Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 4


    తండ్రి : ఒరే శీనూ! నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారంటగా- తీసుకురా- చూస్తాను-
    శీను: లేదు డాడీ- మా ఫ్రెండ్ రాజు తీసుకెళ్ళాడు-
    తండ్రి : అదేమిటి? నీ ప్రోగ్రెస్ కార్డ్ వాళ్ళింటికెందుకు తీసుకెళ్ళాడు?
    శీను : ఆ కార్డ్ చూపించి వాళ్ళ డాడీని భయపెట్టి రేపు తెచ్చిస్తానన్నాడు.

    పిల్లలకు చూచిన విషయాలన్నింటినీ వర్ణించి చెప్పటం నేర్పించాలన్న ఉద్దేశ్యంతో టీచర్, క్రికెట్ మాచ్ జరుగుతున్నట్లు ఊహించుకుని కామెంటరీ చెప్పమంది.
    అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంటరీ చెప్పారు.
    ఆఖర్లో క్లాసులో అందరికంటే బద్దకస్తుడయిన వినోద్ లేచి నిలబడ్డాడు.
    "వర్షం కారణంగా ఈ రోజు జరగాల్సిన వన్ డే క్రికెట్ మాచ్ రద్దయింది" అనేసి కూర్చున్నాడు.

    ఓ దోమపిల్ల సినిమా హాల్లోపలికెళ్ళి సినిమా చూడాలని మనసుపడింది.
    "చిన్న పిల్లలు అలా సినిమా హాల్స్ కెళ్ళకూడదు" అని తల్లి దోమ ఎంత చెప్పిన అ'ఏమయినా సరే వెళ్ళాల్సిందే' అంటూ మారాం చేయసాగింది.
    చివరకు వాళ్ళమ్మ విసిగిపోయింది.
    "సరే! వెళ్ళి తగలడు! కానీ వెళ్ళేముందు ఓ సంగతి గుర్తుంచుకో-"
    "ఏమిటది?"
    "జనం తప్పట్లు కొట్టేసీన్ లు వచ్చినప్పుడు మాత్రం బయటకు పరుగెత్తు కొచ్చేసెయ్-"
    "ఎందుకని?"
    "ఎందుకేమిటి? తప్పట్లు కొట్టే చేతుల మధ్య నలిగి ఛస్తావ్"
    ఒక డబ్బున్నావిడ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. రకరకాల పరీక్షలన్నీ చేశాక, ఆ రిపోర్ట్ అన్నీ తీసుకుని మళ్ళీ ఆ డాక్టర్ ని కలుసుకుందామె. డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి చిరునవ్వు నవ్వాడు.
    "మీకో శుభవార్త- ఒక చెడువార్త చెప్పాలి. ముందేది వింటారు?"
    "శుభవార్త!" ఉత్సాహంగా అందామె.
    "అయితే వినండి! మా అమ్మాయికి మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించాను-"
    "కంగ్రాచ్యులేషన్స్- ఇంక చెడువార్తేమిటో చెప్పండి"
    "ఆమెకు నేను కట్టాల్సిన డొనేషనూ- మీరు నాకివ్వాల్సిన ఫీజూ- రెండు ఒకటే-"

    బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఓ డాక్టర్ ని జర్మనీ దేశంలోని ఒక హాస్పిటల్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు.
    ఆయన జర్మనీ వెళ్ళిపోతున్నాడని తెలిసి చాలామంది బంధుమిత్రులు ఆయనను కలుసుకోడాని కెళ్ళారు.
    "అంతా బావుంది కానీ మీకు జర్మనీ భాష అస్సలు రాదు కదా! మరక్కడ పేషంట్స్ తో ఎలా మాట్లాడతారు?" అడిగారు వాళ్ళు.
    "నో ప్రాబ్లెమ్ బ్రదర్- నాకా భాష రాకపోయినా ఫర్లేదు - అసలు ఎవరితోనూ మాట్లాడకుండా ఊరుకుంటాను-"
    "అదేమిటి? ఏమీ మాట్లాడకపోతే మరి వైద్యం ఎలా చేస్తావ్?"
    "నేను ఎనస్తేషియా ఇచ్చేవాడిని కదా- మాటలెందుకు?" నవ్వుతూ అన్నాడు డాక్టర్.

    పి.వి. నరసింహారావ్ ప్రధాని పదవిలోకి రాగానే అందరూ ఆయన చుట్టూ చేరి కాంగ్రెస్ ప్రధానులంతా ఏదొక 'స్లోగన్' తో పరిపాలించటం అలవాటు కాబట్టి మీరు కూడా ఏదయినా 'స్లోగన్' దేశానికి ఇవ్వాలని అడిగారు.
    పి.వి. కొద్ది క్షణాలు ఆలోచించి 'బాత్ కమ్- కామ్ జ్యూదా' (మాటలు తక్కువ- పని ఎక్కువ) అనే స్లోగన్ తయారు చేశాడు. దేశమంతా ఆ నినాదం ప్రచారమయిన పోయింది గానీ అయిదేళ్ళయినా దేశంలో పనులేమీ జరక్కపోవటం గమనించి అందరూ గొడవ చేశారు.
    "జరక్కపోవటమేమిటి? నా నినాదం సెంట్ పర్సెంట్ సక్సెస్" అన్నాడు పి.వి.
    "జరగటం లేదు- అంతా అబద్దం" అంటూ అరిచారు వాళ్ళు.
    "అబద్దం కాదు- నిజంగానే నేను చెప్పినదంతా జరుగుతోంది. కాకపోతే ఒక చిన్న స్పెలింగ్ మిస్టేక్ వల్ల అండర్ స్టాండింగ్ లో కొంచెం తేడా వచ్చింది.
    "ఏమిటా స్పెలింగ్ మిస్టేక్?"
    "బాత్ కమ్- కామ్ జ్యాదా" అని అందరూ అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమిటంటే "బాత్ కమ్- స్కామ్ జాదా అంతే తేడా" అన్నాడు పి.వి. నవ్వుతూ.

