Previous Page Next Page 
శరతల్పం పేజి 2


    గాలి వడిగా వీచింది.
    జల్లుతెర ఒకటి ఇంట్లోదాకా వచ్చిపోయింది.
    భగ్గు భగ్గుమని లాంతరు ఆరిపోయింది.
    స్వామి నాంచారమ్మ ముఖంచూస్తూ "ప్రమాదంగా ఉన్నదని డాక్టరు రాసిండు."
    "హమ్మయ్య, అంతేగద! బతికున్నడు గద గురువయ్య. లేవండి స్నానం చెయ్యండి. శ్రీయఃపతిని ప్రార్థించండి లేవండి, నేను సీతమ్మను వేడుకుంటా" అని, "అయ్యో లాంతరు మలిగిపోయింది. పద ముట్టిస్త" అని అగ్గిపుల్ల తెచ్చి గీరి లాంతరు ముట్టించింది.
    అప్పుడు చూచింది స్వామిని__పూర్తిగా తడిసి ఉన్నారు.
    "అయ్యో! నా మతి మండ! ఎంత తడిసిపోయిన్రండి_చెప్పనన్నలేదు" అని కొంగుతో స్వామి తలా, వళ్ళూ తుడిచి, కట్టుకోవటానికి చిన్న పంచె తెచ్చి ఇచ్చింది.
    చిన్న పంచె కట్టుకుంటున్న స్వామి మౌనంలో ఏదో గాంభీర్యత, గాఢమైన ఆలోచనా కనిపించాయి నాంచారమ్మకు.
    "ఏమండీ ఎట్లనో ఉన్నరు. ఏమైందండి! నిజం చెప్పరా!" ఆమె మాటల్లో గుండె దడలు వినిపించాయి.
    "ఏం లేదు పిచ్చిదాన! ఏదో ఆలోచన వచ్చింది ఉత్తరం సంగతి కాదు. పా స్నానం చేస్తా" స్వామి పెదవులపై చిరునవ్వు కనిపించింది.
    నాంచారమ్మ మనసు కొంత నిమ్మళించింది.
    "మీరు స్నానం చెయ్యండి. నేను వంట ఇల్లు అలికి ముగ్గు పెట్త. నా మతి మండ. మడి కట్టుకోవటమే మరచిన" అని వంటింట్లోకి వెళ్ళిపోయింది నాంచారమ్మ.
    స్వామి స్నానం చేసి వచ్చేవరకు వంటిల్లు అలికి ముగ్గుపెట్టి, నెమ్మెలు వెలిగించింది నాంచారమ్మ. స్వామి తిరుమన్కాపు చేసుకొని తిరువారాధనకు కూర్చున్నారు. "కౌసల్యా సుప్రజా రామా...." ముగించి భువనేశ్వరపు తలుపులు తెరచారు. సీతారామచంద్రుల విగ్రహాలు దివ్వెల కాంతికి వెలిగిపోతున్నాయి. రాముని తొడపై కూర్చొని వుంది సీతమ్మ_పక్కన లక్ష్మణుడున్నాడు. స్వామి భద్రాద్రిరామునివంటి ఆ విగ్రహాల్ను చాలా కష్టపడి సంపాదించారు. ఆ విగ్రహాలంటే వారికి ఎనలేని భక్తి.
    స్వామి మధుర స్వరంలో మంత్రపఠంనం మనుషుల మనసులను ముగ్ధుల్ని చేస్తుంది.
    నాంచారమ్మ స్నానంచేసి తడిబట్టలతోనే పొయ్యిలో నిప్పువేసి వంట ప్రారంభించింది. వంట చేస్తూ మంత్రపఠంనం వినడంలో ఆవిడకేదో ఆనందం ఉంది.
    వంట పూర్తయ్యేవరకు తిరువారాధన ముగిసింది కాని స్వామి ధ్యానంలో నిమగ్నులయినారు. అంతసేపు ధ్యానంలో కూర్చోవడం నాంచారమ్మ ఎరుగదు.వంటింట్లోని మౌనం వింతగానూ, విచిత్రంగా తోచిందామెకు. ఆమె సైతం దేవునిముందు కూర్చొని మౌనంగా ప్రార్థించ సాగింది.
    బయట వాన కురుస్తూనే ఉంది. ఈదురుగాలి వీస్తూనే ఉంది.
    ముందు కళ్ళు తెరిచినవారు స్వామి. వారు నాంచారమ్మను చూచారు. ఆమె ముఖంలో ఏకాగ్రత కనిపించింది. వారికి ఆశ్చర్యం కలిగింది. ఆమె అలా కూర్చొని ధ్యానించడం అంతకుముందు వారెరుగరు. ఆమెకు అంతరాయం కలిగించకుండా మెల్లగా లేచి అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు స్వామి.
    చాలాసేపటికిగాని కళ్ళు తెరిచిందికాదు నాంచారమ్మ. చూస్తే భర్త లేరు. ఒకసారి విగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేసి, వంట ఇల్లు దాటింది. స్వామి వెనుక గుమ్మంలో నుంచొని వానను చూస్తున్నారు. నాంచారమ్మ భర్తను పిలిచింది. వానను చూస్తూనే ఊఁ అన్నారు స్వామి.
    "విన్నారా! సీతమ్మ ఏమన్నదో!"
