"నన్ను మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు?"

 

    అమాయకమయిన హృదయంలోంచి వచ్చిన అమాయకమయిన ప్రశ్న!

 

    "ఇంటికా? పంపిస్తాను... నేను చెప్పినట్టుగా వింటే! వింటావా?"

 

    బొమ్మలా తలూపింది లక్ష్మి.

 

    అప్పటికే ఒక నిర్ణయానికొచ్చేశాడు అచ్యుతముని.

 

    "అయితే ఈ క్షణం నుంచీ నీ పేరు లక్ష్మి కాదు! నిశాంత..."

 

    "నిశాంతా?" ఆశ్చర్యపోయింది లక్ష్మి.

 

    "చీకటిలోంచి వెల్లువలా పొడుచుకొచ్చిన వెలుగు నిశాంతా! కొన్ని సంవత్సరాల నుంచి నేనొక శక్తివంతమైన ఆయుధం కోసం గాలిస్తున్నాను. ఇన్నాళ్ళకు నా అన్వేషణ ఫలించింది. నాకు దొరికిన ఆయుధానివి నువ్వే! నువ్వే..." ఉయ్యాల్లో కూర్చుని విలాసంగా లక్ష్మివైపు చూశాడు అచ్యుతముని.

 

    అతి శక్తివంతుడైన అతను, ఒక అనామకురాలైన పల్లెటూరి అమ్మాయిని చూసి ఉత్తేజితుడవడం, ఆ అమ్మాయితో మాట్లాడటం...

 

    అంతా ఒక వితంగా వుంది కుశాలికి!

 

    కుశాలి మనోభావం అర్ధమైనట్టు ఆమెవైపు చూశాడు అచ్యుతముని.

 

    "జనమేజయరావుని ఒకసారి రమ్మను."

 

    మరో రెండు నిమిషాల తర్వాత జనమేజయరావు లోనికొచ్చాడు.

 

    "ఈ క్షణం నుంచి లక్ష్మి... లక్ష్మి కాదు...! నిశాంత... నీకు నెలరోజులు టైమిస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకనవసరం! పేరు మార్చుకున్న లక్ష్మి రూపురేఖలు మారిపోవాలి! రాయిలాంటి లక్ష్మి శిల్పం కావాలి... నువ్వు చెయ్యగలవా?" సూటిగా ప్రశ్నించాడు అచ్యుతముని.

 

    చేయగలనన్నట్లుగా తలూపాడు జనమేజయం.

 

    "కానీ... ఎందుకీ శ్రమ?" సందేహిస్తూనే అడిగాడు జనమేజయం.

 

    అచ్యుతముని ఒక్కక్షణం నవ్వాడు. ఆపైన ఒకింతసేపు మౌనంగా వున్నాడు. అతని మనసు పొరల్లో ప్రజ్వరిల్లుతున్న పగ, ప్రతీకారాలు అతని కళ్ళలో ఎరుపు జీరగా చోటుచేసుకున్నాయి.

 

    "ఎన్నో ఏళ్ళుగా నా మనసు పొరల్లో రగులుతున్న ప్రతీకార జ్వాలకు అంకురార్పణ చేస్తున్నాను. నా నరనరాల్లో నిండి వున్న అవమానాగ్నిని ప్రజ్వరింపచేస్తున్నాను. అందుకు నాకో ఆయుధం కావాలి. ఆ ఆయుధమే నిశాంతగా మారనున్న లక్ష్మి..."

 

    నేటి లక్ష్మి రేపటి నిశాంత. రేపటి నిశాంత దేశ్ ముఖ్ కి అవసరం. దేశ్ ముఖ్ కి నిశాంత ద్వారా మహంత కొడుకుని సర్వనాశనం చేస్తాడు.

 

    "నాకిద్దరు శత్రువులు. ఇద్దర్నీ ఎదుర్కోవటానికి నాకున్న బలం చాలదు. అప్పుడేం చేయాలి? ఆ శత్రువుల్ని ఒకరిమీద కొకర్ని వుసిగొలపాలి. ఆ పోరాటంలొ ఒకరు హతమయితే ఒకరే మిగలుతారు. ఆ ఒకర్ని దెబ్బతీయగల శక్తి నాకుంది. లక్ష్మి చాలా తెలివిగలదని మొదటి చూపులోనే గ్రహించాను. సానబడితే అణ్వాయుధంగా మారిపోగలదు. ఆమెకున్న ఏకైక సమస్య పేదరికం. దాన్ని దేశ్ ముఖ్ పోరాడతాడు... అర్ధమయిపోలేదా?" నవ్వుతూ, పళ్ళు కొరుకుతూ అన్నాడు అచ్యుతముని.

