రాత్రి తొందరగా భోజనం చేయమని పెద్దవాళ్లు చెప్పేది ఇందుకే!

మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే...


ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది.

రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.  


రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది.

ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు.

చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి.

ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.


                                                          *నిశ్శబ్ద.