    అప్పటికీ వానమీంచి దృష్టి మరలించలేదు స్వామి.
    అది గమనించకుండానే "పిచ్చమ్మ పసుపు కుంకుమ రక్షిస్తానన్నదండి" అన్నది నాంచారమ్మ.
    స్వామి నాంచారమ్మ వైపు తిరిగి "అందుకేనా ఇంతసేపు ధ్యానించినావు! సరేగాని వాన చూసినవా! పిచ్చమ్మ పాపం ఆ గుడిసెలో ఎట్ల ఉంటున్నదో!"
    "మరిచినం అసలు పిచ్చమ్మకు ఈ వార్త."
    "అదే ఆలోచిస్తున్న. ఎట్ల చెప్పాలె. ఏమని చెప్పాలెనని."
    నాంచారమ్మ కూడా ఆలోచనలో మునిగింది.
    "ముందు సాపాటు చేతాం. ఇంతలో వానేమన్న తగ్గుతదేమో చూతం" అన్నారు స్వామి.
    నాంచారమ్మ అక్కణ్నుంచి వెళ్ళిపోయింది.
    ఇద్దరూ భోజనాలు చేశారు. తాంబూలం వేసుకోకుండానే బయలుదేరారు స్వామి. నాంచారమ్మ గొడుగు అందించి గుమ్మానికి ఆనుకొని నుంచుంది_పైట చెంగుతో వళ్ళంతా కప్పుకొని.
    వాన పడుతూనే వుంది_కాని వడి తగ్గింది.
    వీధులు కాలవలుగా పారుతున్నాయి. స్వామి సాగిపోతుంటే నీళ్ళ చప్పుడు వినిపించింది. అప్పుడు గుర్తువచ్చింది నాంచారమ్మకు భర్తకు కనీసం లాంతరు ఇవ్వలేదని. "ఏమండీ" అని పిలిచి లోనికి పరిగెత్తి లాంతరు తెచ్చింది.
    స్వామి నాంచారమ్మ పిలుపు వినలేదు_సాగిపోయారు. చీకట్లో తడుముకుంటూ గురువయ్య యింటికి చేరుకొని ముక్కు మూసుకున్నారు. తోళ్ళవాసన. ఆ గూడెమంతా అంతే. మామూలు పరిస్థితి అయితే అప్పుడు అడుగుపెట్టేవారు కారు స్వామి. ఇప్పటి స్థితి వేరు.
    గురువయ్యకు ప్రమాదంగా ఉంది!
    ఆ విషయం పిచ్చమ్మకు చెప్పాలి!!
    వాన ముసురు ఎక్కువైంది.
    వాకిట్లో నుంచొని పిచ్చమ్మను కేకవేశారు స్వామి.
    మూడు నాలుగుసార్లు పిలిచిన తరవాత ఉలిక్కిపడి లేచింది పిచ్చమ్మ. "ఎవరు! అయ్యగారా! ఇట్లొచ్చిన్రు_ఇంత రాత్రి_వానల_పిలిపిస్తే రాకపోయినాను బాంచెను" అని లోపలినుంచి తడక తీసుకొని బయటికి వచ్చింది.
    వాకిట్లో_వానలో స్వామి కనిపించారు. పిచ్చమ్మ ప్రాణాలు పైపైనేపోయాయి. ఏమనాలో అర్థంకాలేదు. మాటలు తడబడ్డాయి.
    "అయ్యా.... మీరు పెద్దలు.... ఇంట్లకు రమ్మందునా.... వానల నానమందునా.... ఏమందును.... అయ్యా! ఎందుకొచ్చిన్రు?" అని తానే వానలోకి ఉరికివచ్చి స్వామి ముందు నుంచుంది.
    "గురువయ్య దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది."
    "వచ్చిందా? బాంచెను.... ఏమన్నడు.... ఎట్లున్నడు?.... నాకేమన్న రాసిండా?...."
    "బాగున్నడు....రమ్మని రాసిండు. నేను పోతున్నా"
    "అయ్యగారు... మీరు పోతున్రా... ఎట్లున్నది ఆయనకు? నిజం చెప్పండి... కాల్మొక్త... మీరు పోతుంటె నేనెట్లుండ? నేను వస్త తీస్కపోండి బాంచెను" అన్నది పిచ్చమ్మ.
    పిచ్చమ్మ తలమీంచి కారుతున్న వాన నీటిలో కన్నీరు కలిసిపోయింది.
    "గురువయ్య బాగానే ఉన్నడు. ఎందుకు రమ్మన్నడో తెలియదు...వస్తవంటవా, రా...తీస్కపోత"
    "అట్లనే బాంచను...నా పెనిమిటిని కాపాడుండి...మీరు పెద్దలు మా ఇంటికొచ్చిన్రు... అట్లనే వస్త కాల్మొక్త...." అని కాళ్ళమీద పడబోయింది పిచ్చమ్మ. అయినా పాదాలు తాకలేదామె. ఆమె చేతులు బురదలో పడ్డాయి. చేతులమీద తల ఆనించింది.
    స్వామి కరిగిపోయాడు. పిచ్చమ్మను రెండు చేతులా ఎత్తాలనుకున్నాడు. కాని_కాని ఏదో అడ్డు తగిలింది. దాన్ని సంస్కారం అనాలో_ మూర్ఖత్వం అనాలో_ ఆచారం అనాలో!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS