మామిడి పండ్ల కోసం.. ఇప్పుడు మార్కెట్లో మామిడి పండ్ల హడావిడి సాగుతోంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్ల సొంతం. పచ్చిగా ఉన్న మామిడి కాయలను పచ్చళ్ళు, పప్పు, కూరలు వండుతారు, పండిన వాటితో పానీయాలు, స్మూతీలు, షేక్ లు చేస్తుంటారు. ఎక్కువ మంది పండిన మామిడి కాయలు తినడానికి ఇష్టం చూపుతారు. కానీ పండిన మామిడి కంటే పచ్చి కాయను తినడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలింతకూ ఈ రెండింటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?? రెండింటిలో ఏది బెస్టు.. ఆరోగ్యానికి ఏది మంచిది?? వివరంగా తెలుసుకుంటే..
పండిన మామిడి..
పండిన మామిడిలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, బి మొదలైనవి కూడా సమృద్ధిగా ఉంటాయి. పండిన మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.
ఇది గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదే విధంగా థైరాయిడ్ సమస్యను దూరం ఉంచడంలో సహాయపడుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నా పచ్చి మామిడి కాయ బెస్ట్ అంటున్నారు..
పచ్చి మామిడి తింటే..
పచ్చిమామిడి కాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో పండిన మామిడి కంటే పచ్చి మామిడి బెస్ట్. సహజంగా గర్భవతులు పచ్చి మామిడి అంటే ఇష్టం చూపిస్తారు. ఇది వాంతులు, వికారం అరికట్టడంలో సహాయపడుతుంది. వేసవిలో ఎదురయ్యే వడదెబ్బ భయానికి పచ్చి మామిడి చాలా బెస్ట్. పచ్చి మామిడిని ఉడికించి చేసే ఆమ్ పన్నా.. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కనీసం పచ్చి మామిడి ముక్కలమీద కాసింత ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో ఐరన్, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలు బయటకు వెళ్లకుండా ఉంటాయి. వేసవిలో పచ్చి మామిడి తీసుకోవడం వల్ల శరీరం నీరసానికి లోను కాకుండా శరీరంలో తేమ శాతం తగ్గకుండా హైడ్రేట్ గా ఉండచ్చు.
రెండు రకాల మామిడి పళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ పచ్చి మామిడిని ప్రయోజనాలు ఎక్కువ. అలాగే పండిన మామిడిని అతిగా తీసుకుంటే వచ్చే సమస్యలూ ఎక్కువే..
◆నిశ్శబ్ద.