ఆ తరువాత సరిగా తను స్కూలుకు వెళ్ళనేలేదు. తనకు స్కూలుకు వెళ్ళాలని ఉండేదికాదు. కాని ఐదేళ్ళ తన కూతురు బడికి వెళతానంటుంది. తన తరానికీ ఈ తరానికీ ఎంత భేదం ఉంది! ఆ తండ్రి కూతురేగా? ఆయన ఎప్పుడూ చదువుతూనే వుండేవారు.

 

    "అలాగేనమ్మా!" అంటూ నాగమ్మ తండ్రి దగ్గరకు వచ్చింది.

 

    మాధవయ్య వసారాలో నులకమంచంలో కాళ్లు కింద పెట్టుకుని మోకాళ్ళ మీదకు వంగి కూచుని వున్నాడు.

 

    మధ్య మధ్యన ఖళ్లు ఖళ్లున దగ్గుతున్నాడు.

 

    పెద్ద వయస్సు!

 

    పైగా ఉబ్బసంవ్యాధి ఒకటి పట్టుకుంది. చొక్కాలేని ఆ శరీరంలో ఎముకల్ని లెక్కపెట్టొచ్చు.

 

    ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడో!

 

    నాగమ్మ నిట్టూర్చింది.....

 

    "ఏం అమ్మలూ!" అన్నాడు కూతురు మొహంలోకి చూస్తూ.

 

    పార్వతి తల్లి చంకనుంచి దిగి తాతయ్య దగ్గరకొచ్చింది. మాధవయ్య దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తల నిమురుతూ అన్నాడు.

 

    "నీకోసం నేను ఏమీ చెయ్యలేని అసమర్ధుణ్ణయిపోయాను తల్లీ....." మాధవయ్య కెందుకో ఆ రోజు గతం తాలూకు స్మృతులు ఉండి ఉండి బాధించసాగాయి. తాత మాటల్నూ, బాధనూ అర్ధం చేసుకొనే వయస్సు కాదు పార్వతిది.

 

    "ఎందుకు నాన్నా అంత కుంగిపోతావు? ఎవరి నొసట ఎలా రాసిపెట్టి వుంటే అలాగే జరుగుతుంది. నువ్వు నాకేం తక్కువ చేశావు? బహుశా నాకంటే ఏ ఆడపిల్లా పుట్టింట్లో ఎక్కువ భోగ భాగ్యాలనుభవించి ఉండదు. నా బతుకిలా అవుతుందని ఎవరైనా అనుకున్నారా? దాని అదృష్టం బాగుంటే అది చదువుకొని, తన కాళ్ళమీద తాను నిలబడుతుంది. ఎప్పుడో ఇష్టమయినవాడ్ని చేసుకుంటుంది. నాకంటె నా కూతురు అదృష్టవంతురాలు అవుతుంది నాన్నా!" అంది నాగమ్మ.

 

    కొత్తగా అక్షరాలు నేర్చుకుంటున్న కుర్రాడు సంయుక్తాక్షరాలతో అన్న శబ్దాలను కుతూహలంగా, ఆశ్చర్యంగా చూస్తూ చదవటానికి ప్రయత్నించినట్లు మాధవయ్య కూతురు ముఖంలోకి చూశాడు.

 

    "నాన్నా! పార్వతి బడికి వెళతానంటుంది. ఇంతవరకూ మనకు ఆ ఆలోచనే రాలేదు. నా తల్లికి ఇప్పటినుంచే చదువుకోవాలని ఎంత కోరికో! అంతా వాళ్ళ నాన్న పోలికే!" అంటూ నాగమ్మ శూన్యంలో దూరంగా దేన్నో హూస్తూ నిలబడిపోయింది.

 

    "ఒరేయ్ సుబ్బులూ! మంచిరోజు చూసి పార్వతిని కూడా బళ్ళో వేయించరా!" అన్నాడు మాధవయ్య, అప్పుడే లోపలకు వస్తున్న కొడుకును చూసి.

 

    సుబ్బారాయుడు నిలబడి చెల్లెలి మొహంలోకి, తండ్రి ముఖంలోకి చూశాడు.

