"ఒక్కపూట మానేస్తే ఏం కాదులే!" అంది కందిపచ్చడి పెద్ద పెద్ద ముద్దలు మింగుతూ వెంకాయమ్మ.
    
    "నేనుండగా ఉపోషం పడుకోపెడతానా? నాలుగు ముద్దలు తిని పడుకో! మంచినీళ్ళకడ్డం!" అంటూ వెండిగిన్నెలో పెరుగు అన్నం కలిపి రాధ నోటికి అందించింది శాంత.
    
    "పెళ్ళి అయితే ఈపాటికి ఇద్దరు పిల్లలు పుట్టుండేవారు. ఇంకా కలిపి నోట్లో ముద్దలు పెట్టడం ఏం విచిత్రం తల్లీ?" అంది ఆశ్చర్యంగా వెంకాయమ్మ.
    
    రాధకి ఆ మాటలకి సిగ్గేసింది. "ఒద్దులే, పిన్నీ! చాలు!" అంది.
    
    శాంత కోపంగా "అమ్మా! పిల్లని అన్నం కూడా తిననీయవా? అన్నింట్లోకీ ఎందుకు తలదూరుస్తావూ?" అంది.
    
    వెంకాయమ్మ "ఈడొచ్చిన పిల్లకి పనీ పాటా నేర్పటం అటుంచి ఇంకా అన్నం కలిపి గోరుముద్దలు తినిపించడం యెవరయినా చూస్తే నవ్వి పోరూ? రేపు పెళ్ళయితే అత్తవారింట్లో యెవరు కూర్చోబెట్టి పెడతారూ? నలుగురున్న ఇంట్లో పడేస్తే నడుం వంచి వండి వార్చొద్దూ!" అంది.
    
    "నలుగురున్న ఇంట్లోకి మా అమ్మాయినిచ్చినా దాసదాసీజనంతో బాటు పంపిస్తాంలే!" అంది శాంత.

    "అట్లాగే నేనూ అనుకుని వుంటే నీకు ఈ పెళ్లి అయ్యేదే కాదు. ఇంతమందికి చేసి పెట్టడానికి దొరికేదానివేకాదు!" అంది.
    
    అన్నం వడ్డిస్తున్న సూరమ్మ ఆమె వాగ్ధాటికి తెల్లబోయి చూసింది.
    
    శాంతకి ఆడబిడ్డ మొహం చూడాలంటే జంకు కలిగింది. "నువ్వు మాట్లాడకుండా తిని పదమ్మా!" అంది.
    
    "నేను మాట్లాడకూడదు. ఏ పనీ ముట్టుకోకూడదు....ఏదీ అడగకూడదు. పెద్దముండదాన్నని చెప్పి ఒక సలహా పారెయ్యకూడదు.... అన్నీ ఆంక్షలే!" మూతి తిప్పింది వెంకాయమ్మ.
    
    రాధ అక్కడ ఉండలేనట్లు తన గదిలోకి వెళ్ళిపోయింది.
    
    శాంత దీర్ఘంగా నిట్టూర్చి అక్కడనుంచి కదలబోతుంటే "ఏమే? మీ బావగారి అమ్మాయికి ఏపాటి బంగారం ఉందీ?" అని అడిగింది వెంకాయమ్మ పెరుగు అన్నం అంటిన వేళ్ళు నాకుతూ.
    
    శాంత వాడిగా "ఇంకాస్త పెరుగు వేయించుకుని కడుపునిండా తిను..... అంతకన్నా యెక్కువ ఆరాలు నీకు అనవసరం!" అని వెళ్ళిపోయింది.
    
    సూరమ్మవైపు తిరిగి వెంకాయమ్మ "పెళ్ళప్పుడు పెట్టిన నాలుగు నగలతోటే ఉండిపోయింది నా వెర్రితల్లి! ఆ తల్లీ కూతుళ్ళు మాత్రం బాగా సొమ్ములు కూడ పెట్టినట్లున్నారు. నీకేమైనా తెలుసా ఏ మాత్రం ఉంటాయో?" అంది.
    
    ఆ మాటలకి జవాబు చెప్పడానికి కూడా అసహ్యం అనిపించినట్లు సూరమ్మ అక్కడినుండి వెళ్ళిపోయింది.
    
                                                           * * *
    
    "అత్తయ్యా... పిన్నీ... మావయ్యా... పెద్దనాన్నా.... అందరూ రండి! శుభవార్త!" అంటూ లోనికి వచ్చాడు మాధవ్. అతని వెనకాలే నవ్వుతూ వచ్చాడు గోవిందరావు.
    
    "ఏవిట్రా హడావుడీ?" అంటున్న సీతారామయ్య కాళ్ళకి వంగి నమస్కరిస్తూ "మన ఫ్యాక్టరీకి లైసెన్స్ వచ్చేసినట్లే పెద్దనాన్నా!" అన్నాడు.
    
