Read more!

పరోపకారి ఏనుగు

ఆకారం భీకరమే అయనా ఏనుగులకు మానవులలో ఉండే అన్ని స్పందనలూ ఉంటాయి. మమకారం, ప్రేమ, పరోపకార బుద్ధి, ఆత్మీయత, అనురాగం, ఆగ్రహం, క్రోధం ఇలాంటి స్పందలన్నీ ఏనుగులలోనూ మానవులతో సమానంగా ఉన్నాయనీ, ఉంటాయనీ చెబుతుంటారు. అందుకే ఏనుగులు మనుషులకు మచ్చిక అవుతాయి. వారి పట్ల మమకారాన్నీ పెంచుకుంటాయి. కాగా ఓ ఏనుగు చిన్నారి పట్ల స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. చైనాలోని ఓ జూలో ఓ ఏనుగు తన పరోపకార బుద్ధిని చూపింది. ఓ చిన్నారికి తన తొండంతో సహాయం అందించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నది. ఆధునిక కాలంలో మానవులలో కరవైపోతున్న సహాయం చేసే గుణం ఆ ఏనుగులో మాత్రం పుష్కలంగా ఉందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాలోని ఓ జూకు వెళ్లిన ఫ్యామిలీలో రెండేళ్ల చిన్నారి తన బూటును పొరపాటున ఎనుగుల ఎన్ క్లోజర్ లో పడేసుకుంది. కాలి నుంచి జారి బూటు ఎన్ క్లోజర్ లో పడిపోవడంతో ఆ చిన్నారి బిక్కముఖం వేసింది. అయితే ఆశ్చర్య కరంగా ఓ ఎనుగు తన తొండంతో ఆ షూను తీసి పాపకు అందించింది. దాంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోయింది. ఈ మొత్తం సంఘటనను పక్కనున్న వారు తమ సెల్ ఫోన్ లో షూట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఏనుగు పరోపకార బుద్ధిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ ఏనుగును చూసి మనుషులు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు. మనుషులలో సున్నతత్వం, మానవత్వం కనుమరుగైపోతుంటే.. ఈ ఏనుగు మాత్రం మాలో అవి పుష్కలంగా ఉన్నాయని చాటిందనంటూ కామెంట్లు పెడుతున్నారు.