ప్రకృతి జీవన విధానమే ఎందుకు?

పంచ భూతాత్మకమైనదే ప్రకృతి. అంటే భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, ఇవి పంచభూతములు, మన శరీరం కూడా పంచ భౌతికమైనదే. అందువల్లనే బ్రహ్మాండం (ప్రకృతి)లో ఏమి జరుగుతుందో పిండాండం అయిన ఈ శరీరంలో కూడా అదే కార్యక్రమము నిర్వహింపబడుతుంది అన్నారు పెద్దలు. అంటే ప్రకృతికి ఎంత పవిత్రస్థానం ఉందో ఆ ప్రకృతిలోనే పుట్టి, దానిలోనే పెరిగి, దానిలోనే కలిసిపోయే మన ఈ దేహానికి కూడా అంత పవిత్రత ఉంది. అందుచేత ప్రకృతికి, ఈ మానవుడికి బేధం లేదు. ఇది గ్రహించిన వారు కాబట్టే పూర్వీకులు, ఋషులు ప్రకృతి శక్తులను, ప్రజ్ఞలను ఆరాధించడం నేర్చుకున్నారు. ఆ ప్రకృతితో సహకరించడం నేర్చుకున్నారు, అందువల్లనే మన పూర్వీకులు ఆయురారోగ్యాలతో జీవించగలిగారు.

సృష్టిలో ఉన్న 84 లక్షల ప్రాణులు పంచభూతాత్మకాలే. ఆ జీవులన్నీ ప్రకృతిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాయి. కాబట్టి వారికి ఏ రకమైన విద్య విధానాలు గాని, వైద్య'శాలలుగాని, వైద్యలు గాని, మందులు గాని అవసరం లేకుండా రోగాలు రాకుండా ఆయురారోగ్యాలతో ఉంటున్నాయి. కానీ ఒక్క మానవుడు మాత్రమే దారి తప్పి ప్రలోభాలకు లోనై శరీరానికి అవసరమైనది తినడానికి బడులు, నాలికకు ఇష్టమైనది తింటూ, శ్రమ చేయకుండా ఆరగిస్తూ, త్రాగావలసిన వాటిని త్రాగకుండా, విశ్రాంతి సరిగా ఇవ్వకుండా, మలమూత్రాలను సరిగా విసర్జించక, శరీరాన్ని నిత్యం పాడు చేసుకుంటూ తను బాధపడుతూ, ప్రక్క వారిని బాధపెడుతూ ప్రకృతి విరుద్ధంగా రోగాలతో కాలం గడుపుతున్నారు. ఇదంతా ప్రకృతి ధర్మాలను, శరీర ధర్మాలను ఉల్లంఘించడం వలన ప్రకృతి మానవుడికి విధించే శిక్ష, ఈ శిక్ష నుండి మానవుడు బయట పడాలంటే తిరిగి ప్రకృతి జీవనాన్ని నమ్ముకోవడమే శరణ్యం.

ప్రకృతి నియమాలను వదిలి వేసి మానవుడు ఆరోగ్యానికి పాట్లు పడుతున్నందువల్లే దేశంలో రోజురోజుకి రోగాలు పెరుగుతున్నాయి. నేటి మానవుడికి కనీస సుఖశాంతులు కరువవుతున్నాయి. మన జీవన విధానంలో వచ్చిన (ప్రకృతి విరుద్దమైన) మార్పులే నేటి సమాజంలోని ఇబ్బందికర సమస్యలకు మూల కారణం వీటి నుండి మనమందరం త్వరగా బయటపడాలంటే మంచి జీవన విధానాన్ని అవలంభించడం అత్యంత ఆవశ్యకం. రోగాలు, రోగుల సంఖ్య పెరిగిపోతున్న అమెరికా లాంటి దేశంలోని ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించి ఇపుడిపుడే యోగాసనములు, ప్రాణాయామాలు, ధ్యానం చేయడం, పచ్చి కూరలు, మొలకెత్తిన గింజలు తినడం, మంచి నీరు సక్రమంగా త్రాగడం, మాంసాహారం మానడం మొదలగు ఎన్నో రకాలైన ప్రకృతి నియమాలకు దగ్గరౌతున్నారు. మనం పోగొట్టుకున్న మన ఋషి సాంప్రదాయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం. ఇకనైనా మేలుకొని మన సమస్యలకు పరిష్కారం మన వద్దే, మన ఇంట్లోనే ఉందని గ్రహించిన వారు అదృష్టవంతులు.

మన రోగాలు ఎన్ని? ఏ భాగానికి సంబంధించినవి? ఎప్పటి నుండి ఉన్నాయి? అన్నది ఇక్కడ సమస్య కాదు. వీరు మనస్సు మార్చుకుంటే వాటన్నింటికి పరిష్కారం ఈ ప్రకృతి జీవన విధానంలో ఉన్నది.

లీకు ఒక చోట అవుతుంటే, రీపేరు వేరేచోట చేస్తే ఎలా వుంటుందో... అలా సహజ సిద్ధంగా ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి విధానాలను వదిలి ప్రతి సమస్యకు మందుల మీద ఆధారపడటం లాగా ఉంటుంది ప్రకృతి జీవన విధానాన్ని వదిలి రకరకాల వైద్యాలు ఈ శరీరానికి చేయడం. మానవుడు జ్ఞాన జీవి కాబట్టి తగు రీతిలో జ్ఞానాన్ని, బుద్ధిని వినియోగించుకుంటూ ప్రకృతి జీవనం ద్వారా ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనలను రోజు రోజుకీ వృద్ధి చేసుకొంటూ ఉంటే మనలో మానవత్వం పరిమళిస్తు ఉంటుంది. ఇదే మానవునికి పురోగతి.