"దాసరి నారాయణరావు మడత డైలాగులు వాడకు..." అన్నాడు ఆంజనేయులు ఒకింత అసహనంగా.

 

    ఆపైన ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలీక ఇద్దరూ ముసుగు పెట్టేసి నిద్రలోకి జారుకున్నారు.


                                                    *    *    *    *


    ప్రొద్దుటే లేస్తూనే ఆంజనేయులు, ఆనందానికి తగిలిన దెబ్బల్ని గుర్తుకు తెచ్చుకొని వందోసారి భయపడ్డాడు.

 

    "అరేయ్... జరిగిందంతా చెప్పి తరణిని బయటకు పంపించేస్తే ఎలా వుంటుందంటావ్...?" అన్నాడు ఆంజనేయులు.

 

    "పాపం రా... పాపం ఆ పిల్ల ఎవరైనా కష్టాల్లో ఉంది. ఆదుకుంటే పుణ్యం రా..." అన్నాడు ఆనందం సానుభూతిగా.

 

    "నిన్న పడిన కోటా సరిపోలేదా...?" కసురుకుంటూ అన్నాడు ఆంజనేయులు.    

 

    "మరీ అంత మానవత్వం లేకుండా మాట్లాడకురా... చావో... బ్రతుకో కలిసే తేల్చుకుందాం" అన్నాడు ఆనందం.

 

    నిజానికి ఆంజనేయులికి కూడా తరణిని బయటకు పంపించాలని లేదు. అలా అని ఉన్న సమస్యలకు తోడు మరో సమస్యను నెత్తి మీదకు తెచ్చుకోవటం ఎలా అన్న బెంగ కూడా ఉంది. అంతలో ఎంతో ప్రేమతో టిఫెన్ బాక్స్ తెచ్చిచ్చిన తరణిని చూసి ఆ విషయాన్ని వెంటనే మర్చిపోయాడు.

 

    ఆఫీసు కెళ్ళాడానికి సిద్ధంగా ఉన్న ఆంజనేయుల్ని కేకేసి పిల్చాడు భుజంగరావు.

 

    "ఏం... అంకుల్... ఏంటి కత... రాత్రి బాగా నిద్రపట్టిందా..." కుశల ప్రశ్నల వేస్తూ బయటికొచ్చాడు ఆంజనేయులు.

 

    "లేదు... నిద్ర పట్టలేదు... కలలొచ్చాయి... కలల్లో దొంగలూ, కేడీలు ఇంట్లో తిరుగుతున్నట్టు కలొచ్చింది. అంతే... అది చెప్పి సలహా అడుగుదామని..." కోపంగా అన్నాడు భుజంగరావు.

 

    అంత పొద్దున్నే భుజంగరావుకి కోపం ఎందుకొచ్చిందో అర్ధం కాలేదు ఆంజనేయులుకి.

 

    "మీ మూడ్ బాగులేనట్టుంది... సాయంత్రం మాట్లాడుకుంటే, బాగుంటుందేమో..." తప్పించుకోడానికి ప్రయత్నించాడు.

 

    "నా మూడ్ బాగానే వుంది. నేనడిగిన దానికి జవాబు చెప్పు... నువ్వు తరణి ఫోటోని ఎక్కడ నుంచి తెచ్చావో... చెప్పు... ఫోటో స్టూడియో నుంచి కదూ..."

 

    "అవునంకుల్...."

 

    "అంతకు ముందు ఆ అమ్మాయితో నీకు పరిచయం ఉందా...?"

 

    "లేదంకుల్..."

 

    "మరి... అదే అమ్మాయి... అచ్చు ఫోటోలో లాంటి అమ్మాయే, అవుట్ హౌస్ లోకి ఎలా వచ్చింది..."

 

    "అదే సస్పెన్స్ అంకుల్... నాక్కూడా గమ్మత్తుగా, చిత్ర విచిత్రంగా విఠలాచార్య జానపద సినిమాలా ఉందంకుల్..."

 

    "దబాయించకు... నిన్న కాశీబాబుగాడొచ్చాడు...?"

 

    "వాడెవడంకుల్..." తెలిసినా, తెలియనట్లుగా నటించాడు.

 

    "చంపేస్తాను... అబద్ధాలాడితే చంపేస్తాను... ఆడు... నీ గాంగ్ లీడర్. ఆడూ, నువ్వూ, ఆ ఆనందం దొంగలముఠా. నాకు తెలుసు.

