నాలుగు కప్పుల కాఫీతో ఏం కాదెహే!
posted on Oct 19, 2024 @ 9:30AM
ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే...
ఇదీ లిమిట్ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం.
గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు.
పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్ తీసుకోకూడదన్నమాట.
మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్‌తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక.
చివరగా చిన్న మాట...
కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్ ఉండదు. టీ, కూల్‌డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే!
- నిర్జర.