 

    "అలాగేలే!" అంటూ లోపలకు వెళ్ళబోయి, వాకిట్లో నిలుచుని వున్న నాగరత్నాన్ని చూసి ఆగిపోయాడు.

 

    "దానికొక తతంగం కూడా చెయ్యాలేమిటి? రేపొక పలకా బలపం ఇచ్చి పిల్లలతో పంపిస్తే సరిపోతుంది" అంది నాగరత్నం.

 

    "అదికాదు వదినా, కాస్తంత మంచిరోజు చూసి...."

 

    "మంచిరోజు చూసి వైభవంగా గురుదక్షిణతోపాటు స్కూలుకు పంపించాలంటావు నీ కూతుర్ని? అందుకే అంటారు రాతలు గాడిదలు కాస్తుంటే బుద్ధులు భూములేలుతుంటాయని!" మాటలను పెడీ పెడీ వదిలేసింది నాగరత్నం.

 

    "ఊరుకొందూ!" అన్నాడు సుబ్బారాయుడు.

 

    అతని గొంతులో మునుపటి ధైర్యం, అధికారం లేవు. పళ్ళబిగువుమీద పెళ్ళాం నోరు కట్టించే శక్తి తనలోనుండి ఏనాడో తప్పుకున్నట్లు సుబ్బారాయుడికి తెలియకపోలేదు.

 

    నాగమ్మ కూతుర్ని తీసుకుని గబగబా గొడ్లసావిడివైపు నడిచింది. అలా వెళ్ళిపోతున్న కూతురివైపు ఓ క్షణంచూసి కుక్కి మంచంలోకి వాలిపోయాడు మాధవయ్య.

 

    నాగమ్మ కూతుర్ని వళ్ళో కూర్చోపెట్టుకొని గొడ్లసావిట్లో కూర్చుని ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. తల్లి ఏడుస్తుంటే పార్వతి బిక్కమొహం వేసుకొని ఆమె ముఖంలోకి చూస్తూ వుండిపోయింది. తర్వాత తల్లి ఒడిలోనే నిద్రపోయింది.

 

    "ఏమిటమ్మాయ్? ఎందుకిక్కడ కూర్చున్నావ్?" పాలు పితకటానికి వచ్చిన సుబ్బారాయుడు ప్రశ్నించాడు.

 

    సుబ్బారాయుడికి కారణం తెలియక కాదు. అలా కూర్చునివున్న చెల్లెలిని చూస్తే సుబ్బారాయుడికి కడుపులో కెలికినట్లయింది. అంతకంటే ఏమనాలో తోచలేదు.

 

    "ఏం లేదన్నయ్యా, పార్వతి ఏడిపిస్తుంటేను_" మాట పూర్తి అయీ కాకుండానే అక్కడనుండి వెళ్ళిపోయింది నాగమ్మ.

 

    "ఈ అరవచాకిరీ చెయ్యలేక చస్తున్నాను. ఎవరికీ పట్టని ఈ బాదరబందీ నా కొంపకే చుట్టుకోవాలీ?" మాధవయ్య ముందు అన్నం పళ్ళెం ఎత్తి పడేసింది నాగరత్నం.

 

    అది చూసిన నాగమ్మ నిర్ఘాంతపోయి నిలబడింది. రోజూ తండ్రికి అన్నం నాగమ్మే పెడుతుంది. ఇవ్వాళకూడా వంట ఆమే చేసింది.

 

    మనసు బాగుండక కాసేపు తను అలా వెళ్ళి కూర్చుందని వదిన కోపంలా వుంది! నాన్న అన్నం తినకుండా లేచిపోతాడేమో! తండ్రి వైపు జాలిగా చూసింది.

 

    మాధవయ్య ఏమీ జరగనట్టే తల వంచుకుని అన్నం కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాడు.

 

    గబుకున ముందుకెళ్ళి నాన్న చెయ్యి పట్టుకుని "నాన్నా, ఆ అన్నం తినకు" అంటూ అరవాలనిపించింది నాగమ్మకు.

 

    కాని చూస్తూ నిలుచుండిపోయింది. తండ్రి గబగబా ముద్దలు మింగుతున్నాడు.