 

    మరొకసారి ఆ కాశీబాబుగాడు నా కంట పడాలి. నేను పోలీసు రిపోర్టివ్వాలి... కాచుకో..." కోపంగా ఉరుముతూ చూస్తూ అంటున్న సమయంలోనే-

 

    పూల సజ్జతో అక్కడకొచ్చింది భువనేశ్వరి.

 

    "ఏమిటీ... దొంగలముఠా... పోలీసు రిపోర్టు అంటున్నారు..." అని హుందాగా అందావిడ.

 

    "ఏం లేదు... ఏం లేదు భువన... మనం పందొమ్మిది వందల నలభై రెండులో దొంగలముఠా సినిమా కెళ్ళలేదూ. చిరంజీవి ఆంజనేయుల్తో ఆ కథ చెప్తున్నా... అంతే... మిగతా కథ సాయంత్రం..." బయటకు వినబడకుండా పళ్ళు పటపట లాడిస్తూ లోనకి నడిచాడు భుజంగరావు.

 

    "తరణి... ఇంట్లోనే ఉంది... రాత్రంతా మీ గురించే..." భువనేశ్వరి ఉబ్బిపోవాలని ఆ మాట అన్నాడు ఆంజనేయులు.

 

    "నా గురించా... నా గురించేం ఉంటాయి బాబూ..." చిరునవ్వును పెదవుల వెనకే దాచుకుంటూ అందావిడ.  

 

    "అమ్మలా చూచే మీ మంచితనం, సొంత తల్లిలా చూసుకునే మీ ప్రేమ... మాతృత్వపు తీపిని పంచే మీ అనురాగం..." ఏదేదో అడ్డంగా కోసేశాడు ఆంజనేయులు.

 

    "ఏదో... అమ్మాయికి నేనంటే చాలా ప్రేమ... నాకు తెలుసు..." అందావిడ ఆనందంగా.

 

    అదే అదనుగా చిన్నగా జారుకున్నాడు ఆంజనేయులు.


                                                   *    *    *    *


    తోటలో అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల కాంతి వాళ్ళిద్దరి మీదా పడుతోంది.

 

    "చూడు తరణీ! ప్రస్తుతం ఇక్కడెవరూ లేరు. అసలు నువ్వెవరో చెప్పు. ఏ పరిస్థితిలో నువిక్కడికి వచ్చావో చెప్పు. నువ్వు గనక ఏదైనా అపాయంలో వుంటే, దాని నుంచి బయటపడే మార్గం వుంటే చెప్తాను... నన్ను ఫ్రెండ్లీగా అర్ధం చేసుకో..." నెమ్మదిగా అన్నాడు ఆంజనేయులు.

 

    చెప్దామనే అనుకుంది కానీ మెట్లకు కొంచెం దూరంలో, ఆంజనేయులు వెనక ఆ ఆకారం కనబడగానే గొంతులో తడారిపోయింది తరణికి.

 

    ఆ ఆకారం భువనేశ్వరీదేవిది....

 

    ఏదో ఇద్దామని అక్కడకొచ్చిన భువనేశ్వరి వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటుండడంతో, ఏం మాట్లాడుకుంటారో విందామని కుతూహలంగా నిలబడింది ఆవిడ.

 

    "మనం ఇన్నాళ్ళుగా కల్సి ఉంటున్నాం... నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా చెప్పు...త...ర...ణీ..."

 

    తరణికి కొంచెం దూరంగా నిలబడి ఆకారాన్ని చూస్తూ మాటలు తడబడ్డాయి ఆంజనేయులికి.

 

    అక్కడ నిల్చునున్నది భుజంగరావు.

 

    తన వెనక భువనేశ్వరి ఉందని తెలీని ఆంజనేయులు, తరణి వెనక నున్న భుజంగరావుని దృష్టిలో వుంచుకొని మాట్లాడుతున్నాడు. తన వెనక భుజంగరావు వున్నాడని తెలీని తరణి ఆంజనేయులు వెనకున్న భువనేశ్వరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోంది.

 

    "చెప్పు తరణీ! నువ్వెవరు? ఏ పరిస్థితిల్లో నువ్విక్కడికి వచ్చావ్? చెప్పు..." రెట్టించి అడిగాడు ఆంజనేయులు.