 

    అది వింటూనే జనమే జయ షాక్ తిన్నాడు. తమకు వ్యతిరేకంగా ఎవరన్నా కుట్ర పన్నుతున్నారని అటు మహంతకుగాని, ఇటు దేశ్ ముఖ్ కి గాని తెలిస్తే వార్ని క్షణాల్లో భస్మం చేయగల సత్తా వున్నవాళ్ళు వాళ్ళిద్దరూ.

 

    వాళ్ళిద్దరితో తలపడుతున్న అచ్యుతమునిని చూసి తొలిసారి భయపడ్డాడు జనమేజయ.

 

    ఒకప్పుడు మహంత, అచ్యుతముని, దేశ్ ముఖ్ ఒక వ్యాపారంలొ భాగస్వాములనేవరకే జనమే జయకు తెలుసు. ఆపైన వారి మధ్య ఏ అగ్ని రాజుకుందో తెలీదు.

 

    "మరి వారితో మీరు సఖ్యంగానే వుంటున్నారు గదా?" అడిగాడు జనమేజయ.

 

    "ఫలానా వాడు తనకు శత్రువని తెలిస్తే, ఎవరైనా ఆ శత్రువు కొట్టబోయే దెబ్బని కాసుకొనేందుకు అప్రమత్తంగా వుంటారు. అదే మిత్రుడని నమ్మితే?" అంటూ పెద్దగా నవ్వాడు అచ్యుతముని.


                                                *    *    *    *


    నిశాంతగా మార్చబడిన లక్ష్మికి రాత్రింబవళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం ఆరంభమైంది.

 

    నిశాంత వేషభాషలు, రూపురేఖలు, ప్రవర్తన అన్నీ అచ్యుతముని సూచనలమేరకు చకచకా జరిగిపోతున్నాయి.

 

    రోజులు గడుస్తున్న కొద్దీ నిశాంత పదును దేరిపోతోంది.

 

    నిశాంతకు అదంతా థ్రిల్లింగ్ గా వుంది.

 

    బొంబాయి తీసుకొచ్చి తనకిప్పిస్తానన్న జాబ్ అదేనేమోనని తొలుత భావించింది నిశాంత.

 

    ఏది ఏమైనా గంగిరెడ్డిపల్లి పేదరికం కన్నా ప్రస్తుత తన జీవితం బాగానే సుఖంగానే వుందని భావిస్తున్న నిశాంత వారాసించిన టైమ్ లోనే అన్నీ నేర్చేసుకుంటోంది.

 

    బొంబాయి ఎలా వచ్చిందో తనకే తెలీదు.

 

    వచ్చాక తమ చుట్టుపక్కల ఊర్లలో అప్పుడప్పుడు అదృశ్యమైపోయే ఆడపిల్లలు ఏమైపోతారో, ఎక్కడ తేలతారో అర్ధం చేసుకుంది. తనని అలాంటి నరకకూపంలోకే నెడతారని తొలుత భయపడింది.

 

    అలా తను నెట్టబడబోవటం లేదని ఆ తరువాత తెలుసుకుంది. అందుకు కారణం అచ్యుతముని అని కూడా తెలుసుకుంది.

 

    మరొకటి కూడా తెలుసుకుంది.

 

    తనక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయటం తన ప్రాణం మీదకు తెస్తుందని.

 

    ఒకటే మొండి ధైర్యానికొచ్చింది. ప్రపంచంలో ఏ సమస్య అయినా పేదరికం, ఆకలి కన్నా పెద్దవి కావనే ధైర్యం అది.

 

    అందుకే వాళ్ళు చెప్పినట్లు వినడానికే నిర్ణయించుకుంది.


                              *    *    *    *


    మరికొద్దిరోజులకే నిశాంతలో గొప్ప మార్పు ప్రోది చేసుకుంది.

 

    ఆమె ఆలోచనలు రోజురోజుకీ పరిణత చెందసాగాయి.

 

    తన ద్వారా వీళ్ళేదో ప్రయోజనం ఆశిస్తున్నారు.

 

    వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు చేకూర్చి తన ప్రయోజనం అంటే తన ఊరి ప్రయోజనం తను సాధించగలిగితే...

 

    అందుకు తను బలయిపోయినా ఫర్వాలేదనుకుంది. తన ఊరు బాగుపడితే చాలనుకుంది.

 

    తన శీలానికి ప్రమాదం లేదని తెలుసుకున్న ఆమె మరింత ఆనందించింది. జరగబోయే డ్రామాని తన ఆక్రోశానికి అడ్డంగా పెట్టుకోవాలనుకుంది.