 

    నాగమ్మకు హృదయంలో లోతుగా ఏదో గుచ్చుకొన్నట్టయింది. తను అడుగడుక్కు అవమానించబడుతూనే వుంది. కాని ఈనాడు తండ్రికి జరిగిన పరాభవం చూసి కలిగిన బాధ అంతకు ముందెప్పుడూ కలగలేదు. తండ్రి అలా అన్నం తినకుండా లేచిపోతే బాగుండు ననిపించింది.

 

    ఒకప్పుడు నాన్న ఈ ఇంటికి మకుటంలేని మహారాజు. అభిమాని. ఎవరూ ఎదుటపడి నోరు తెరిచేవారు. ఆయన మాట ఇంట్లో రాజశాసనంగా చలామణి అయింది. అలాంటి నాన్నకు అదే ఇంట్లో అన్నంపెడుతూ అవమానించటమా?

 

    గిర్రున అక్కడినుంచి తిరిగి వెళ్ళిపోయింది. తడికల గదిలో చిరుచాప పరుచుకొని పార్వతిని పడుకోబెట్టుకొని పడుకుంది. అన్నం తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు లేరు. కడుపులో ఆకలి, గుండెల్లో గుబులు, హృదయంలో మంటలు. రాత్రంతా కలతనిద్రలోనే గడిపింది. కలత నిద్రనుంచి కలల్లోకి జారిపోయింది ......

 

    "బాలా!" భర్త స్వరం విని నిదానంగా తలెత్తి చూసింది బాలనాగమ్మ.

 

    "మీరా?" అంటూ పరుగెత్తుకెళ్ళి ఆయన్ను చుట్టేసింది. ఏడుస్తుంది. అతను ఏదేదో అంటూ ఓదార్చుతున్నాడు.

 

    "నన్ను ఒంటరిదాన్ని చేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కడ కెళ్ళిపోయారు? ఇన్నాళ్లు నన్ను వదిలేసి ఎలా వుండగలిగారు?" ఏదేదో అయింది. ఏడుస్తుంది.

 

    "ఏడవకు బాలా! అదుగో చూడు, మనమ్మాయి డాక్టరు పరీక్ష పాసయింది.

 

    భర్త చూపించిన వైపుకు చూసింది నాగమ్మ ఉత్సాహంగా.

 

    చేతిలో స్టెతస్కోపును విలాసంగా తిప్పుతూ నిండు యౌవనంతో మిసమిసలాడుతూ పార్వతి కనిపించింది. నాగమ్మ గబగబా పార్వతి దగ్గరకు పరుగెత్తింది. కాని అక్కడ పార్వతి లేదు. పున్నమ్మ కనిపించింది.

 

    "అమ్మా, నువ్వుకూడా వచ్చావా? పార్వతి ఏదీ?"

 

    "పార్వతి నీ దగ్గరే వుందమ్మా! జాగ్రత్తగా కాపాడుకో! నేను మీ నాన్నను తీసుకువెళుతున్నాను" అన్నది పున్నమ్మ.

 

    "అమ్మా, మరేమో ఏం జరిగిందో తెలుసా? వదిన నాన్న ముందు అన్నం పళ్ళెం ఎత్తి పడేసిందమ్మా! అయినా నాన్న ఆ అన్నం తిన్నాడమ్మా! నాన్నకు ఈ ఇంట్లోనే ఇంత అవమానం జరిగిందమ్మా!"

 

    "అందుకేనమ్మా ఆయన్ను తీసుకెళుతున్నాను."

 

    "నాన్ననుకూడా తీసుకెళుతున్నావా? మీరందరూ ఒకటై నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అమ్మా? నువ్వు కూడా నన్ను వదిలేశావుగా!"

 

    పున్నమ్మ జవాబివ్వకుండానే దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. పక్కనే తండ్రీ, భర్తా కూడా వున్నారు.

 

    "నాన్నా! నువ్వూ వెళ్ళిపోతున్నావా నాన్నా! నాన్నా!" కెవ్వుమంది నాగమ్మ. మెలకువ వచ్చేటప్పటికి చిన్న వదిన సుందరమ్మ నాగమ్మను వంగి కుదుపుతూ లేపుతూ వుంది.

