Read more!

ఆరంభం ఆర్భాటం.. అంతలోనే మంగళం.. జగన్ స్టైల్

ఆర్భాటంగా ఆరంభించడం... ఆ తరువాత మధ్యలోనే వదిలేయడం ఏపీ సీఎం జగన్ కు బాగా అలవాటైన విద్య. సంక్షేమ పథకాల విషయంలోనైనా, పార్టీ కార్యక్రమాల విషయంలోనైనా ఆఖరికి నియోజకవర్గ సమీక్షల విషయంలోనైనా సరే అదే పంథా. ఎలాంటి మినహాయింపులూ ఉండవు. గడపగడపకూ అంటూ ఆర్భాంగా ప్రారంభించిన కార్యక్రమం ఇప్పుడు అతీగతీ లేకుండా పోయినా దానికి సీఎం జగన్ ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.

అసలు చాలా మంది ఈ కార్యక్రమం కోసం తమ ఇంటి గడప కూడా దాటలేదన్న ఆరోపణలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మొదట్లో మాత్రం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకోవడం లేదంటూ ఎమ్మెల్యేలపై చర్రుబుర్రులాడిన జగన్ ఆ తరువాత తత్వం బోధపడి మౌనం వహించారు. మంత్రుల సామాజిక న్యాయభేరి యాత్ర వైఫల్యంపై కూడా జగన్ అంతే నాన్ సీరియస్ గా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ లాభం లేదు అంటూ తానే స్వయంగా నడుంబిగించి ప్రారంభించిన  నియోజకవర్గాల సమీక్షల వ్యవహారం కూడా అంతే ఆర్భాటంగా ప్రారంభించి ఓ రెండు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించేసి చేతులు దులిపేసుకున్నారు.

ఆ నియోజకవర్గాల సమీక్షలలో తన పాలన గురించి పొగడ్తలు లేకపోవడం.. కార్యకర్తల నుంచి కూడా సమస్యల పరిష్కారం కోసం వినతులు వెల్లువెత్తడంతో ఆయన ఇక ఆ కార్యక్రమానికీ మంగళం పాడేశారు. స్వోత్కర్ష, పర నింద ఆయన స్టైల్. అలాగే తన వద్దకు వచ్చే వారు కూడా విపక్షాలపై విమర్శలు గుప్పించి, తననూ తన పాలననూ పొగడ్తలతో ముంచెత్తితే ఆయన అంగీకరిస్తారు. అందుకు భిన్నంగా సమస్యల ప్రస్తావన తీసుకు వస్తే మాత్రం వారిని దూరం పెడతారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. బాలినేని వంటి వారు పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడానికి కారణం వారు సమస్యలను ప్రస్తావించి అధినేత ఆగ్రహానికి గురి కావడమేనంటున్నారు. ఇక జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు ఉక్కపోతకు కారణం కూడా అదేనంటున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు తన రాజకీయ అనుభవంతో క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేందుకు చేసే ప్రయత్నాలు అధినేతకు రుచించడం లేదని గ్రహించి సైలెంట్ అయిపోయారు.

ఇక ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లు పైబడిన కాలంలో కనీసం ఒక్కసారి కూడా సీఎంను కలవని ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక కార్యకర్తల సంగతి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. నియోజకవర్గ సమీక్షల పేర కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారని వారంతా ఎంతో సంతోషించారు. కానీ కుప్పం, రాజాం నియోజకవర్గాల సమీక్షతోనే ఆ కార్యక్రమానికి జగన్ మంగళం పాడేయడంతో కార్యకర్తలు ఉసూరు మన్నారు. క్షేత్ర స్థాయిలో నేతలను ప్రజలు నిలదీస్తున్న సమస్యల విషయం సమీక్షల్లో కార్యకర్తలు ఎక్కడ ప్రస్తావిస్తారో.. వారు ప్రస్తావించిన అంశాలే ఎక్కడ హై లైట్ అవుతాయోనన్న జంకే జగన్ సమీక్షలకు మంగళం పాడేయడానికి కారణంగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జగన్ వచ్చే ఎన్నికలలో 175 అవుటాఫ్ 175 విన్ గ్యారంటీ అని చెబుతుంటే.. సమీక్షలకు హాజరైన వారు మాత్రం గుంతల రోడ్లు, పథకాల్లో కోత, లబ్డిదారులు సైతం వ్యక్తం చేస్తున్న ఆగ్రహం ఇవే ప్రస్తావిస్తున్న పరిస్థితి.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్షలు కూడా లేకుండా తమ అధినేత సైలంట్ గా ఉండటం పట్ల కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. సమస్యలను అడ్రస్ చేయకుండా ఎన్నికలలో ప్రజలను ఓట్లడిగేందుకు ఎలా వెళ్లగలమని వారు స్థానిక నేతలను నిలదీస్తున్నారు. స్ధానిక నేతలూ ఏం చేయలేని పరిస్థితి.