ఈ ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుంది..!
posted on Aug 16, 2024 @ 9:30AM
శరీరాన్ని కబళించే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిలో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ కారణంగా అధిక బరువు, మధుమేహం, కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటంటే..
ఉసిరి..
పచ్చి ఉసిరికాయ తినడం, లేదా ఉసిరి రసం తాగడం, ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది.
అవిసె గింజలు..
అవిసె గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవిసె గింజలు మంటను తగ్గిస్తాయి. వీటిని వేయించి తినవచ్చు, పొడి తయారు చేసి పొడి రూపంలో తీసుకోవచ్చు. స్నాక్స్, స్మూతీలలో జోడించవచ్చు. సలాడ్స్ లో కూడా చేర్చుకోవచ్చు.
పసుపు..
పసుపును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పసుపు రక్తనాళాలలో పేరుకుపోయిన ఫలకాన్ని తగ్గిస్తుంది. వంటలలో దీన్ని భాగం చేసుకోవచ్చు. పసుపు పాలు కూడా తీసుకోవచ్చు. నీటిలో కలిపి తాగవచ్చు. వైద్యుల సలహా మేరకు పసుపు టాబ్లెట్లు కూడా వాడచ్చు.
దనియాలు..
దనియాలను అనేక మాసాలా పొడుల తయారీలో వినియోగిస్తారు. ఇవి చాలా రకాల అనారోగ్యాలను తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మెరుగ్గా ఉంటాయి. దనియాలు ఆహారంలో తీసుకోవడం లేదా దనియాల టీ తయారుచేసుకుని తాగడం చేస్తుంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు.. శరీరం శుద్ది అవుతుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడమే కాదు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయపడుతుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.
*రూపశ్రీ.