 

    నాగమ్మ చివ్వున లేచి కూర్చుంది.

 

    చిన్న వదిన ఆ ఇంట్లోకి రావడం చాలా ఆశ్చర్యాన్నే కలిగించింది నాగమ్మకు.

 

    "లే నాగమ్మా! త్వరగా బయటకు రా" అంటూ సుందరమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.

 

    బయటనుంచి ఏదో కలకలం వినిపిస్తోంది. నాగమ్మ గాబరాగా ఒక్క దూకులో బయటకు వచ్చింది. వసారాలో వున్న మాధవయ్య మంచం చుట్టూ జనం ఉండటం చూసిన నాగమ్మకు క్షణంలో జరిగిందేమయి వుంటుందో అర్ధమయిపోయింది. నిల్చున్నచోటే ఎంతోసేపు కదలకుండా నిలబడిపోయింది. యాంత్రికంగా మంచం దగ్గరకెళ్ళి చూస్తూ ఉండిపోయింది.

 

    "మంచంలోనే పోయాడా పాపం! కిందకి దించండి"

 

    ఇద్దరు మనుష్యులు పట్టి మాధవయ్య శవాన్ని కింద పడుకోబెట్టారు.

 

    "అదృష్టవంతుడు! మంచంలో పడి తీసుకోకుండా తిరుగుతూ తిరుగుతూ పోయాడు."

 

    "పులిలాంటి మనిషి. ఎంత అభిమానంగా బ్రతికాడో బతికినన్నాళ్ళూ!"

 

    తలొక రకంగా అనుకుంటున్నారు.

 

    ఆ వార్త నిముషాలమీద ఊరంతా వ్యాపించింది. ఒక్కొక్కరే వస్తున్నారు. పోతున్నారు. వచ్చిన వాళ్ళంతా మాధవయ్య ఒకప్పటి వైభవాన్ని గురించి మాట్లాడేవారే. మాధవయ్య కొడుకులు ముగ్గురూ తలలు వంచుకొని విచారంగా కూర్చుని వున్నారు. నాగమ్మ ఓ మూల తల మోకాళ్ళమీద పెట్టుకుని కూర్చుని వుంది.

 

    నాగరత్నం శోకాలు పెడుతోంది.

 

    కమల ముక్కు కందేలా చీదేస్తూంది.

 

    సుందరమ్మ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది.

 

    ఏడుస్తున్న పార్వతిని పొరుగింటి రత్నమ్మ తీసుకెళ్ళింది.

 

    "అయ్యో! మామగారూ! ఏం దగాచేసి పోయారు? రాత్రి కూడా లక్షణంగా, రోజుకంటే ఓ ముద్ద ఎక్కువే భోజనం చేశారే? ఇంతలో మిత్తవలాగ వచ్చిందా చావుకు!" నాగరత్నం అప్పుడే వచ్చిన ఊళ్ళో ఆడంగులను చూసి శోకాలు తీసింది.

 

    నాగమ్మ తలెత్తి నాగరత్నం వైపు చూసింది.

 

    రాత్రి నాన్న తిన్న ఆ అన్నమే ఆయన ప్రాణం తీసింది! అంత అవమానం పొంది ఆయన ఆ అన్నాన్ని అంత ఆత్రంగా తింటున్నప్పుడే తనకు అదోలా అనిపించింది. నాన్నకు చాలా చాలా లోతుగా, ఆయువు పట్టునే దెబ్బ తగిలింది. అభిమానంగల ఆయన మళ్ళీ ఆ ఇంట్లో పళ్ళెం పెట్టుకోలేదు. నాగమ్మ మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తూంది.

 

    మాధవయ్యకు స్నానం చేయించాక కాళ్ళకు కొబ్బరికాయ కొట్టి భోరుమంది నాగమ్మ.

 

    "నాన్నా! నాకేమి చెప్పి పోతున్నావ్? నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వూ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయావా? నన్ను కూడా తీసుకెళ్లు నాన్నా" అంటూ కుళ్ళికుళ్ళి ఏడ్చింది నాగమ్మ.