    చంద్రబాబు నాయుడు ఓసారి కొంతమంది విదేశీ ప్రముఖులకు హైద్రాబాద్ నగరాన్ని తనెంత అద్బుతంగా డెవలప్ చేశాడో చూపిస్తున్నాడు.
    "చూశారా! నగరం మూడువేపులా ఎంత అందంగా కనబడుతోందో- ఒకవైపు అందమయిన చెరువులు, పార్క్ లు, మరోవేపు అందమయిన పురాతన కట్టడాలు, మూడో వేపు హైటెక్ సిటీ...."
    "మరి నాలుగో వేపు ఏముంది?" ఒక ఫారినర్ అడిగాడు.
    "వరల్డ్ బాంక్ అప్పు-" చెప్పాడు ఆ పక్కనే ఉన్న వరల్డ్ బాంక్ అధికారి.

    మాజీ ప్రధాని పి.వి. నరసింహారావ్ పదవిలో ఉండగా ఎంత కొంపలు మునిగే విషయాన్నయినా తెగనాన్చి, ఎటూ తేలకుండా వదిలేయటం అందరికీ తెలిసిందే! ఒకసారి దేశమంతా ఎలక్షన్స్ జరుగుతోంటే ఓ సమావేశంలో ఆయన సమయం సందర్భం లేకుండా పగలబడి నవ్వాడు.
    అందరూ ఆశ్చర్యపోయి మీటింగ్ ఆపి ఆయన వేపు చూశారు.
    "ఎందుకు సార్- అంతగా నవ్వుతున్నారు?" అడిగాడొకాయన.
    "మరేం లేదోయ్- నేను విదేశాలకు టూర్ వెళ్ళాను కదా! అప్పుడు ఒకతను జోక్ చెప్పాడు ఆ జోక్స్ కి ఇప్పుడు నవ్వొచ్చింది"

    లాలూ ప్రసాద్ యాదవ్ తన కుక్కతో మాణింగ్ వాక్ కెళ్తూంటే హఠాత్తుగా కాలు మెలికపడి కిందపడ్డాడు. జనమంతా గుమికూడే లోపల కుక్క పరుగెత్తుకెళ్ళి దగ్గర్లో ఉన్న హాస్పిటల్ నుంచి డాక్టర్ ని తీసుకొచ్చింది.
    అందరూ ఆ కుక్కని తెగమెచ్చుకుంటూంటే లాలూ ప్రసాద్ కోపంగా లేచి నిలబడ్డాడు.
    "మీకేం తెలివుందా లేదా? దాన్ని అంత మెచ్చుకుంటారేమిటి? అది తీసుకొచ్చింది పశువుల డాక్టర్ ని-"

    లాలూనీ ఒక స్వామీజీని యమభటులు తీసుకెళ్ళి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు ముందు స్వామీజీ చిట్టా తెరచాడు.
    "స్వామీజీ ఎకౌంట్ లో ఒక్క పుణ్యం కూడా లేద్సార్- నరకంలో వేసేయండి" అన్నాడు చిత్రగుప్తుడు.
    "అన్యాయం సార్! నేను ఎన్నో యజ్ఞాలు నిర్వహించాను. కొన్ని లక్షలమందికి భగవద్గీత ఉపదేశించాను- కోట్లమంది దేవుడి పేరు నిత్యం తలుచుకొనేలా ఉద్భోధలు చేశాను- నాకు స్వర్గం ప్రసాదించటం న్యాయం" అంటూ మొత్తుకున్నాడు స్వామీజీ.
    "అదంతా నువ్- నీ వ్యాపారం కోసం చేయించావయ్యా- అందుకని నీకు నరకమే-" అన్నాడు యమధర్మరాజు.
    తర్వాత లాలూ రికార్డ్ చూశారు. చిత్రగుప్తుడు గుండెలు బాదుకున్నాడు.
    "ఓర్నాయనో- ఓర్నాయనో - నానోటితో నేను చెప్పలేనండీ- అన్నీ వెధవ పనులు- అన్నీ దుర్మార్గాలూ చేశాడు" అన్నాడు చిత్రగుప్తుడు. "లాలూ పరిపాలనలో ఆ రాష్ట్ర ప్రజలు మొత్తం గుండెలు అరచేతిలో పెట్టుకుని గడిపారు."
    యమధర్మరాజు ఓ క్షణం ఆలోచించి "లాలూకి స్వర్గం" అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS