విస్మయంగా చూశాడు ఆదిత్య.
    
    "ఒకవేళ ప్రబంధంటే నీ కిష్టం లేనినాడు ఇంత మధన పడేవాడివి కాదుగా? అలా చూడకు. నీ మనసులో ఏ అట్టడుగు పొరల్లోనో ప్రబంధన్నా ఇష్టముంది. కాకపోతే ప్రణయకి మాటిచ్చావు కాబట్టి నా స్టేట్ మెంటుని అంగీకరించలేకపోతున్నావ్."
    
    "అదికాదు సూరీ! రేపు రోహిత్ తో పోటీ జరిగాక..."
    
    అర్దోక్తిగా ఖండించాడు సూరి-"ఉదాహరణకి ఓడిపోయావే అనుకో! ప్రణయకి దూరమవుతావా?"
    
    జవాబు లేదు.
    
    "అయితే ప్రేమలో ఈ నిబంధనలేమిటి ఆదిత్యా! కాకపోతే ఒక్క విషయం అంగీకరిస్తాను. రోహిత్ పందేనికి నిలబడటం ప్రణయ ధ్యేయం కావచ్చు. మాటతప్పడం చేతగాని మనిషిగా మరో వ్యక్తి ద్వారా అతడిని ఓడించాలనుకోవడం ఆమె అభిప్రాయం కావచ్చు. నీ మీద తనకున్న ఇష్టాన్ని అలా వ్యక్తం చేసి, నీ చేత కమిట్ చేయించుకునే పరిస్థితికి ఆమె డ్రైవ్ చేసి వుండొచ్చు"
    
    "నో!" అలా అనుకోవడం ఆదిత్య కిష్టంలేదు. "ప్రణయలాంటి డబ్బూ, తెలివి, అందం వున్న అమ్మాయి ఒక వ్యక్తి మనసు తెలుసుకోడానికి ఆ రూట్ లో రావాల్సిన ఆగత్యం లేదు"
    
    "అలాంటి అందమూ, తెలివీ, అంతకుమించి ముఖ్యమంత్రి కూతురయిన ప్రబంధ కూడా ఇంత లాంగ్ రూట్ లో తన మనసు వ్యక్తం చేసే అవసరం లేదు. ఐ మీన్.... ప్రబంధ కావాలీ అనుకుంటే అబ్బాయిలకి కొదవలేదుగా?"
    
    "నా మీదే ఆసక్తి వుంటే?"
    
    "ఎస్ దట్స్ ది ఆన్సర్ ప్రబంధకి నీమీదనే ఇష్టం వుంది. అది మొన్నెప్పుడో ముద్దు పెడతానన్నా పారిపోయిన నీ సంస్కారంపైన పెంచుకున్న అభిమానం కావచ్చు. లేదంటే నీ తెలివిమీద ఏర్పడిన గౌరవము కావచ్చు. నీ అందం కావచ్చు. మరేదన్నా కానియ్. అందరు మగాళ్ళలో లేనిదేదో నీలో కనిపించినట్టేగా?"
    
    తల పంకించాడు ఆదిత్య.
    
    "సరిగ్గా ప్రణయకి అలాంటిదేదో నీలో కనిపించింది కాబట్టే అంత అర్హత వున్నా అందర్నీ కాదని నీకే దగ్గరయింది. సో, దీన్నిబట్టి తెలిసేదేమిటంటే నువ్వో అరుదైన వ్యక్తివి"
    
    ఈ తర్కమేమిటో అర్ధంకాలేదు ఆదిత్యకి.
    
    "ఇంత అరుదయిన వ్యక్తిగా ఇద్దరమ్మాయిలు ఆరాధిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నీకు ముఖ్యులో నువ్వు ఆలోచించుకోవాలి."
    
    "అబ్జర్డ్" అసహనంగా అన్నాడు ఆదిత్య. "నేను ఇష్టపడింది ప్రణయని"
    
    "ఎందుకని?"
    
    "తెలీదు"
    
    "ప్రబంధని ఎందుకిష్టపడటం లేదు?"
    
    జవాబు చెప్పలేకపోయాడు.
    
