మంత్రి కత్తులు నూరుతున్నట్టుగా అనిపించింది. ఆ మాజీ సి.ఇ.కేం గుర్తొచ్చిందో అతడూ నాకేసి కొరకొరా చూస్తున్నాడు. బోడి మాజీగాళ్లు  - యింక నన్నేం చేస్తారు!  

 

    అంతలో బాత్ రూంలో డ్రస్ చేంజి చేసుకొని సబ్ కలక్టర్ కంపార్ట్ మెంటులోకి వచ్చాడు. చిలిపిమనసు, అవకాశం దొరికితే కవ్వించాలనిపిస్తుంది.


    బండాగింది. కిటికీదగ్గరవున్న నన్ను చూసి మావాళ్లు పరుగెత్తుకొని కంపార్టుమెంటు దగ్గరకు వస్తూవున్నారు.

 

    "క్షమించాలి. మిమ్మల్ని సస్పెన్స్ లో వదిలి వెళ్ళాలని లేదు - చెప్పేస్తున్నాను వినండి -"

 

    "మొత్తానికి రచయిత్రి అనిపించారు. భలే కథ చెప్పారు. గొప్ప సస్పెన్స్!" పగలబడి నవ్వసాగాడు మాజీ మంత్రి.

 

    బ్లడీ హిపోక్రేట్, క్షణాలమీద మనిషి మారిపోయాడు.

 

    "ఏవండి సి. ఇ. గారూ! మన సీతాదేవి పుస్తకాలేమయినా చదివారా?"

 

    మన సీతాదేవట! పయోముఖ విషకుంభం అంటే ఏమిటో నాకు మొదటిసారిగా అర్థమయింది.

 

    "చదువులేదు. కాని విన్నాను. రెండు మూడేళ్ళక్రితం ఆమెగారు రాసిన నవల ఒకటి గవర్నమెంట్ నిషేధించిందని తెలుసు. అప్పుడు పత్రికల్లో ఎసెంబ్లీలో -" సి. ఇ. గారి మాట పూర్తి కాకుండా అందుకొన్నాడు మాజీమంత్రి.

 

    "అసెంబ్లీలో వచ్చేముందు కేబినెట్ లో డిస్కషన్ కొచ్చింది. నిషేధాన్ని రద్దు చేయాలని నేను గట్టిగా వాదించాను."    

 

    స్కౌండ్రల్! పచ్చి అబద్ధాలు. కసికసిగా వుంది. ఎలాగో నిలదొక్కుకున్నాను. కంపార్టుమెంటులోకి కల్పన యిద్దరి అసిస్టెంట్సుతో సహా వచ్చింది.

 

    "థాంక్యూ సార్!" వాకిట్లో నిలబడి చెప్పాను.

 

    "నేనే థ్యాంక్సు చెప్పాలమ్మా మీకు. మంచి కాలక్షేపం, బలే కథ చెప్పారు." ఎంతో ఆప్యాయత ఆ గొంతులో.

 

    "అయ్యయ్యో! అది కథ కాదండి, వాస్తవంగా జరిగింది. అయితే, ఆమెపేరు కమల కాదు."

 

    "మరెవరూ?" ఇద్దరూ ఒక్కసారే నోళ్ళు తెరిచారు.

 

    "విజయదుర్గ!"

 

    మళ్ళీ వెనక్కు చూడలేదు. మరుక్షణంలో ప్లాట్ ఫారం మీదకు దూకేశాను.

 

    "ఏమిటి మేడమ్, అంత ఖంగారు పడుతున్నారు బండి ఆలస్యమయిందనా? టైముంది మనకు. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఏడుగంటలకు బయలుదేరితేచాలు - మన ప్రోగ్రాంటైంకు అమలాపురం చేరుకోవచ్చు." వెనకే నడుస్తూ చెప్పుకుపోతున్నది కో ఆర్డినేటర్ కల్పన. ఏదో సాధించాననే తృప్తి మనసుని చుట్టేసింది.  

 

    జీప్ లో కల్పన పక్కన కూర్చున్నాను, "ముందు గెస్ట్ హౌస్ కు పోనియ్!" డ్రయివర్ కు ఆదేశాలిచ్చింది కల్పన. చాలా చురుకయిన పిల్ల.

