శ్రీ శామ్యుయెల్, జి.జె.
చైనా దురాక్రమణ
గుటకాయ స్వాహా యన
తటస్థ రాజ్యంబుపైన దండెత్తు మిమున్
నిటలాక్షుం డుగ్రుండై
కుటిలపు తంత్రములనెల్ల గూలుచుగాతన్.
కైలాస మునికిగా గల
ఫాలాక్షునికైన సుంత - భయపడకుండన్
ఆలమునకు సిద్ధపడిన
బాలీశుల పీచమణచ - బాధ్యత మనదే.
చైనాను బిలువకుండుట
నానాజాతుల సమితికి - నగుబాటంచున్
మానక వాదించిన, యభి
మానంబును సాంతముగను-మంట గలిపిరే!
మా దేశపు సిద్ధార్థుని
నాదర్శముగగొని వాని-యాజ్ఞలపట్లన్
సూదిమొన యంతయైనను
నాదరణను జూపకుండు టతి దారుణమౌ
కైకొనియు, పంచశీలము
లేకముగా విస్మరించి-యిచ్చకపు నుడుల్
వాకొని యిప్పట్లను, మర
మేకై కూర్చుండినారు-మ్లేచ్చులరీతిన్.
సహనము మా నైజమయిన
అహింస బాల్యంబునుండి-యలవాటైనన్
అహరహము బోరి మీతో
తుహినాద్రినె పడయగలము తుది విజయంబున్.
ఇరువేల యేండ్లనుండియు
సరాసరిగ సాగుచున్న - సభ్యత తృటిలో
పరిమార్చిన మిము, దురమున
పరాహితుల జేయకుండ-పట్టు విడుతుమా!
సన్ యెట్ సేను-చరిత్రను
తెనుగున ప్రచురించునట్టి-దేశస్థులపై
అని చాటించిన చైనా
జనాంగమును మెచ్చలేరు-సజ్జను లెవరున్.
రవులుకొనిన యుద్ధమునకు
సవిస్తరముగ సమకూర్చి-సకలాయుధముల్
పవరములో మన పగతుర
సవాలు నెదురుకొనదగిన - సమయం బిదియే.
పంచశీలంబుల ననుసరించ నెంచి
పంచశిల లాక్రమించిన - వంచకులుగ
సిద్ధమైనారు బౌద్ధులు-యుద్ధమునకు
సత్యశౌచాళి గాలికి జారవిడచి.
* * * *