    "ఎందుకిష్టపడలేకపోతున్నావో కూడా తెలీనట్టేగా?" క్షణం ఆగాడు సూరి "ఆదిత్యా! ఇంతలా నీతో తర్కానికి దిగటానికి కారణం ఒక్కటే, ప్రేమ అన్నది బిజినెస్ కమిట్ మెంట్ కాదు, చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రణయమీద నీకున్నది ప్రబంధ మీదికన్నా ఎక్కువ ఇష్టమే అయితే ఆమెకే కట్టుబడి వుండు. అలా అని ప్రబంధని వెంటనే నిర్లక్ష్యం చేయొద్దంటున్నాను."
    
    అర్ధం కాలేదు ఆదిత్యకి.
    
    "ఆదిత్యా! ప్రబంధతో నాకు వైరం వున్నా ఆమె గురించి నాకనిపిస్తున్న దొక్కటే. ఏ ఓటమినీ త్వరగా అంగీకరించలేని ఆడపిల్ల అది అహంకరమో, లేక మొండితనమో, అదీ కాకపోతే పసితనమో ఆమెకే తెలీదు. కానీ తను అనుకున్నదే జరగాలనుకునే మనస్తత్వం కాబట్టి వెంటనే కాదు, సుతిమెత్తగా, స్నేహపూర్వకంగా నీ మనసు తెలిసేట్టు చేయాలితప్ప దూకుడుగా వీల్లేదని చెప్పకు."
    
    ఆ విషయం సూరి ఎందుకుచెప్పాడో ఆదిత్య అప్పటికి అర్ధం చేసుకోలేక పోయాడు.
    
    రెండు రోజులపాటు కాలేజీకి వెళ్ళడం మానేశాడు ఆదిత్య.
    
    అదోలాంటి కంగారు అసలు కాలేజీ మానేసింది ఏ విషయం గురించో లోతుగా ఆలోచించి తెముల్చుకోవాలని కాదు. ప్రబంధనే కాదు, ప్రణయనీ కలవటానికి జంకుగా వుంది.
    
    అసలు తన స్థాయి ఏమిటని? ఎప్పుడో రాలిపోయిన తల్లిదండ్రులు, ఏ క్షణంలో ఏమౌతుందో తెలీని బామ్మ పెళ్ళికెదిగిన చెల్లెలు, ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి పెన్షన్ తో నెడుతున్న జీవితం.
    
    తన ఊహకందని అంతస్తులో వున్న అమ్మాయిలతో తనకు స్నేహ మేమిటి? అసలు అప్పుడే పెళ్ళిగురించి కాని, ప్రేమగురించి కాని ఆలోచించే పరిస్థితీ కాదే!
    
    రెండు రోజులు కాలేజీ మానేసి ఏం తప్పుచేశాడో తెలిసిపోవడంతో, మూడోరోజు ఉదయమే కాలేజీకి ప్రిపేరవుతున్నాడు.
    
    అదిగో ఆ సమయంలో ఇంట్లో అడుగుపెట్టింది ప్రబంధ.
    
    ముచ్చెమటలు పోశాయి ఆదిత్యకి ఆమె సరాసరి ఇంటికి రావడంతో.
    
    "మీరు..."
    
    "అడ్రసు ఎలా తెలుసుకోగలిగానా అనుకోకండి. మీరు కాలేజీకి రావడం లేదని తెలిసి ఉదయం హాస్పిటల్ కు వెళ్ళి అడ్రస్ తీసుకున్నాను."
    
    మొన్నెప్పుడో చిత్రమయిన పజిల్ తో ఆందోళనపెట్టిన అమ్మాయిలా కాదు సంవత్సరాల తరబడి పరిచయంవున్న అమ్మాయిలా మాట్లాడుతూంది.
    
    రెప్పలార్పకుండా చూశాడు. చూపు మాత్రంచేత ఎందర్నో శాసించగల ప్రబంధ తనకోసం ఎందుకింత వెంపర్లాడుతూంది?
    
    "ఇలా వచ్చారేం?" అడిగాడు మరెటో చూస్తూ.
    
    బిడియంగా తల వంచుకున్న ప్రబంధ ఓ స్తంభంవారగా నిలబడి నేలచూపులు చూడడం చిత్రంగా అనిపించింది. "ఆ పజిల్ కు జవాబు తెలుసుకోవాలని కాదు...."
    
    నవ్వేశాడు మృదువుగా "కానీ నాకు తెలిసిపోయింది"
    
    ఈసారి ప్రబంధ పూర్తిగా స్తంభం చాటుకి వెళ్ళిపోయింది.