 

                                                                                               2

 

    "మేడమ్! వచ్చేది ముమ్మడివరం." కల్పన అన్నది.

 

    "ముమ్మడివరం బాలయోగి!" సాలోచనగా అన్నాను.

 

    "అవును మేడమ్, చూస్తారా?" అని డ్రయివర్ని మెల్లగా పోనియ్ మని సంజ్ఞ చేసింది కల్పన.

 

    "అక్కడేముంది కల్పనా, చూడటానికి?"

 

    "అదేమిటి మేడమ్, అలా అంటారు. లక్షలాది జనం వచ్చి చూసిపోతారు. సెక్రటరీలు, మంత్రులు వచ్చి బాలయోగిగారి దర్శనం చేసికొనిపోతూ ఉండేవాళ్ళు మేడమ్!"

 

    "ఆయన చచ్చిపోయాడుగా?"

 

    "అయితే ఏం మేడమ్? ఇంక జనం తండోపతండాలుగా వచ్చి ఆయన సమాధిని దర్శనం చేసుకుపోతూ ఉన్నారు. బాలయోగిగారి మహత్యం అలాంటిది."  

 

    "ఏం మహత్యం తల్లీ, మనిషి చచ్చి కుళ్ళి వాసన కొడుతూంటే మూడురోజుల తర్వాత శవాన్ని బయటికి తీశారని పేపర్లో చదివానే!"   

 

    కల్పన గతుక్కుమన్నది.

 

    "అది నిజమే మేడం! అయినా జనానికి భక్తి తగ్గలేదు."

 

    "ఇది భారతదేశం. ఇంకో వందేళ్ళయినా పట్టొచ్చు - మతపిచ్చిను, మూఢాచారాలను, నమ్మకాలను వదిలించుకొని శాస్త్రీయ దృక్పథం అలవరచుకోడానికి. మరి మనది నాలుగు వేల సంవత్సరాల నాగరికత గదా!"

 

    "నేరుగా వెళ్ళిపోదామా?"

 

    "నీకు చూడాలనివుంటే ఆగుదాం" అంటూ కల్పన మొహం చూశాను.

 

    "నో. నో.... మేడం! మీరు చూస్తారేమోనని. అంతే!" డ్రయివర్ కేసి తిరిగి నేరుగా పోనీయమని చెప్పింది.

 

    అరవైకిలోమీటర్ల వేగంతో పోతూ ప్రతి రెండు మూడు నిమిషాలకు స్పీడ్ తగ్గించి ఎదురొచ్చే వాహనాల్ని  తప్పుకొంటూ పోతున్నాడు జీప్ డ్రయివర్. చల్లటిగాలి ముఖాన్ని తాకుతూంటే హాయిగా వుంది. కళ్లు మూతలు పడుతున్నాయి.

 

    "మేడం! రాత్రి నిద్రపట్టలేదా?" అని అడిగింది కల్పన.

 

    "ఏం? కునికిపాట్లు పడుతున్నానా?"

 

    "అని కాదు మేడమ్! జీప్ కదా అని. అందులో బయటవైపు కూర్చున్నారని."

 

    కల్పన తెలివైనది. నవ్వొచ్చింది. ఎంత సున్నితంగా చెపుతుంది.

 

    "కోనసీమ వచ్చేశాం మేడమ్! ఇంకో గంటలో అమలాపురం వెళ్ళిపోతాం."

 

    "కోనసీమంటే ఎగ్జాక్ట్ గా ఏ ఏరియా?" ముంచుకొస్తున్న నిద్రమత్తును వదిలించుకొందామన్న ప్రయత్నంలో కల్పనను మాటల్లోకి దించాను. అడిగితే చాలు - కల్పనకు ఎక్కడలేని ఉషారు వస్తుంది. చెప్పింది చెప్పకుండా విసుగెత్తించకుండా గంటలతరబడి కబుర్లు చెపుతుంది. అదీ ఒక కళే అనుకోవాలి. అది అందరికీ చేతనయింది కాదు. నా మట్టుకు నాకు ఐదు నిమిషాలు మాట్లాడాక మళ్ళీ ఇంకేం మాట్లాడాలా అని ఆలోచిస్తాను.  

