అంజీర్ పండ్లను పాలతో కలిపి తాగితే కలిగే...ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
posted on Jan 25, 2024 9:22AM
పాలు ఆరోగ్యకరమైన పదార్థం. పోషకాహారంలో పాలకు కూడా చోటుంది. అయితే పాలను సాధారణంగా కాకుండా మరింత రుచిగా తీసుకోవడానికి కొందరు పండ్లు జోడిస్తారు. మరికొందరు మిల్క్ షేక్ లు చేసుకుని తాగుతారు. కొందరు పాలు, తేనె మిశ్రమం తీసుకుంటారు. పాలతో ఖర్జూరం కూడా తీసుకునేవాళ్లు ఉన్నారు. కానీ పాలతో అంజీర్ కలిపి తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. అంజీర్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
పోషకాలు..
అంజీర్ పోషకాలతో నిండిన డ్రై ఫ్రూట్. విటమిన్ ఎ, బి, కె, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి ఉంటాయి. పాలు, అంజీర్ రెండూ కలిస్తే శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. పోషకాహార లోపంతో బాధపడేవారు ఈ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటే చాలా సహాయపడుతుంది.
జీర్ణాశయానికి..
అంజీర్ డైటరీ ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా నడుపుతుంది. అంజీర్‌లోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరోవైపు పాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, ప్రేగుల ఆరోగ్యానికి మరింత సహాయపడతాయి. రెండూ కలిస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడటానికి, జీర్ణాశయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
శక్తి ..
అంజీర్‌లోని సహజ చక్కెరలు శక్తిని అందిస్తాయి. పాలతో కలిపినప్పుడు ప్రోటీన్లు, కొవ్వుల కారణంగా ఈ శక్తి విడుదల ఎక్కువసేపు ఉంటుంది. ఇది తక్షణ శక్తిని మాత్రమే కాకుండా ఎక్కువసేపు నిలకడగా శక్తిని సమకూర్చి శరీరాన్ని బలంగా ఉంచుతుంది. మధ్యాహ్న సమయంలో శక్తి పుంజుకుని పనిచేయడానికి లేదా ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా అయినా ఇది చాలా బాగుంటుంది.
చర్మం, జుట్టు పోషణ..
అంజీర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ,చర్మం రంగు మెరుగుపడటానికి , చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే లాక్టిక్ యాసిడ్ పాలతో ఉంటుంది. పాలు, అంజీర్ రెండూ కలిపి తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. అదేవిధంగా జుట్టు పెరుగుదల బాగుంటుంది.
బరువు..
బరువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి అంజీర్ , పాలు కాంబినేషన్ బెస్ట్ ఎంపిక. ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి నియంత్రిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్ కండర ద్రవ్యరాశిని సంరక్షించడంలో సహాయపడుతుంది. పాలు, అంజీర్ కలిపి తీసుకుంటే అటు శరీరానికి పోషణ ఇస్తూ, మరోవైపు బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.
*నిశ్శబ్ద.