    "శభాష్! నాకు తెలుసురా, సాధిస్తావనీ!" అన్నాడు మాధవ్ ని ఎత్తి కౌగలించుకుంటూ సీతారామయ్య.    

    "ముందు నోరు తెరవండి!" అంటూ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళకీ స్వీట్ నోట్లో పెట్టాడు మాధవ్.
    
    "అంతా గోవిందరావు బాబాయ్ వల్లే పిన్నీ! ఆయనకి రెండు స్వీట్లు!" అన్నాడు గోవిందరావు చెయ్యిపట్టి ఆపి, మాధవ్ నోట్లోనే స్వీటు పెట్టేశాడు.
    
    "బాబాయ్ ని ఈ ఫ్యాక్టరీలో పార్టనర్ ని చేసుకుంటున్నాను పిన్నీ!" అన్నాడు మాధవ్.
    
    పురంధరకి అప్పటికే కళ్ళనిండా నీళ్ళు నిండాయి. "చేతులెత్తి దండం పెట్టడానికి లేకుండా చేశావయ్యా!" అంది.
    
    "చూశారా, నేను ఎంత అదృష్టవంతుడ్నో! మీ అందరికీ నేను హాయిగా నమస్కరించవచ్చు!" అంటూ గోవిందరావుకే ఒంగి నమస్కారము పెట్టాడు మాధవ్.
    
    "అమ్మకీ, నాన్నకి ఫోన్ చేశావా?" అడిగింది విశాలాక్షి.
    
    "చేసే వస్తున్నాను. శంకుస్థాపన రోజుకి వస్తామన్నారు!" అన్నాడు.
    
    ఆ రోజు రాత్రి గోవిందరావుతో చెప్పాడు మాధవ్ "బాబాయ్! ఈ రోజు నాకు నువ్వో గిఫ్ట్ ఇవ్వాలి!"
    
    "ఏమిటో అడుగు, ఇచ్చిపారేస్తాను!" అన్నాడు గోవిందరావు.
    
    "ఇవ్వాల్టి నుండి ఫ్యాక్టరీ ప్రారంభం అయ్యేవరకూ రోజూ నువ్వు రెండు పెగ్గులకి మించి తాగకూడదు! అదే నాకు నువ్విచ్చే గిఫ్ట్! అన్నాడు.
    
    గోవిందరావు ఆలోచించి, "ఓకే మై సన్!" అన్నాడు.
    
    "థాంక్యూ, బాబాయ్!" సంతోషంగా అని బాటిల్ ఓపెన్ చేశాడు మాధవ్.
    
    మూసి ఉన్న తలుపులను చూస్తూ కింద పురంధరతో అంది విశాలాక్షి "మాధవ్ రోజూ దగ్గరుండి గోవిందుకు తాగిస్తాడేమిటి?"
    
    పురంధర నవ్వి, "ఆయన్నీ మాధవ్ చేతిలో పెట్టి నిశ్చింతగా ఉన్నాను. ఏంచెయ్యాలో ఎలా చెయ్యాలో అతనికే బాగా తెలుసు. ఈ రోజు ఆయన మొహంలో వెలుగు చూస్తూంటే నాకు మరుజన్మ ఎత్తినట్లుంది!" అంది.
    
    "వాడు మా అందరికీ పోయిన జన్మలో తండ్రి అయి ఉంటాడు!" అన్నాడు సీతారామయ్య.
    
    "నిజమే, అన్నయ్యా!" అంది ఆనందంగా విశాలాక్షి.
    
                                                              * * *
    
    మోటార్ సైకిల్ ఆపి రాములమ్మ టీ బడ్డీవైపు నడిచి అక్కడున్న న్యూస్ పేపర్ అందుకున్నాడు మాధవ్. బల్లమీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి "నమస్కారం, బాబూ!" అన్నారు.
    
    "నమస్తే!" అన్నాడు చిరునవ్వుతో మాధవ్.
    
    గిరి కూర్చున్న చోటునుంచే మాధవ్ డ్రెస్ నీ, అతన్ని అందరూ గౌరవించే పద్ధతినీ చూశాడు.
    
    "ఎర్రకొండల దగ్గర ఫ్యాక్టరీ పెడుతున్నారట కద బాబూ! మా సిన్నోడికి ఏదైనా పని దొరుకుతుందా బాబూ?" అడిగాడొకతను.
    
    "వయసెంతా?" అడిగాడు మాధవ్.
    
    "పన్నెండొచ్చి నెలయింది బాబూ!"
    
    మాధవ్ తల అడ్డంగా ఊపి, "ఊహుఁ, ఫ్యాక్టరీకికాదు బడికి పంపాలి!" అన్నాడు.
    
    "ఈ ఊళ్ళో బడేమిటి బాబూ! వీధి బడిలో ఎప్పుడూ అయ్యవారుండరు!" అన్నాడతడు.