 

    నాగరత్నం నాగమ్మ దగ్గరకొచ్చి ఆమె చుట్టూ తన చేతులను చుట్టి అంది: "అదేమిటమ్మా! నలుగు రన్నల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిదానివి కావటం ఏమిటి, మేమంతా లేమూ, ఏడవకు."

 

    కమలా, సుందరమ్మా మొహమొహాలు చూసుకున్నారు. నాగమ్మ అంత దుఃఖాన్ని మర్చిపోయి, వదిన ముఖంలోకి విస్మయంగా చూసింది.

 

    "నీకేం తక్కువమ్మా! తల్లి తరువాత తల్లంతటిది వదిన కడుపులో పెట్టుకొని కాపాడుతుంటేను!" నాగరత్నం స్నేహితురాలు చంద్రకాంతం అంది నాగమ్మను ఓదార్చుతూ.

 

    నాగమ్మ ఆ రాత్రి ఎవరిచేత చెప్పించుకోకుండానే భోజనం దగ్గర కూర్చుని లేచింది. సుబ్బారాయుడు మజ్జిగ మాత్రం త్రాగి వూరుకున్నాడు. రామదాసు, నాగభూషణం కన్నీళ్ళు తుడుచుకుంటూనే భోజనం అయిందనిపించారు.

 

    మొత్తంమీద కర్మకాండ అంతా ముగిసిందాకా అందరూ కలిసే వున్నారు. ఆ పదిరోజులూ తోడికోడళ్ళు పూర్వపు పగలు మర్చిపోయినట్లే ప్రవర్తించారు. పదోనాడు ఆ వూళ్ళో వున్న పాటక జనానికి అన్నదానం చేశారు. వారసులకు దగ్గిరవాళ్ళకు భోజనాలు పెట్టారు. తండ్రంటే కొడుకులకు గల అభిమానాన్ని పొగిడేశారు.

 

    మళ్ళీ ఎవరి కుండలు వాళ్ళు పెట్టుకున్నారు.

 

    నాగమ్మమాత్రం పెద్దన్నయ్య ఇంట్లోనే మిగిలిపోయింది.


                                        20


    తలమునక నీళ్ళలో ఈతరాని బ్రతుకయింది నాగమ్మ జీవితం.

 

    తండ్రి ఎలాంటి నికృష్ట పరిస్థితుల్లో చనిపోయాడో నాగమ్మ హృదయం తూట్లు పడిపోయింది.

 

    పొట్టకూటికి చేసే చాకిరికి కాళ్ళూ చేతులూ కాయలు కాచినాయి.

 

    సావిట్లో ఒక గదివార తడికలు కట్టుకొని అందులోనే కాలక్షేపం చేస్తుంది నాగమ్మ కూతురుతో.

 

    ఒంటరిగా తీరిక వున్నప్పుడు కూచుని తన కష్టాలను తలచుకుంటూ అనుకొనేది - తనే అలా అనుకుంటే మరి శ్రీలక్ష్మమ్మ ఎన్ని బాధలు పడలేదు?

 

    పిండి విసురుతూ, బిందెలకొద్దీ నీళ్ళు తోడుతూ, రెక్కలు పడిపోయేలా ధాన్యం దంచుతూ అనుకొనేది - తనేం ఆ సక్కుబాయికంటే ఎక్కువ కష్టపడుతోందా ఏం?

 

    నాగమ్మ మెదడులో ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు చెలరేగుతుండేవి. భర్తతో గడిపిన ఆ కొద్దికాలపు జీవితం గుర్తుండీ లేని కలలా మాత్రమే మిగిలిపోయింది ఆమె స్మృతిపథంలో.

 

    అవమానాలూ, తిరస్కారాలూ ఇప్పుడు నాగమ్మను అంతగా బాధపెట్టటం లేదు. "అన్నయ్యా, వదినేగా! ఆ మాత్రం అనతగరా?" అనుకుంటూ సరిపెట్టుకుపోవడం అలవాటు చేసుకుంది.