-: రాక్షస హస్త లక్షణము :-
తా: రెండు కరములతో ముఖము వద్ద శకట హస్తము పట్టినయెడల రాక్షస హస్తమగును. (గాక రెండు చేతులతో పద్మకోశహస్తములు బట్టి, భుజశిరస్సులకు సమముగా యుంచి, ప్రేక్షకుల కభిముఖము చేసినచో, రాక్షస హస్తము వచ్చును.)
-: ప్రశిద్ధ హస్త లక్షణములు :-
తా: శుకతుండము హరిశ్చందృనకును, మయూర హస్తము నలుని యందును, పురుకుత్సునికి అలపద్మహస్తము, పురూరవునికి ముష్టిహస్తము అలపద్మ హస్తము శిరస్సునందు చేర్చిన సగరునికి, పతాకము దినీపునకును కర్తరీ ముఖము అంబరీషునికిని, కపిద్ధ హస్తమును చలింపచేయుచు బట్టిన శిబియందును, రెండు పతాక హస్తములు భుజముల కొనలకు దూరముగా నుంచి, దేవభావనతో బట్టిన, కార్తవీర్యునకు, ఆ పతాకహస్తములే ముందు వెనుకలగా మార్చిబట్టిన, రావణుని యందును, భుజప్రదేశమున రెండు సూచీ హస్తములు చలింపజేయుచు బట్టిన ధర్మరాజునకును, త్రిపతాక హస్తములు మాటిమాటికి ఎదురుగా చలింపచేయుచు బట్టిన అర్జనుని యనిదును, ముష్టిహస్తము ఎదురుగా చలింపచేయుచు బట్టిన భీమ సేనుని యందును, ఉద్వేష్టితాంగుళమగు సూచీహస్తము శైభ్యుని యందును, నకులునకు కటకాముఖమును, శిఖరము సహదేవునకును, సహుషునికి చల పతాక హస్తము, యయాతికి తామ్రచూడ హస్తము, అర్ధచంద్ర హస్తము త్రిపతాకాకృతిగ పట్టిన భగీరధుని యందును, రాహుగ్రస్తమైన చంద్రమండలమందును చెల్లును. మరత్తు మహరాజు, మాంధాత, హస్తముకుళము సూచీ, ముష్టి, ఉద్వేష్టితార్థ పతాకము. ఈ నాల్గు హస్తములు క్రమముగ చెల్లును. అర్ధపతాకహస్తములు, రఘుమహారాజు, అజనుహారాజులకు కుడి యెడమలుగా చెల్లును. స్వస్తికాలపద్మము దశరధునకును. శిఖరహస్తము రామునికిని చాపపాణులైన రాజులయందును చెల్లును. శిఖరము కుడిమూపున చేర్చిబట్టిన భరతునికి, ఎడమమూపునందు బట్టిన లక్ష్మణునికి, నొసటికి అభిముఖముగా నుంచిణ శతృఘ్నునికి చెల్లును. ఈ హస్తములన్నియు సూర్యవంశరాజులకు వర్తించును. వీటినే యెడమప్రక్కగ హస్తవిన్యాస క్రమము జరిపినచో చంద్రవంశ రాజులకు వర్తించునని నాట్యశాస్త్రజ్ఞులచిత చెప్పబడియున్నది.
-: చతుర్థశ లోకహస్త లక్షణములు :-
-: ఊర్ధ్వలోక హస్త లక్షణము :-
తా: భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, మహార్లోక, సత్యలోకంబులకు, ఉద్వేష్టిత పతాకహస్తము వినియోగించును. ఈ ఏడు ఊర్ధ్వలోకములు.
-: అధోలోక హస్త లక్షణములు :-
తా: అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళలోకంబులకు, అపవేష్టిత పతాకహస్తము వర్తించును. ఈ ఏడును అథోలోకంబులందురు.
-: వృక్షహస్త లక్షణములు :-
-: అశ్వత్థ వృక్షము :-
తా: రెండు అలపద్మ హస్తములు చలింపచేసిన అశ్వత్థ వృక్షముకు చెల్లును. (అనగా రావిచెట్టు)
-: కదలీ వృక్షము :- (అరటి)
తా: శ్లిలుష్టముకుళ హస్తమును పొడవుగా కదిలించి పట్టిన కధలీ వృక్షమునకు (అరటి) చెల్లును.
-: నారజ్గువికుచ వృక్షములు :-
తా: పద్మకోశము నారింజవృక్షమునకును, భ్రమరహస్తము గజనిమ్మ చెట్టుకును చెల్లును.
-: పనస, బిల్వ వృక్షములు :-
తా: చతుర హస్తము, పనస, బిల్వ (మారేడు) వృక్షములకు వినియోగించును.
-: పునాగ వృక్షములు :-
తా: పతాక చతుర హస్తములు పొన్నమ్రానికి చెల్లును.
-: మందార, వకుళ వృక్షములు :-
తా: ఖండచతురము, మందార వృక్షముకును, సందంశ హస్తము వకుళ వృక్షమునకు చెల్లును.
-: వటార్జున వృక్షములు :-
తా: పతాకము మర్రిమ్రానుకు, సింహముఖ హస్తము ఏరుమద్ది మ్రానుకు వర్తించును.
-: పాటలీహింతాల వృక్షములు :-
తా: శుకతుండము పాదిరి చెట్టుకును కర్తరీముఖహస్తము చెల్లును.
-: సోక వృక్షము :-
తా: పద్మకోశ హస్తములు స్వస్తికములుచేసి పట్టినచో పోకమ్రానుకు వర్తించును.