 

    "మేడమ్! ఇంతకుముందు బ్రిడ్జి దాటాం కదా, అక్కడ్నుంచి కోనసీమ మొదలవుతుంది. రాజోలు, కొత్తపేట, అమలాపురం - యీ మూడు తాలూకాల భూభాగాన్ని కోనసీమ అంటారు. గోదావరి పాయలుగా చీలి గౌతమీ, వసిష్ఠ, వైనతేయా పేర్లతో చివరకు సముద్రంలో కలుస్తుంది. ఈ గోదావరి పాయలమధ్య వున్న భూభాగాన్నే కోనసీమంటారు మేడమ్! ఇంత సారవంతమయిన భూమి ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా లేదు. బహుశః భారతదేశంలోకూడా లేదంటే అతిశయోక్తి కాదేమో! ఈ కోనసీమవాసులకో ప్రత్యేకత వుంది."

 

    "ఏమిటది?" ఉత్సాహంగా ఉత్కంఠతో అడిగాను.

 

    కల్పన ఆసాధ్యురాలు, నిద్రమత్తు వదలగొట్టింది.

 

    "ఈ కోనసీమను గురించి ఓ కథ ఉంది మేడమ్, మీరు విన్నారో లేదో?"

 

    "కథా? చెప్పు , చెప్పు" అంటూ సర్దుకు కూర్చున్నాను జీపులో. ఎటు చూసినా పచ్చటి తివాచి పరచినట్టున్నది నేల. రోడ్డుకు అటూ యిటూ అరటి, కొబ్బరి, మామిడితోటలు, పూలతోటలు, పసుపుతోటలు - చూస్తుంటే ఒళ్లు పులకరించి పోతూంది.

 

    "కల్పనా! చెప్పవేం? కోనసీమ కథ చెప్తానన్నావుగా?" కల్పనవేపు తలతిప్పి చూశాను. ఆమె చెంపలు ఎరుపెక్కాయి. కళ్లు మిలమిల్లాడుతున్నాయి. ఆశ్చర్యంగా చూశాను. కథ చెప్పడానికి ప్రిపేర్ అవుతందన్నమాట! తను చెప్పబోయే కథ మనసులో మొదలవగానే ఆమె ముఖంలో వచ్చినమార్పు నన్ను మంత్రముగ్ధను చేసివేసింది. కల్పన - ప్రవృత్తికి తగ్గ పేరు. ప్రయత్నిస్తే పెద్ద ఆర్టిస్టు కాగలదు.

 

    "మేడమ్, రెడీ?" కల్పన కంఠంలో ఎంతలో ఎంత మార్పు!  

 

    "యస్, ఐయాం రెడీ! గో ఆన్!"

 

    "కైకేయి కోరికపై తండ్రిమాట జవదాటని శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై లక్ష్మణుడు వెంటరాగా అయోధ్య వదలి అరణ్యవాసానికి బయలుదేరి వస్తున్నాడు."

 

    వారేవా? వాటేస్టైల్!

 

    "అయోధ్య రాముడికి కోనసీమకు సంబంధమేమిటి కల్పనా?" వచ్చే నవ్వాపుకుంటూ అడిగాను.
                                                                                                                                                      
    "మేడమ్! మీరట్లా మధ్యలో అడ్డుపుల్ల లేయకూడదు. పూర్తిగా విన్న తర్వాత అడగండి అనుమానాలేమన్నా ఉంటే." సీరియస్ గా ముఖంపెట్టి అన్నది.

 

    "సారి కల్పనా, సారీ... ప్లీజ్, చెప్పు ఊఁ!" పెదవి బిగించి కూర్చున్నాను.

 

    "అట్లా బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుడూ దండకారణ్యంలో కొంతకాలం ఉండి దక్షిణాపథానికి ప్రయాణం కట్టారు. లక్ష్మణుడు మూటాముల్లె నెత్తినబెట్టుకొని అన్నగారిని, వదినగారిని అనుసరించి వస్తున్నాడు. సీతా, రాముడు చెయ్యీ చెయ్యీ కలుపుకొని చెట్టాపట్టా లేసుకొని దారిలో కనిపించే వింతలను విశేషాల్ను చూస్తూ హాయిగా కబుర్లు చెప్పుకొంటూ వసిష్ఠానది వొడ్డుకొచ్చారు.